నాయకుల్లో ఆయన 'గుమ్మడి'.. రేవంత్ కలవరేం రోజుల తరబడి?
అలాంటి నాయకుడు ముఖ్యమంత్రిని కలవడానికి రోజుల తరబడి నిరీక్షించారు.
ఈ రోజుల్లో కనీసం ఎంపీటీసీ సభ్యుడైనా కోటీశ్వరుడు అయి ఉంటున్నారు.. ఖరీదైన కారులో తిరుగుతున్నారు.. లావాదేవీలు చేస్తూ రూ.కోట్లల్లో సంపాదిస్తున్నారు.. ఆయన మాత్రం ఐదుసార్లు ఎమ్మెల్యే.. తిరుగులేని ప్రజాదరణ.. అవినీతి మచ్చలేని నాయకుడు.. రాజకీయాల్లో భూతద్దం పెట్టి వెదికినా దొరకనంతటి అరుదైన వ్యక్తిత్వం. అలాంటి నాయకుడు ముఖ్యమంత్రిని కలవడానికి రోజుల తరబడి నిరీక్షించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే అనేక పార్టీలకు పుట్టినిల్లు. వామపక్షాలు, కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్.. ఇలా అన్ని పార్టీలు బలంగా ఉన్న జిల్లా. పునర్విభజనలో నాలుగు ముక్కలైనా ఉమ్మడి ఖమ్మంలో ఉన్న రాజకీయ వైవిధ్యం ఏ జిల్లాలోనూ ఉండదనేది నిజం. ఇలాంటి ఒక నియోజకవర్గమే ఇల్లందు. ఇక్కడినుంచి ఐదుసార్లు నెగ్గారు గుమ్మడి నర్సయ్య.
70 ఏళ్ల గుమ్మడి నర్సయ్య.. 1983 నుంచి ఐదుసార్లు ఇల్లందులో గెలిచారు. తాజాగా ప్రజా సమస్యలను విన్నవించేందుకు సీఎం రేవంత్ ను కలిసేందుకు నాలుగుసార్లు ప్రయత్నించి విఫలమ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో గురువారం వైరల్ గా మారింది.
సీఎంను కలిసేందుకు తెలిసిన నాయకులు, అధికారులకు ఫోన్ చేస్తే రమ్మంటున్నారని.. అసలు పని మాత్రం కావడగం లేదని వాపోయారు. సీతారామ ప్రాజెక్టు, పోడు భూములు, చెక్ డ్యాంలు, ఎత్తిపోతల పథకాల సమస్యలను సీఎంకు విన్నవించాలని ప్రయత్నిస్తున్నా. ఇంటి గేటు వద్దనే నిలువరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ అందరినీ కలుస్తారుగా?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేలే కాదు మంత్రులకు సైతం ఆయన టైం ఇవ్వడం మహా అరుదుగా చెప్పుకొనేవారు. ప్రజా గాయకుడు గద్దర్ సైతం ప్రజా భవన్ ఎదుట పడిగాపులు కాసిన వైనం అందరూ చూశారు. అయితే, రేవంత్ సీఎం అయ్యాక అలాంటి పరిస్థితి లేదు. తాను అందరికీ సమయం ఇస్తున్నట్లు రేవంత్ స్వయంగా చెప్పారు. అలాంటిది ఇప్పుడు గుమ్మడి నర్సయ్య విషయంలో ఎక్కడ పొరపాటు జరిగిందో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.