రంగరాజన్ పై దాడి: పోలీస్ కస్టడీలో నిందితుడు చెప్పిన కీలక విషయాలు

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడికి కారణం వారిద్దరి మధ్య జరిగిన వాగ్వాదమేనని రామరాజ్యం ఫౌండర్ వీరరాఘవ రెడ్డి వెల్లడించాడు.

Update: 2025-02-20 09:30 GMT

సమాజంలో మనకు ఎదురైనా ఘటనలే మనల్ని అత్యంత క్రూరులుగా మారుస్తాయి. అమెరికాలో ఇలానే కొందరు తమకు జరిగిన బాధకు బదులుగా గన్ పట్టుకొని విచ్చలవిడిగా కాలుస్తూ జనాలను చంపి కక్ష తీర్చుకుంటున్నారు. సైకోలుగా మారిపోతున్నారు. సమాజంలో అన్యాయానికి గురైన వారు ఒకప్పుడు నక్సలైట్లుగా మారితే.. నేడు సమాజంలోని ఉన్నత వ్యక్తులపై పడుతున్నారు. అమెరికాలో ఉన్న ఈ సంస్కృతి ఇప్పుడు ఇండియాకు పాకిందనడానికి చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడే ప్రధాన ఉదాహరణ.. రంగరాజన్ పై దాడి చేసిన నిందితుడు ‘రామరాజ్యం ఫౌండర్’ వీరరాఘవరెడ్డి పోలీస్ కస్టడీలో వెల్లడించిన విషయాలు ఇప్పుడు సంచలనమయ్యాయి. అతడి మైండ్ సెట్ అలా ఎలా మారిందో మనకు కళ్లకు కడుతున్నాయి.

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడికి కారణం వారిద్దరి మధ్య జరిగిన వాగ్వాదమేనని రామరాజ్యం ఫౌండర్ వీరరాఘవ రెడ్డి వెల్లడించాడు. దాడి చేసినందుకు చింతిస్తున్నానని, ఇకపై రామరాజ్యం సంస్థను శాంతియుతంగా ముందుకు తీసుకెళ్తానని అతను తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించి రెండో రోజు బుధవారం మొయినాబాద్ పోలీసులు అతన్ని విచారించారు. ఇందులో కీలక విషయాలు వెల్లడించాడు.

సీఐ పవన్ కుమార్ రెడ్డి విచారణలో భాగంగా.. "రామరాజ్యం సంస్థను ఎందుకు స్థాపించారు? రంగరాజన్‌పై దాడి ఎందుకు చేశారు?" అని ప్రశ్నించగా, వీరరాఘవ రెడ్డి తన వెర్షన్‌ను వెల్లడించాడు. వీరరాఘవ రెడ్డి వెల్లడిస్తూ.. ‘‘విద్యా వ్యవస్థలో తన బిడ్డ అనుభవించిన అన్యాయమే రామరాజ్యం స్థాపనకు కారణమని అతను చెప్పాడు. 2014–15 విద్యా సంవత్సరంలో తన కుమారుడు రెండో తరగతిలో ఉన్నప్పుడు, పాఠశాల యాజమాన్యం పై తరగతికి ప్రమోట్ చేయకుండా డీటైన్ చేసిందని వివరించాడు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా, యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపాడు. హైకోర్టును ఆశ్రయించినా న్యాయం జరగలేదని, చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోయిందని వెల్లడించాడు. ఈ పరిణామాల వల్ల వ్యవస్థలపై తనకు పూర్తిగా నమ్మకం పోయిందని, అందుకే సొంతంగా రామరాజ్యం సంస్థను ఏర్పాటు చేసినట్లు’’ చెప్పాడు.

- రంగరాజన్ మద్దతివ్వకపోవడమే వివాదానికి కారణం

తన సిద్ధాంతాలకు మద్దతు ఇవ్వాలని రంగరాజన్‌ను కోరగా, ఆయన అంగీకరించలేదని వీరరాఘవ రెడ్డి తెలిపాడు. ఈ కారణంగా వారిద్దరి మధ్య వాగ్వాదం ప్రారంభమైందని, తన వెంట ఉన్న అనుచరుల ముందు తనను చిన్నచూపు చూడకూడదనే భావనతో రంగరాజన్‌పై దాడికి దిగినట్లు పేర్కొన్నాడు.

- పదో తరగతి వరకే చదువు, వివిధ అంశాల్లో వీరరాఘవ రెడ్డికి పట్టు

తాను పదో తరగతి వరకే చదివినా, మత గ్రంథాలు, చట్టాలు, హిందూ ధర్మంపై అవగాహన పెంచుకున్నానని వీరరాఘవ రెడ్డి చెప్పాడు. హిందూ ధర్మాన్ని కాపాడేందుకు వివిధ ఆలయాలను సందర్శించి, రామరాజ్యానికి మద్దతు కోరినట్లు వెల్లడించాడు.

ఇలా సమాజంలో తనకు జరిగిన అన్యాయంపై తిరుగుబాటుతోనే వీరరాఘవరెడ్డి ఇలా రెబల్ గా మారారని అర్థమవుతోంది. తనకు మద్దతు ఇవ్వని రంగరాజన్ పై అందుకే దాడి చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు.

Tags:    

Similar News