ఎన్నికల వేళ.. అనర్హత గోల
వాస్తవాలను దాటి తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశాడన్నది ఇక్కడ ప్రధాన కారణం
తెలంగాణలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన కేసీఆర్.. ఓ వైపు అందుకు తగిన కసరత్తుల్లో మునిగిపోయారు. వచ్చే నెల మూడో వారంలో మెజారిటీ స్థానాల్లో పోటీపడే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించాలని చూస్తున్నారు. ఈ లోపు మరోవైపు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీపై అనర్హత కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించింది. మరోవైపు తన ఎన్నికను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణార్హం కాదంటూ.. దీన్ని తిరస్కరించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఇంకో వైపు ఆ పార్టీ ఎంపీ బీబీ పాటిల్.. తన ఎన్నికను సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను కొట్టేయాలని కోరగా.. అందుకు సుప్రీం కోర్టు తిరస్కరించింది.
ఇలా ఒక్క రోజులోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ అనర్హత విషయంలో వ్యతిరేక నిర్ణయాలు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2018 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ తరపున వనమా వెంకటేశ్వరరావు గెలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. అయితే అప్పటి ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావు.. వనమా ఎన్నికను కొట్టేయాలంటూ కోర్టును ఆశ్రయించారు.
వాస్తవాలను దాటి తప్పుడు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశాడన్నది ఇక్కడ ప్రధాన కారణం. దీనిపై సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు తాజాగా వనమా ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పు వెల్లడించింది. 2018 డిసెంబర్ 12 నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యే వెంకట్రావు మాత్రమే అంటూ పేర్కొంది. దీనిపై వనమా సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు.
మరోవైపు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా శ్రీనివాస్‌గౌడ్ ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్ విచారణకు అర్హమైందేనని హైకోర్టు తెలిపింది. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయనకున్న ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు వివరాలు అందజేశారని, అఫిడవిట్ సమర్పించిన తర్వాత మళ్లీ తీసుకుని సవరించడం చట్ట విరుద్ధమంటూ సీహెచ్ రాఘవేంద్రరావు పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లినా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు నిరాశే మిగిలింది. చివరకు హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారిస్తామని పేర్కొంది. అచ్చం ఇలాగే జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ విషయంలోనూ జరిగింది. తనపై ఉన్న క్రిమినల్ కేసులు, శిక్ష వివరాలను ఎంపీ వెల్లడించలేదని పిటిషన్ దాఖలైంది. దీన్ని కొట్టేయాలని పాటిల్ కోరితే సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు.
వీళ్లే కాదు కొప్పుల ఈశ్వర్, చెన్నమనేని రమేష్ విషయంలోనూ అనర్హత వేటు కత్తి వేలాడుతూనే ఉంది. మరి ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రజాప్రతినిధులపై అనర్హత కేసుల విషయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందనన్న ఉత్కంఠ నెలకొంది. వీళ్ల విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.