దరఖాస్తులు పేరుకుపోతున్నాయా ?
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధి సాయం కోసం పెట్టుకున్న దరఖాస్తులు పేరుకుబోతున్నాయట
మెడికల్ ఎమర్జెన్సీ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధి సాయం కోసం పెట్టుకున్న దరఖాస్తులు పేరుకుబోతున్నాయట. రాష్ట్రం మొత్తం నుండి ప్రతిరోజు వేలల్లో దరఖాస్తులు ముఖ్యమంత్రి కార్యాలయంకు వస్తున్నాయట. వీటిల్లో కొన్ని ఆయా నియోజకవర్గాల ఎంఎల్ఏల సిఫారసులతో వస్తుంటే మరికొన్ని డైరెక్టుగా అందుతున్నాయట. దరఖాస్తులు ఎలాగ వస్తున్నా రోజుకు సుమారు 3 వేలు వస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పెట్టుకున్నది మెడికల్ ఎమర్జెన్సీ అని తెలిసినా దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రం వెంటనే స్పందించటంలేదట.
తమకందిన మెడికల్ ఎమర్జెన్సీ ప్రతిపాదనలను సంబంధిత సెక్షన్ వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఏ హాస్పిటల్ నుండి అయితే దరఖాస్తు వచ్చిందో సదరు ఆసుపత్రికి ఫోన్ చేసి దరఖాస్తు నిజమా కాదా అన్నది తేల్చుకోవాలి. ఇలాంటి మినిమం ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు ఒక వారంరోజులు పట్టినా మిగిలిన ఐదు రోజుల్లో దరఖాస్తు మీద ఏదో పద్దతిలో యాక్షన్ తీసుకోవాలి. అయితే సమాచారం సేకరించిన తర్వాత కూడా యాక్షన్ తీసుకోవటంలో బాగా ఆలస్యమవుతోందట.
దీనికి కారణం ఏమిటంటే ఎంఎల్ఏలే అని తెలుస్తోంది. ఆసుపత్రులకు సీఎంఆర్ఎఫ్ తరపున సదరు పేషంట్ కు ఎంతమొత్తం మంజూరైందనే విషయంపై శాంక్షన్ లెటర్లు వెళుతున్నాయి. అయితే దానికి సంబంధించిన చెక్కులు మాత్రం అందటంలేదని సమాచారం. షెడ్యూల్ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదముద్రవేసిన దరఖాస్తులను నియోజకవర్గాల్లోని ఎంఎల్ఏల కార్యాలయాలకు పంపుతున్నారట. అంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుండి శాంక్షన్ లెటర్లు ఆసుపత్రులకు, చెక్కులు మాత్రం ఎంఎల్ఏల కార్యాలయాలకు వెళుతున్నాయి.
దీనివల్ల ఏమవుతుందంటే నియోజకవర్గాల్లో ఒక కార్యక్రమం ఏర్పాటుచేసి దరఖాస్తుదారుల కుటుంబసభ్యులను అక్కడికి పిలిపించి చెక్కులు పంపిణీ చేయాలని ఎంఎల్ఏలు డిసైడ్ చేశారట. దీంతో చెక్కుల పంపిణీ బాగా ఆలస్యమవుతోంది. ఎందుకంటే ఒక్కొక్కరికీ చెక్కులను విడిగా అందచేయలేరు. అందుకనే ఓ 300 చెక్కులు అందిన తర్వాత ఒకేసారి ఫంక్షన్ ఏర్పాటుచేసి చెక్కుల పంపిణీ చేయబోతున్నారు. దీనివల్లే బాగా ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి కార్యాలయం, ఎంఎల్ఏలు చేస్తున్నట్లు పార్టీలో టాక్ వినబడుతోంది. ఇందుకనే రోజురోజుకు దరఖాస్తులు పేరుకుపోతున్నాయట.