భయానకంగా తెలంగాణ ప్రాజెక్ట్... ప్రజల్లో టెన్షన్ టెన్షన్!
భారీ వర్షాలు కురుస్తుండటంతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులో వరద ఉధృతి పెరుగుతోంది
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులో వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 3 లక్షల 87 వేల క్యూసెక్కుల నీరు చేరుతుండడంతో ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం 697 అడుగులకు చేరుకుని గరిష్ట సామర్థ్యం 700 అడుగులకు చేరువైంది.
పెరుగుతున్న నీటిమట్టాలను అదుపు చేసేందుకు అధికారులు సత్వర చర్యలు చేపట్టి 14 వరద గేట్లను తెరిచి 2 లక్షల 47 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా ఖాళీ చేయిస్తున్నారు. గురువారం తెల్లవారుజాము నుంచి వరద ఉద్ధృతంగా రావడంతో అధికారులు మొత్తం 18 గేట్లను ఎత్తేందుకు యత్నించారు. వాటిలో తొమ్మిది మాత్రమే ఎత్తగలిగారు.
ఇక మిగతా తొమ్మిదింటిలో రెండింటికి కౌంటర్ వెయిట్లు బిగించని కారణంగా, మరో ఏడు సాంకేతిక సమస్యలతో ఎత్తడం ఇబ్బందికరమైందని తెలుస్తోంది. విద్యుత్తు మోటార్ల ద్వారా గేట్లు పైకిలేవకపోవడంతో స్థానిక యువకులు, సిబ్బంది కలిసి చేతులతో హాండిల్ తిప్పుతూ అతికష్టం మీద మూడింటిని ఎత్తగలిగారని సమాచారం.
ఈ సమయంలో పరిస్థితిని అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. వరద ప్రమాదాలను నివారించడానికి అవసరమైన చర్యలను అమలు చేస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో తమను తాము రక్షించుకోవడానికి ఈ ప్రాంతంలోని నివాసితులు అప్రమత్తంగా ఉండాలని.. స్థానిక అధికారుల సూచనలను పాటించాలని సూచించారు.
అయితే... నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోందని అంటున్నారు నిపుణులు. గతేడాది భారీ వరదల సమయంలో ప్రమాదపుటంచుల్లో వెళ్లిన ఈ ప్రాజెక్టు అతికష్టం మీద బయటపడింది. గతేడాది ముంపులో ఉన్నంత సేపు తెగ పరుగులు తీసిన అధికార యంత్రాంగం.. గట్టెక్కాక అటువైపు కన్నెత్తి చూడలేదు. ఈ ఏడాది భారీ వర్షాలు, అదే స్థాయిలో వస్తున్న వరదలతో అధికారులతో పాటు.. స్థానికులకు ముచ్చెమటలు పడుతున్నాయి.
కాగా నిర్మల్ జిల్లాలో 65 ఏళ్ల క్రితం నిర్మించిన కడెం జలాశయాన్ని ఈ.ఎన్.సీ బృందం గతంలో సందర్శించింది. కౌంటర్ వెయిట్లను జూన్ పది నాటికి బిగించాలని ఆదేశించింది. మరమ్మతులకు ప్రభుత్వం రూ.1.44 కోట్లను ఆలస్యంగా మంజూరు చేయడంతో టెండరు పూర్తవక పనులను చేపట్టలేదు.
దీంతో తరచుగా తలెత్తుతున్న సమస్యలు, భారీ వరదల వేళ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కడెం ప్రాజెక్టు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు వేడుకుంటున్నారు.