ఏం పర్లేదు..వాళ్లు అక్కడ గెలిచినా..తర్వాత మా దగ్గరకొచ్చేస్తారు
ప్రస్తుత తెలంగాణ బీజేపీ నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
``ఏం పర్లేదు. వెళ్లేవాళ్లను వెళ్లనివ్వండి. వచ్చే ఎన్నికల్లో వారు ఆ పార్టీలో గెలిచినా.. తర్వాత తిరిగి మా దగ్గరకొచ్చేస్తారు. గతం లో జరిగింది.. భవిష్యత్తులో జరిగేదీ ఇదే!`` అని ఉమ్మడి ఏపీ సీఎం, ప్రస్తుత తెలంగాణ బీజేపీ నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బండి సంజయ్ పార్టీని అన్ని విధాలా ముందుండి నడిపించారని, ఆయన లేని బీజేపీ లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పార్టీ మంచి జోష్ మీద ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.
``తెలంగాణ రాజకీయాల్లో అధికార పార్టీ బీఆర్ ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే. ఈ విషయంలో మీకేమైనా డౌటా?`` అని మీడియా మిత్రులను మాజీ సీఎం ప్రశ్నించారు. లేకపోతే.. దుబ్బాక, హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ను లేకుండా చేసేవాళ్లమా? అని అన్నారు. బీఆర్ ఎస్‌ను ఓడించి, కాంగ్రెస్‌ను మట్టి కరిపించే పార్టీ బీజేపీనేనని చెప్పారు. కాంగ్రెస్-బీఆర్ ఎస్-ఎంఐఎం పార్టీలు ఒకే తాను ముక్కలని చెప్పారు. వీటిలో ఏ పార్టీకి ఓటేసినా.. బీఆర్ ఎస్‌కు వేసినట్టేనని కిరణ్ చెప్పారు.
అధికార బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై మాజీ సీఎం విమర్శలు గుప్పించారు. ఈ రెండు ఎప్పుడూ కలిసే ఉన్నాయని, కానీ పైకి మాత్రం డ్రామాలు ఆడుతున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్నారు. బీజేపీ నుంచి పలువురు నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న మీడియా మిత్రుల ప్రశ్నలకు స్పందిస్తూ.. ``ఔనా.. అయితే.. వెళ్లనీయండి. వాళ్లువెళ్లినా ఫర్లేదు. అక్కడ గెలిచిన తర్వాత ఎలాగూ ఇక్కడికే(బీజేపీ) వస్తారు. గతంలోనూ ఇదే జరిగింది`` అని నల్లారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్‌లో గెలిచినప్పటికీ ఎమ్మెల్యేలు పార్టీ మారటం ఖాయమని చెప్పారు. ప్రైవేటు లిమిటెడ్ కంపేనీ, కుటుంబ పాలన వద్దని ప్రజలు కోరుకుంటున్నారని నల్లారి తెలిపారు. కలసికట్టుగా పనిచేస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ``బీఆర్ఎస్ కారు తాళాలు బీజేపీ తీసుకోవాల్సిన సమయం వచ్చింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటానికి ఎంతో సమయం లేదు. దీనికి నేను కూడా శక్తికి మించి పనిచేస్తా`` అని మాజీ ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.