పదవులు పంచినా ఢిల్లీకి టీ బీజేపీ నేతల క్యూ..?

తెలంగాణాలో బిజెపి చేపడుతున్న నియామకాలు ఇస్తున్న పదవులు అన్నీ కూడా నేతలకు ఏ మాత్రం సంతృప్తిని ఇవ్వకపోగా కొత్త తగవులు అసమ్మతి సెగలూ పొగలూ చుట్టుకుంటున్నాయని అంటున్నారు.

Update: 2023-07-29 13:30 GMT

రోగం ఒక చోట ఉంటే మందు మరో చోట అన్నట్లుగా తెలంగాణాలో బీజేపీ వ్యవహార శైలి ఉంది అని అంటున్నారు. తెలంగాణాలో బిజెపి చేపడుతున్న నియామకాలు ఇస్తున్న పదవులు అన్నీ కూడా నేతలకు ఏ మాత్రం సంతృప్తిని ఇవ్వకపోగా కొత్త తగవులు అసమ్మతి సెగలూ పొగలూ చుట్టుకుంటున్నాయని అంటున్నారు.

నిన్నటిదాకా తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్న బండి సంజయ్ కి తప్పించారు. పోనీలే కేంద్ర మంత్రి పదవి ఇస్తారు అనుకుంటే ఇపుడు తొమ్మిది మంది జాతీయ ప్రధాన కార్యదర్శులలో ఆయనను ఒకడిగా నియమించారు. అది కూడా ఏడవ నంబర్ తో సర్దారు అని ఆయన వర్గం గుర్రుమంటోంది. దాంతో బండికి ఈ పదవిని చూపించి కేంద్ర మంత్రి చాన్స్ లేకుండా చేశారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారుట.

ఇక బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవిలో డీకే అరుణ ఇప్పటికే ఉన్నారు. ఆమెను మరోసారి కొనసాగిస్తున్నారు. దాంతో డీకే కూడా ఏ మాత్రం హ్యాపీగా లేరు అని అంటున్నారు. ఆమె తాను సీఎం క్యాండిడేట్ ని అని అంటున్నారు. ఆమె అనుచర వర్గం అలాగే భావిస్తోంది. గద్వాల చుట్టు పక్కల ప్రాంతాలలో పట్టు ఆమెకు ఉంది. దాంతో పాటు సామాజికవర్గం కూడా తనకు ప్లస్ అవుతుందని ఆమె భావించారు. కానీ అదే సామాజికవర్గానికి చెందిన కిషన్ రెడ్డిని పార్టీ ప్రెసిడెంట్ గా చేశారు.

నిజానికి ఆ పదవిని డీకే ఆశించారు అని అంటారు. కానీ హై కమాండ్ వేరేగా డెసిషన్ తీసుకోవడంతో ఆమె వర్గం మండుతోందిట. ఇక కిషన్ రెడ్డిని తీసుకుంటే ఆయన హ్యాపీగా కీలకమైన శాఖలతో కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయనకు ఇష్టం లేకపోయినా టీ బీజేపీ ప్రెసిడెంట్ చేశారని అంటున్నారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం. ఆయనకు కీలకమైన పార్టీ పదవులు వస్తాయనుకుంటే జాతీయ కార్యవర్గ సభ్యుడిగా మాత్రమే నియమించారు.

ఇంకో వైపు ఈటెల రాజేందర్ ని ఎన్నికల కమిటీ ప్రెసిడెంట్ గా నియమించారు. కానీ ఆయన కూడా పూర్తి హ్యాపీగా లేరనే అంటున్నారు. దానికి కారణం వర్గ పోరే అని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో పదవులు ఎందరికి ఇచ్చినా కూడా అసమ్మతి అలా పెరిగిపోతోంది. తనకు ఇచ్చిన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి పట్ల బండి ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కానీ ఆయన ఢిల్లీ బయల్దేరి వెళ్ళారని అంటున్నారు.

అదే విధంగా డీకే అరుణ కూడా బీజేపీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారని అంటున్నారు. అదే విధంగా ఈటెల కూడా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడానికి రెడీ అయ్యారని చెబుతున్నారు. బీజేపీ గ్రాఫ్ చూస్తే కర్నాటక ఎన్నికల తరువాత బాగా పడిపోయింది. ఇక గత నెల రోజులుగా పదవుల భర్తీ సామాజిక న్యాయం అంటూ బీజేపీ చేస్తున్న ఆపరేషన్ పెద్దగా ఫలితాలు ఇవ్వకపోగా మరింతగా అగ్గి రాజేస్తోంది అని అంటున్నారు.

ముంగిట్లో ఎన్నికలు ఉంచుకుని బీజేపీ ఇంకా పదవుల పందేరంతోనే మునిగితేలుతూంటే దక్కిన వాళ్ళు ఒకలా దక్కని వారు మరోలా రియాక్ట్ అవుతున్న వేళ సమరానికి సన్నద్ధం అయ్యేదెలా అన్న చర్చ అయితే సగటు బీజేపీ క్యాడర్ లో ఉందనే అంటున్నారు.

Tags:    

Similar News