కేసీఆర్ ఒకలా.. కేటీఆర్ మరొకలా!
కేసీఆర్ చేతలకు తాజాగా ఆయన తనయుడు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు పొంతన లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ చూస్తున్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని కూడా ఎత్తుకున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో బలంగా ఉన్న వివిధ పార్టీ నేతలనూ కలిశారు. కానీ ఇటీవల జాతీయ రాజకీయాల పరంగా కేసీఆర్ సైలెంట్ అయిపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక మహారాష్ట్రలో బీఆర్ఎస్‌లో చేరికలు తప్ప.. ఇంకో మాట వినిపించడం లేదు.
ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రధాన విపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియాగా కూటమి ఏర్పాటు చేసుకున్నాయి. బీజేపీకి వ్యతిరేకమని చెబుతున్న కేసీఆర్.. ఈ కూటమిలో చేరారా? అంటే అదీ లేదు. కేసీఆర్ మౌనం వెనుక ఏదో వ్యూహం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే కేసీఆర్ చేతలకు తాజాగా ఆయన తనయుడు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు పొంతన లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మెట్రోను నగరం నలువైపులా విస్తరిస్తామని తాజాగా కేటీఆర్ ప్రకటించారు. మెట్రో నిధుల కోసం కేంద్రంలోని బీజేపీని అడుగుతామని.. స్పందించకపోతే వాళ్ల ఖర్మ అని కేటీఆర్ అన్నారు. అయితే 2024లో ఎలాగో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని, అప్పుడు కేంద్రంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించే అవకాశముందని కేటీఆర్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అప్పుడు నిధులు తెచ్చుకోవచ్చనే అర్థంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే కేసీఆర్ ఏమో జాతీయ రాజకీయాల పరంగా సైలెంట్‌గా ఉన్నారు. కేటీఆర్ ఎమో వచ్చే సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్ఎస్‌ది కీలక పాత్ర అంటున్నారు. పైగా సర్వేలు చూస్తేనేమో ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 ఎంపీ సీట్లు మాత్రమే గెలుస్తుందని చెబుతున్నాయి. మరి ఈ 8 మంది ఎంపీలతో బీఆర్ఎస్ కేంద్రంలో ఎలా చక్రం తిప్పుతుందో కేటీఆర్‌కే తెలియాలి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.