రాములమ్మకు ఆగ్రహం వస్తే అట్లుంటది మరి... మాజీ సీఎం కు షాక్!

ఆ తర్వాత విజయశాంతి ట్విటర్ వేదికగా తాను సమావేశం నుంచి ఎందుకు వెళ్లిపోయానో స్పష్టం చేశారు

Update: 2023-07-22 04:56 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో అధికార బీఆరెస్స్ అసంతృప్తులను బుజ్జగించుకుంటుంటే.. కాంగ్రెస్ పార్టీ చేరికలతో బిజీగా ఉంటే.. మరోపక్క బీజేపీ మాత్రం ఇప్పటికీ అంతర్గత కుమ్ములాటలతో అవస్త పడుతుందని తెలుస్తుంది. అధ్యక్షుడు మారినా పరిస్థితి మారలేదని స్పష్టమవుతుంది.

అవును.. నిన్నమొన్నటి వరకూ తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అంటూ అంతర్గత కుమ్ములాటలు జరిగాయని కథనాలొచ్చాయి. అసలు అధ్యక్షుడిని మార్చే ఆలోచనకు అదే ప్రధాన కారణం అనేవారూ లేకపోలేదు. ఈ సమయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించింది అధిష్టాణం.

ఇందులో భాగంగా... తెలంగాణ బీజేపీ తాజా అధ్యక్షుడిగా కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సమావేశం జరిగింది. హైదరాబాద్‌ లోని బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ బీజేపీ నేతలంతా హాజరయ్యారు!

ఇదే సమయంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలతోపాటు టి.బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి కూడా హారయ్యారు. ఈ సందర్భంగా ఎవ్వరూ ఊహించని ఒక సంఘటన జరిగింది. ఫలితంగా... టి.బీజేపీలో ఇది హాట్ టాపిక్ గా మారింది.

ఈ సభ జరుగుతున్న సందర్భంగా... విజయశాంతి ఆకస్మికంగా వాకౌట్ చేయడంతో బీజేపీ తెలంగాణ శాఖలో కలకలం రేగింది. కిషన్ రెడ్డిని కలిసిన విజయశాంతి.. ఆయనకు అభినందనలు తెలిపి, సభ ఇంకా కొనసాగుతుండగానే వేదిక నుంచి వెళ్లిపోయారు.

దీంతో విజయశాంతి అనూహ్యంగా సమావేశం నుంచి ఎందుకు వెళ్లిపోయారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఆ ఊహాగాణాలకు క్లారిటీ ఇచ్చే క్రమంలోనో ఏమో... ఆ తర్వాత విజయశాంతి ట్విటర్ వేదికగా తాను సమావేశం నుంచి ఎందుకు వెళ్లిపోయానో స్పష్టం చేశారు.

"నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఎవ్వరైనా ఉన్న సందర్భంలో, అక్కడ ఉండటం నాకు అసౌకర్యం, అసాధ్యం! ఆ పరిస్థితి వల్ల ముందుగానే వెళ్లవలసి వచ్చింది.." అని క్లారిటీ ఇచ్చారు.

దీంతో... కిరణ్ కుమార్ రెడ్డి పేరును స్పష్టంగా ప్రస్తావించకుండా... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో అవిభాజ్య ఏపీకి సీఎంగా ఉండి చివరి నిమిషం వరకు ఏపీ విభజనను వ్యతిరేకించిన ఆయన్ని టార్గెట్ చేస్తూ విజయశాంతి ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

కాగా, 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన సీఎం పదవిని, కాంగ్రెస్‌ ను కూడా ఆయన వదులుకున్న సంగతి తెలిసిందే. ఆ విషయాన్నే విజయశాంతి పరోక్షంగా స్పందించారని అంటున్నారు.

బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తప్పించి.. ఆయన స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించడంతో అంతా సద్దుమణిగినట్లు భావిస్తున్న తరుణంలో.. విజయశాంతి సభ నుంచి వాకౌట్ చేయడం, ఆ తర్వాత ఆమె చేసిన ట్వీట్ తెలంగాణ బీజేపీ లో కలకలం రేపిందని తెలుస్తుంది.

మరోపక్క ఈ సభలో మైకందుకున్న కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. తెలంగాణలో బీఅరెస్స్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని.. కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీఆరెస్స్ కు వేసినట్లేనని చెప్పిన ఆయన... కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత బీఆరెస్స్ పార్టీలోకి వెళ్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో తమకు కుటుంబ పాలన వద్దని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారని కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు!

ఇదే సమయంలో బీఆరెస్స్ సర్కారును గద్దె దింపి బీజేపీ అధికారంలోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపిన ఆయన... తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి తనవంతుగా కృషి చేస్తానని చెప్పారు.



Tags:    

Similar News