ఈ రచ్చలేంది రేవంత్.. మరికాస్తా టైట్ చేయాల్సిందే!

అదే సమయంలో ప్రభుత్వంలో పాలన కేంద్రీకరణతో ఉండాలా? వికేంద్రీకరణకు పెద్ద పీట వేయాలా? అన్న చర్చ జరుగుతూ ఉంటుంది.;

Update: 2025-03-02 05:24 GMT

ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో స్వేచ్ఛ ఉండాలా? వద్దా? అన్న దానిపై తరచూ డిబేట్ జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వంలో పాలన కేంద్రీకరణతో ఉండాలా? వికేంద్రీకరణకు పెద్ద పీట వేయాలా? అన్న చర్చ జరుగుతూ ఉంటుంది. కేసీఆర్ సర్కారునే తీసుకుంటే.. పదేళ్లు వ్యవహారాలు.. విషయాలన్ని సెంట్రలైజ్డ్ గా.. సింగిల్ విండోగా ఉండేవి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అయితే కేసీఆర్.. లేదంటే కేటీఆర్ అన్నట్లు ఉండేది. చివరకు సీఎస్ సైతం వారి ఆదేశాలకు తగ్గట్లు నడుచుకోవటమే తప్పించి.. సొంత నిర్ణయాలకు అవకాశమే ఉండేది కాదు. సీఎస్ పరిస్థితే ఇలా ఉంటే.. సీనియర్ సివిల్ అధికారుల సంగతిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుకదా.

అందుకు భిన్నంగా రేవంత్ సర్కారులో పాలన నడుస్తోందన్న వాదన తరచూ వినిపిస్తోంది. కేసీఆర్ పదేళ్ల సర్కారులో నిర్ణయం ఏదైనా.. గులాబీ బాస్ దే. జూనియర్ బాస్ మాట నడిచేది. ఇద్దరూ తండ్రీ కొడుకులే కావటం.. ఎవరెలా వ్యవహరిస్తారన్న దానిపై ఇద్దరికి అవగాహన ఉండేది కాబట్టి ఎలాంటి పంచాయితీలు ఉండేవి కావు. కానీ.. రేవంత్ సర్కారులో అలాంటి పరిస్థితి లేదు. పేరుకు ముఖ్యమంత్రే అయినప్పటికీ.. రేవంత్ కు చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకునే సీనియర్ అధికారులకు కొదవ లేదు. అలాంటి వారి విషయంలో చర్యలు తీసుకోవటానికి సీఎం రేవంత్ కు ఉండే పరిమితులు కాస్త ఇబ్బంది మారాయని చెప్పాలి.

తాజాగా ఒక ఉదంతం వెలుగు చూడటమే కాదు.. ముఖ్యమంత్రి రేవంత్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలన్న మాట బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వర్సెస్ సీఎంవో ఉండటమే దీనికి కారణం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో తీసుకున్న నిర్ణయాన్ని సీఎంవో అధికారి రచ్చ చేయటం ఏమిటి? అధికారిక ఉత్తర్వుల్లో ఆ విషయం బయటకు వచ్చేలా చేయటం దేనికి నిదర్శనం? అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకూ అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. తెలంగాణలో ఎకో టూరిజంను డెవలప్ చేయటానికి వీలుగా విధానాల్ని డిసైడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.

దీని కోసం టూరిజం అధికారులు ఇతర రాష్ట్రాలు.. దేశాల్లో పర్యటించి ఎకో టూరిజం డెవలప్ మెంట్ కోసం వారు చేస్తున్న చర్యలపై అధ్యయనం చేయాలని డిసైడ్ చేశారు. ఇందుకోసం సీఎంవోలో అటవీ శాఖ బాధ్యతలు చూసే అధికారి (చంద్రశేఖర్ రెడ్డి)తో పాటు ఆ శాఖకు సంబంధించిన మరికొందరిని ఎంపిక చేశారు. వీరంతా ఐఎఫ్ఎస్ అధికారులే. వీరంతా కెన్యా.. టాంజానియా దేశాల్లో పర్యటించి అక్కడ ఎకో టూరిజం మీద అధ్యయనం చేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 18న సీఎస్ శాంతకుమారి ఒక జీవో జారీ చేవారు.

ఈ టూర్ కు అయ్యే ఖర్చును తెలంగాన ఫారెస్టు డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుంచి తీసుకోవాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. జీవోకు తగ్గట్లే ఫిబ్రవరి 20 నుంచి 27 వరకు ఆయా దేశాల్లో పర్యటించిన టీం రాష్ట్రానికి తిరిగి వచ్చింది. ఇదిలా ఉండగా.. తనకు చెప్పకుండా విదేశాలకు ఎలా వెళతారంటూ పీసీసీ ఎఫ్ డోబ్రియాల్ మెమో జారీ చేశారు. సీఎంవోలోని చంద్రశేఖర్ మినహా మిగిలిన వారంతా తన కింద పని చేసే వారని.. తనకు చెప్పకుండా విదేశాలకు ఎలా వెళతారంటూ వివరణ కోరుతూ మెమో జారీ చేయటం సంచలనంగా మారింది. అధికారులు విదేశాల్లో ఉండగానే ఈ మెమోలు జారీ చేయటం హాట్ టాపిక్ గా మారింది.

ముఖ్యమంత్రి.. సీఎస్ అవగాహనతో తీసుకున్న నిర్ణయంపై ఇలా స్పందించటం ఏమిటి? అన్నదిప్పుడు చర్చగా మారింది. ప్రాసెస్ ప్రకారం జరగని అంశాలను చెప్పాల్సిన విధంగా చెప్పటం.. పాలన మీదా.. ప్రభుత్వం మీదా ఎలాంటి నెగిటివ్ ప్రభావం పడకుండా చూసుకోవాల్సిన దానికి భిన్నంగా ఇలా మెమోలు జారీ చేయటం సరికాదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి రచ్చలపై సీఎం రేవంత్ మరికాస్త టైట్ చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News