టీడీపీ నాలుగు దశాబ్దాల కల తీరేందుకు ముహూర్తం ఫిక్స్
ఏపీలో పెద్ద కార్పోరేషన్ గా ఉన్న విశాఖను సొంతం చేసుకోవడానికి టీడీపీ కూటమి చురుకుగా పావులు కదుపుతోంది.;
ఏపీలో పెద్ద కార్పోరేషన్ గా ఉన్న విశాఖను సొంతం చేసుకోవడానికి టీడీపీ కూటమి చురుకుగా పావులు కదుపుతోంది. దానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లుగా తెలిసింది. మార్చి 18 తో విశాఖ మేయర్ పదవీ కాలం నాలుగేళ్ళు పూర్తి అవుతుంది. మున్సిపల్ కార్పోరేషన్ చట్టం ప్రకారం నాలుగేళ్ళ తరువాత మేయర్ మీద అవిశ్వాసం పెట్టవచ్చు. ఆ విధంగా చూస్తే విశాఖ మేయర్ సీటు వైసీపీ నుంచి చేజారినట్లే లెక్క అని అంటున్నారు.
విశాఖ కార్పొరేషన్ లో మొత్తం 99 మంది కార్పోరేటర్లు ఉంటే అందులో ఒకటి ఖాళీ ఉంది. అలా 98కి ఈ నంబర్ ఉంటే ఎక్స్ అఫీషియో మెంబర్స్ కింద ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. దాంతో 109 దాకా ఈ నంబర్ పెరిగింది. ఇక మెజారిటీ సాధించాలి అంటే 55 మంది ఉంటే చాలు. కానీ ప్రస్తుతం విశాఖ కార్పోరేషన్ లో కూటమి బలం ఒక్కసారిగా పెరిగిపోయింది. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున కార్పోరేటర్లు టీడీపీ బీజేపీ జనసేనలలో చేరారు. టీడీపీకి దీంతో బలం 39కి పెరిగింది. బీజేపీకి 3గా ఉంటే జనసేన బలం 10కి పైగా పెరిగింది. ఈ లెక్కన చూసుకుంటే ఎక్స్ అఫీషియో మెంబర్స్ తో కలుపుకుని 60 మంది దాకా కూటమి బలం ఉంది.
మేయర్ మీద అవిశ్వాసం పెడితే చాలా సులువుగా కూటమి గెలిచే చాన్స్ ఉంది. దాంతో ఇప్పటి నుంచే కూటమి పార్టీలు ఆ దిశగా పావులు కదుపుతున్నాయి. మేయర్ పదవిని టీడీపీ తీసుకుంటుందని అంటున్నారు. అలాగే రెండు డిప్యూటీ మేయర్ పదవులలో ఒక దానిని జనసేనకు ఇస్తుందని చెబుతున్నారు. మేయర్ గా టీడీపీ నుంచి పీలా శ్రీను పేరు గట్టిగా వినిపిస్తోంది. డిప్యూటీ మేయర్లుగా చూస్తే ఒక పదవికి టీడీపీ నుంచి మహిళా కార్పోరేటర్ గొలగాని మంగవేణి, జనసేన నుంచి కందుల నాగరాజు వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే వైసీపీకి 2021లో జరిగిన ఎన్నికల్లో దాదాపుగా అరవై మంది దాకా కార్పోరేటర్లు దక్కారు. దాంతో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్స్ తో కలిపి బలంగా ఆ పార్టీ ఉండేది. 2024 ఎన్నికల తరువాత విశాఖ జిల్లాలో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు కావడంతో పాటు ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కార్పోరేటర్లు కూటమిలో చేరడంతో బాగా బలహీనమైంది.
వైసీపీకి ప్రస్తుతం నలభై లోపు మంది మాత్రమే కార్పోరేటర్లు ఉన్నారని అంటున్నారు. ఇక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మరెంత మంది కూటమి వైపు వెళ్తారో కూడా తెలియదని అంటున్నారు. ఏది ఏమైనా టీడీపీకి మేయర్ పీఠం దక్కబోతోంది. ఏకంగా నాలుగు దశాబ్దాల తరువాత టీడీపీకి ఈ కుర్చీ అందుతోంది.
టీడీపీ తొలిసారిగా విశాఖ మేయర్ పీఠాన్ని 1987లో గెలుచుకుంది. ఆ తరువాత మళ్ళీ ఆ కుర్చీ అయితే చిక్కలేదు ఎంత ప్రయత్నం చేసినా కూడా టీడీపీకి అది దూరం అవుతూనే వచ్చింది. ఇన్నేళ్ళకు విశాఖ మేయర్ టీడీపీ పరం అవుతోందన్న ఆనందం అయితే తమ్ముళ్లలో కనిపిస్తోంది.