కెప్టెన్ రోహిత్ పై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ మహిళా నేత
అంతేకాకుండా.. భారత క్రికెట్ చరిత్రలో ఆకట్టుకోలేని కెప్టెన్ అతడేనని వ్యాఖ్యానించడం రాజకీయంగా కూడా ప్రకంపనలు సృష్టించింది.;
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహ్మద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. రోహిత్ శర్మ లావుగా ఉన్నాడని, అతని ప్రదర్శన ఏమాత్రం ఆకట్టుకునేలా లేదని ఆమె పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అంతేకాకుండా.. భారత క్రికెట్ చరిత్రలో ఆకట్టుకోలేని కెప్టెన్ అతడేనని వ్యాఖ్యానించడం రాజకీయంగా కూడా ప్రకంపనలు సృష్టించింది.
- సోషల్ మీడియాలో షమా వ్యాఖ్యలు
సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ మహిళా నేత షమా మహ్మద్ చేసిన ఈ వ్యాఖ్యలు తక్కువ సమయంలోనే వైరల్ అయ్యాయి. ఓ యూజర్ రోహిత్ శర్మను ‘ప్రపంచస్థాయి ఆటగాడు’గా ప్రశంసించగా, ఆమె స్పందిస్తూ.. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, కపిల్‌దేవ్ వంటి దిగ్గజాలతో పోల్చడం ఏంటి? టీమిండియాకు కెప్టెన్‌గా ఉండే అదృష్టం పొందిన ఒక సాధారణ ఆటగాడు మాత్రమే’ అని షమా అభిప్రాయపడ్డారు.
- బీజేపీ, క్రికెట్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు
షమా మహ్మద్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. బాడీ షేమింగ్ తగదని, క్రికెట్ జట్టు కెప్టెన్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నీచమని మండిపడ్డారు. క్రికెట్ అభిమానులు సైతం ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ.. రోహిత్ శర్మ ప్రతిభను తగ్గించి చెప్పేందుకు చేసిన ప్రయత్నమని అన్నారు. బీజేపీ నేత రాధిక ఖేరా ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. గతంలో కాంగ్రెస్‌లో ఉండి ఆ తర్వాత బీజేపీలో చేరిన రాధిక ఖేరా మాట్లాడుతూ.. “రోహిత్ శర్మ తన జట్టును ప్రపంచకప్ విజయం వైపు నడిపిస్తే, రాహుల్ గాంధీ తన సొంత పార్టీని కూడా సమన్వయం చేయలేకపోతున్నాడు” అని వ్యాఖ్యానించారు.
- కాంగ్రెస్‌పై విమర్శలు
బీజేపీ నేతలు షమా మహ్మద్ వ్యాఖ్యలను కాంగ్రెస్ మొత్తం వైఖరికి నిదర్శనంగా పేర్కొన్నారు. క్రీడాకారులను అవమానించడం కాంగ్రెస్‌కు అలవాటేనని, గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని ఆరోపించారు. దేశానికి గౌరవం తీసుకువచ్చిన క్రికెటర్‌ను లక్ష్యంగా చేసుకోవడం మానుకుని, కాంగ్రెస్ తమ రాజకీయ విధానంపై దృష్టి సారించాలని రాధిక ఖేరా సూచించారు.
- ఇరుకునపడ్డ కాంగ్రెస్
షమా మహ్మద్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారాయి. కేంద్రమంత్రి నడ్డాతోపాటు బీజేపీ నేతలు, క్రికెట్ అభిమానులు ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడడంతో షామా వెంటనే తన పోస్ట్ ను డిలీట్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ వివాదం ఇంకా ముదురుతుండగా, ఆమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే సూచనలు కనిపించడంలేదు. మరోవైపు రోహిత్ శర్మపై వచ్చిన విమర్శలు అతడి ఆటపై ఎలాంటి ప్రభావం చూపుతాయా? దీనిపై రోహిత్ స్పందిస్తాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.