ఉత్తరాదికి జీ హుజూర్ గా దక్షిణాది...ఎందుకిలా ?
కాశ్మీర్ టూ కన్యాకుమారి దాకా భారతీయులు అంతా ఒక్కటి వారు భరత మాత ముద్దు బిడ్డలు అని గర్విస్తారు.;
భారతదేశం అంతా ఒక్కటి అన్నది వేలాది సంవత్సరాలుగా ఒక భావన. ఇది భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. నా దేశం గొప్పది అని అంతా అనుకుంటారు. ఆసేతు హిమాచలం అలాగే మురిసిపోతుంది. కాశ్మీర్ టూ కన్యాకుమారి దాకా భారతీయులు అంతా ఒక్కటి వారు భరత మాత ముద్దు బిడ్డలు అని గర్విస్తారు.
అయితే రాజకీయాలు మధ్యన వచ్చి ఈ అందమైన పవిత్రమైన భావనను చెడగొడుతున్నాయా అన్నదే చర్చగా ఉంది. రాను రానూ ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య వివక్ష చూపించే వైఖరి పాలకులలో ప్రబలుతోందా అన్నది కూడా చర్చగా ఉంది. ఉత్తరాదికి చెందిన వారే ఎప్పటికీ దేశాన్ని ఏలలా దక్షిణాదికి ఆ చాన్స్ దక్కదా అంటే దాదాపుగా ఎనిమిది దశాబ్దాల స్వాతంత్ర్య భారతంలో ఎక్కువ మంది ఉత్తరాది వారే ప్రధానులుగా అయ్యారు. ఎక్కడో ఒక పీవీ నరసింహారావు, ఒక దేవేగౌడా మాత్రమే అయ్యారు.
ఇక భవిష్యత్తులో చూసుకుంటే ఆ ముచ్చట కూడా ఉండే చాన్స్ లేదన్నది కేంద్రం తొందరలో చేపట్టబోయే డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా అర్ధమవుతోంది అని మేధావులు ప్రజాస్వామ్య ప్రియులు అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2026లో దేశవ్యాప్తంగా కొత్తగా పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయి. వాటిలో దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతోంది అని అంటున్నారు.
దానికి కారణం ఈ డీలిమిటేషన్ ప్రక్రియను జనాభా ప్రాతిపదికన చేపట్టడమే అని అంటున్నారు. ఈ విధంగా చేస్తే కనుక దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుంది. కొత్తగా ఎంపీ సీట్లు ఏ మాత్రం పెరగవు. అదే సమయంలో ఉత్తరాదిన అమాంతంగా సీట్లు పెరిగిపోతాయి. ఇదే కనుక జరిగితే దేశంలో ఉత్తరాది రాజకీయ పెత్తనం దక్షిణాది మీద పెరిగిపోయి అది శాశ్వతంగా దక్షిణాదిని జీ హుజూర్ చేసేలా మారుస్తుందని అంటున్నారు.
1972లో జరగాల్సిన డీలిమిటేషన్ ని ఆనాడు ప్రధానిగా ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ దేశంలో జనాభా ప్రాతిపదికన ఇది చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని భావించి పాతికేళ్ళ పాటు దానిని అమలు చేయకుండా నిలుపుదల చేశారు. ఈ పాతికేళ్ళలో దక్షిణాది రాష్ట్రాల మాదిరిగా విద్య వైద్యం ఇతర రంగాలలో ఉత్తరాది రాష్ట్రాలు మెరుగైన స్థితిలో ఉంటే అపుడు డీలిమిటేషన్ చేయాలని ఆమె అభిప్రాయపడ్డారు. జనాభా నియంత్రణ పాటించి దేశంలో అభివృద్ధికి బాటలు వేసిన దక్షిణాది రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ అంటే భారీగా నష్టపోతాయన్నది ఆమె భావనగా ఉంది.
ఇక ఆ పాతికేళ్ళ కాలం 2021లో ముగిసింది. ఆనాటికి దేశంలో ప్రధానిగా ఉన్న వాజ్ పేయి కూడా ఇందిరాగాంధీ మాదిరిగానే ఆలోచించారు. దేశంలో జనాభా నియంత్రణ పాటించి అభివృద్ధికి చోదకశక్తిగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు రివార్డులు ఇవ్వాల్సింది పోయి వాటిని తిరిగి శిక్షించే విధంగా డీలిమిటేషన్ తో సీట్లలో కోత వేయడం తగదని వాజ్ పేయి పెద్ద మనసులో ఆలోచించారు. అందుకే మరో పాతికేళ్ళ పాటు ఈ డీలిమిటేషన్ ప్రక్రియను వాయిదా వేశారు.
ఇక చూస్త్గే 2026తో ఆ గడువు ముగియబోతోంది. అయితే బీజేపీ మూల పురుషుడు వాజ్ పేయి ఆలోచనలను సైతం పక్కన పెట్టి ప్రస్తుత పాలకులు జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ కి పూనుకుంటున్నారు అని అంటున్నారు. దీని వల్ల ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ఎంపీలు వస్తాయి. దక్షిణాదికి అతి తక్కువ మంది ఎంపీలు మాత్రమే వస్తారు.
అలా ఉత్తరాదికి ప్రభుత్వ ఏర్పాటులో పై చేయిగా ఉంటుంది. దాక్షిణ భారతం నామమాత్రం అవుతుంది. అందుకే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ని వద్దు అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎలుగెత్తి చాటారు. ఇది దక్షిణాదికే అన్యాయం అన్నారు. అదే మాటను తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్నారు. దక్షిణాది అంతా ఒక్కటిగా నిలిచి ఈ డీలిమిటేషన్ విధానం మీద పోరాడాలని కూడా స్టాలిన్ పిలుపు ఇచ్చారు.
మరో వైపు చూస్తే ఈ డీలిమిటేషన్ వల్ల ఉత్తరాదిన సీట్లు ఎక్కువగా పెరుగుతాయని ముందే తెలుసుకుని దానికి అనుగుణంగానే రెండేళ్ళ క్రితం పార్లమెంట్ నూతన భవనం నిర్మాణంలోనూ బీజేపీ పాలకులు తమ లౌక్యాన్ని ప్రదర్శించారా అన్న చర్చ వస్తోంది. ఎందుకంటే మొత్తం పార్లమెంట్ సీట్లు కొత్త భవనంలో 888 మాత్రమే ఉన్నాయి. ఇక ప్రచారంలో జరుగుతున్న దాని ప్రకారం చూస్తే జనాభా ప్రాతిపదికన జరిగే డీలిమిటేషన్ లో ప్రస్తుతం పార్లమెంట్ లో ఉన్న 547 సీట్లు కాస్తా 846గా మారుతాయని అంటున్నారు.
ఇందులో ఒక్క్స్ యూపీ బీహార్ కి 222 సీట్లు ఉంటాయని అంటున్నారు. అంటే మొత్తం పార్లమెంట్ సీట్లలో పాతిక శాతం కంటే ఎక్కువ అన్న మాట. అలాగే మిగిలిన రాష్ట్రాలకు 461 సీట్లు వస్తే మొత్తం అయిదు రాష్ట్రాలు కలిగిన దక్షిణాదికి దక్కే ఎంపీ సీట్లు కేవలం 165 మాత్రమే అని అంటున్నారు. ఇందులో తెలంగాణాకు 17 నుంచి 20 దాకా మాత్రమే ఎంపీ సీట్లు పెరుగుతాయని, అలాగే ఏపీకి 25 నుంచి 28, తమిళనాడుకు 39 నుంచి 41, కేరళకు 20 నుంచి 19కి తగ్గుతాయని అంటున్నారు.
ఇక ఉత్తరప్రదేశ్ కి 80 నుంచి 122 సీట్లు, బీహార్ కి 40 నుంచి 70 సీట్లు, రాజస్థాన్ కి 25 నుంచి 48 సీట్లు, మహారాష్ట్రకు 48 నుంచి 68 సీట్లుగా పెరుగుతాయి. మరి ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ తమిళనాడుకు ఒక్క సీటు కూడా డీలిమిటేషన్ వల్ల తగ్గదు అని చెప్పారు. మరి ఉత్తరాది రాష్ట్రలకు పెద్ద ఎత్తున సీట్లు పెరిగితే వాటితో పాటుగా పెరగాల్సిన తమిళనాడుకు ఈ అన్యాయం ఏమిటి అని అంతా ప్రశ్నిస్తున్నారు.
ఈ రకమైన పద్దతిలో డీలిమిటేషన్ జరిగితే కనుక శాశ్వతంగా ఉత్తరాదికి దక్షిణాది బానిసగా మారుతుందని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు. దక్షిణాదిన వచ్చే సీట్లూ ఓట్లూ కూడా పెద్దగా లెక్కలోకి రాకుండా దేశాన్ని ఏలవచ్చు. ఉత్తరాదిన ఏ మూడు నాలుగు రాష్ట్రాలను మ్యానేజ్ చేసుకుంటే చాలు అధికారం కూడా శాశ్వతంగా ఒకే పార్టీ చేతిలో ఉంటుంది అని అంటున్నారు. బీజేపీకి హిందీ బెల్ట్ లో పట్టు ఉంది. దాంతో వారు అందుకే ఉత్తరాదిన సీట్ల పెంపునకు ఫోకస్ పెడుతున్నారని అంటున్నారు. సో దక్షిణాది రాష్ట్రాలు ఈ విషయంలో ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ప్రజలలో చైతన్యం రావాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజలలో కూడా దీని మీద పోరాటం రావాల్సిన అగత్యం ఉంది.