మళ్లీ పంచ్.. మోడీని గిరి అడవుల్లోకాదు మణిపూర్ టూర్ చేయాలన్న ప్రకాష్ రాజ్
తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ గిరి అడవులకు టూర్ వెళ్లిన నేపథ్యంలో ఆయన మణిపూర్ పరిస్థితులపై కూడా దృష్టి సారించాలని సూచిస్తూ ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.;
ప్రముఖ నటుడు, రాజకీయ విమర్శకుడు ప్రకాష్ రాజ్ మరోసారి తన విమర్శనాస్త్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీపై సంధించారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ గిరి అడవులకు టూర్ వెళ్లిన నేపథ్యంలో ఆయన మణిపూర్ పరిస్థితులపై కూడా దృష్టి సారించాలని సూచిస్తూ ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ప్రకాష్ రాజ్ ట్విట్టర్‌లో చేసిన ఒక పోస్ట్‌లో " వావ్.. మీ ఫొటోలు చాలా అందంగా ఉన్నాయి.. గ్రేట్ పిక్స్.. మీ ఫొటో షూట్ మణిపూర్ లో కూడా ఉండాలని కోరుకుంటున్నా.. #జస్ట్ ఆస్కింగ్" అంటూ ఎద్దేవా చేశారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మణిపూర్‌లో నెలకొన్న శాంతిభద్రతా సమస్యలు, అల్లర్లు, నిరసనల నేపథ్యంలో ప్రధాని మోడీ ఇప్పటివరకు మణిపూర్‌ను ఎందుకు సందర్శించలేదని ప్రకాష్ రాజ్ ఇలా ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇంతకుముందు కూడా ప్రకాష్ రాజ్ ప్రధానిని, కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఆయన తాజా ట్వీట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఆయన వ్యాఖ్యలను సమర్థించగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
మణిపూర్‌లో నెలకొన్న సమస్యలపై ప్రధాని మోడీ ఎలా స్పందిస్తారో చూడాలి. కానీ, ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు మాత్రం మరోసారి చర్చకు దారితీశాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని గిరి అడవులను సందర్శించి, అక్కడి ఆసియాటిక్ సింహాలను తన కెమెరాలో బంధించి, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలు ఆయన ప్రకృతి ప్రేమను, ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తిని ప్రతిబింబిస్తున్నాయి.
గిరి అడవులు ప్రపంచంలోనే ఆసియాటిక్ సింహాల ఏకైక సహజ నివాస స్థలంగా ప్రసిద్ధి గాంచాయి. ప్రధాన మంత్రి మోదీ ఈ ప్రాంతాన్ని సందర్శించడం ద్వారా ఈ ప్రత్యేక జాతి సంరక్షణకు ప్రాధాన్యతను చూపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ప్రజల నుండి విశేష స్పందనను పొందాయి. వీటినే షేర్ చేస్తూ ప్రకాష్ రాజ్ ఇలా సెటైర్లు వేయడం హాట్ టాపిక్ గా మారింది.