వారానికి 60 గంటల పని.. తప్పేం కాదన్న గూగుల్ కో ఫౌండర్
ఇది ఉద్యోగుల్లో ప్రొడక్టివిటీ పెంచడానికి, AI రంగంలో ముందంజలో నిలవడానికి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.;
టెక్నాలజీ రంగంలో ఉన్న సంస్థలు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పోటీ పడుతున్న సంస్థలు, ఉద్యోగుల పని గంటలను పెంచాలని కోరుతున్నాయి. ఈ జాబితాలో గూగుల్ సహ వ్యవస్థాపకుడు (Co-Founder) సెర్జీ బ్రిన్ కూడా చేరిపోయారు. ఆయన ఉద్యోగులకు ఒక నోట్ రాసి వారానికి 60 గంటలు పనిచేయాలని సూచించారు. ఇది ఉద్యోగుల్లో ప్రొడక్టివిటీ పెంచడానికి, AI రంగంలో ముందంజలో నిలవడానికి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
-AI పోటీ లో నిలవాలంటే 60 గంటలు పని తప్పదు
సెర్జీ బ్రిన్ తన నోట్‌లో AI రంగంలో ఉన్న తీవ్రమైన పోటీ గురించి ప్రస్తావించారు. "ఈ రేసులో మనం నిలవాలి, గెలవాలి అంటే వారానికి కనీసం 60 గంటలు పని చేయాలి. ప్రతిరోజూ ఆఫీసుకు రావాలి. అప్పుడే ప్రొడక్టివిటీ పెరుగుతుంది" అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇటీవల భారత్‌లోనూ చర్చనీయాంశంగా మారిన 70 గంటల పని వాదనతో పోలుస్తున్నారు. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి, అలాగే L&T సంస్థల ఫౌండర్లు కూడా ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేయాలని కోరుతూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు సెర్జీ బ్రిన్ కూడా అదే దిశలో వ్యాఖ్యలు చేయడం టెక్ రంగంలో సంచలనం రేపుతోంది.
- ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుందా?
ఈ విధమైన సూచనలు ఉద్యోగుల్లో ఒత్తిడిని పెంచవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు, అధిక పనిభారం వంటి సమస్యలు ఉన్నాయి. AI , టెక్ విప్లవం కొనసాగుతున్న నేపథ్యంలో, కంపెనీలు తమ ఉద్యోగుల నుంచి మరింత పని ఆశిస్తున్నాయి. అయితే దీని ప్రభావం ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై ఎలా పడుతుందనేది పరిశీలించాల్సిన అంశం.
-సంస్థలకు లాభమా, ఉద్యోగులకు భారమా?
ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేయడం కంపెనీలకు మేలు చేసేదే. కానీ దీని వల్ల ఉద్యోగులు అలసిపోవడం, పనిపై ఆసక్తి తగ్గడం, జీవన శైలిలో మార్పులు రావడం వంటి సమస్యలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సంస్థలు వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌ను ప్రోత్సహిస్తుండగా, మరికొన్ని కంపెనీలు మాత్రం ఎక్కువ పని గంటలను ప్రాధాన్యత ఇస్తున్నాయి.
- ముందు ముందు ఏం జరగబోతోంది?
AI రంగంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ తరహా వాదనలు మరింత పెరిగే అవకాశం ఉంది. కంపెనీలు ఉద్యోగులను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి కొత్త విధానాలను అనుసరించవచ్చు. అయితే దీని ప్రభావాన్ని ఉద్యోగులు ఎలా స్వీకరిస్తారనేదే కీలకం.
సెర్జీ బ్రిన్ చేసిన ఈ వ్యాఖ్యలు టెక్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసినప్పటికీ, ఉద్యోగుల మనోభావాలను, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కూడా సంస్థలు పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.