జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు అదుర్స్..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.;
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 14వ తారీకు నాటికి జనసేన పార్టీ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో అంతే ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్ర మాన్ని నిర్వహించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నెల 14న జనసేన ఆవిర్భావ సభను పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు కీలక కమిటీలను ఏర్పాటు చేశారు.
ఈ కమిటీలు సభ నిర్వహణతోపాటు.. ఎలాంటి తోపులాటలకు తావులేకుండా.. జన నిర్వహణను చేపట్టాల్సి ఉంటుంది. క్రౌడ్ మేనేజ్‌మెంట్ సహా ఏర్పాట్లపై దృష్టి పెట్టనుంది. ఇప్పటికే స్థానికంగా కొన్నికమిటీలను ఏర్పాటు చేసిన పార్టీ అధినాయకత్వం.. ఇప్పుడు మంత్రి కందుల దుర్గేష్ తో కూడిన 10 మంది సభ్యులతో మరో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దీనిలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా చోటు దక్కింది. అదేవిధంగా కొత్తపల్లి సుబ్బారాయుడు, యర్రంకి సూర్యారావు, పడాల అరుణ వంటి వారిని కూడా ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు.
అలాగే..జనసమీకరణ కోసం కూడా ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా ఈ కమిటీలు జనసమీకరణ చేస్తాయి. తద్వారా.. పార్టీ ఆవిర్భావ సభను దిగ్విజయం చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇక, 2014 మార్చి 14న జనసేన ఆవిర్భావం జరిగింది. అప్పటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న పార్టీ.. ఏపీలో టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ప్రకటిం చింది. దీంతో ఆ కూటమి అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో తొలిసారి రంగంలోకి దిగిన జనసేన కమ్యూనిస్టులు, బీఎస్పీ తో జతకట్టి .. ఎన్నికలకు వెళ్లింది. అయితే.. వైసీపీ హవాలో కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం దక్కించుకుంది.
2019-24 మధ్య..
2019లో పవన్ కల్యాణ్ ఓడిపోయినా.. పట్టుదలతో ముందుకు నడిచి పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేశారు. ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ మారినప్పటికీ.. ఆయన బీజేపీతో జత కట్టి.. ఏపీలో పట్టు పెంచుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే టీడీపీతో కూటమి కట్టి.. 2024 ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. ప్రస్తుతం 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎంపీలతో జనసేన బలం పుంజుకోవడం గమనార్హం. ఇక, ఈ ఆవిర్భావ సభ ద్వారా.. జనసేన భవిష్యత్తు ప్రణాళికను ఆవిష్కరించే అవకాశం ఉంది.