కాంగ్రెస్ మహిళా నేత హిమాని కేసులో షాకింగ్ ట్విస్ట్.. నిందితుడు ఎవరంటే?

హర్యానాలో కాంగ్రెస్ మహిళా నేత హిమాని నర్వాల్ దారుణ హత్యకు గురవడం తీవ్ర సంచలనం సృష్టించింది.;

Update: 2025-03-03 06:56 GMT

హర్యానాలో కాంగ్రెస్ మహిళా నేత హిమాని నర్వాల్ దారుణ హత్యకు గురవడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, హిమాని హత్య కేసులో సోమవారం ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఢిల్లీకి చెందిన వ్యక్తిగా గుర్తించబడగా, అతడు హిమాని సన్నిహితుడు అని పోలీసులు అనుమానిస్తున్నారు.

- హిమాని హత్య కేసులో కీలక మలుపు

హిమాని నర్వాల్ హత్య కేసులో అరెస్టయిన నిందితుడి వివరాలను పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, అతని వద్ద నుంచి హిమాని మొబైల్ ఫోన్, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు విచారణలో నిందితుడు హిమాని స్నేహితుడిగా, అత్యంత సన్నిహితుడిగా ఉన్నట్టు తేలింది. అంతేకాదు అతడు హిమాని నివాసానికి సమీపంలోనే ఉంటున్నాడని సమాచారం. హిమాని అతడిని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిందని కొన్ని ఆరోపణలు కూడా వెలువడుతున్నాయి. ఈ అంశంపై మరింత సమాచారం కోసం దర్యాప్తు కొనసాగుతోంది.

- హత్యకు దారితీసిన ఘటన

హిమాని నర్వాల్ గత శనివారం హత్యకు గురయ్యారు. హత్య అనంతరం దుండగులు ఆమె మృతదేహాన్ని సూట్ కేసులో మూటగట్టి ఓ నిర్మానుష ప్రాంతంలో పడేశారు. రోహతక్ జిల్లాలోని సంప్లా బస్టాండ్ సమీపంలో ఓ అనుమానాస్పదమైన సూట్ కేసు కనపడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసును పరిశీలించగా, అందులో హిమాని మృతదేహం బయటపడింది. మృతదేహంపై గాయాలున్నాయని, ప్రత్యేకించి మెడపై గాయాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. దీంతో, ఇది హత్యేనని స్పష్టమైంది.

- హిమనీ తల్లి సంచలన ఆరోపణలు

హిమాని నర్వాల్ గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో చురుగ్గా పాల్గొన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో పదేళ్లుగా సేవలందించినట్లు తెలిసింది. హిమాని హత్యపై ఆమె తల్లి సవిత తీవ్ర ఆరోపణలు చేశారు. తన కూతురు కాంగ్రెస్‌లో ఎదుగుదలను తట్టుకోలేక కొందరు నేతలే హత్య చేయించారని ఆమె ఆరోపించారు. పార్టీలో కొంతకాలంగా గొడవలు, వాగ్వాదాలు జరుగుతున్నాయని, తన కూతురు తనతో చెప్పేదని తెలిపారు. హిమాని హత్యపై న్యాయం జరిగే వరకు ఆమె అంత్యక్రియలు చేయనని తల్లి స్పష్టం చేశారు.

- దర్యాప్తు వేగవంతం

హిమాని నర్వాల్ హత్య కేసును వీలైనంత త్వరగా ఛేదించేందుకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. సంప్లా డీఎస్పీ రజనీష్ కుమార్ మాట్లాడుతూ, బాధితురాలి కుటుంబం ఢిల్లీలో ఉండగా, హిమాని ఒంటరిగా హర్యానాలో ఉంటున్నారని వెల్లడించారు. ఈ హత్య కేసులో మరిన్ని నిజాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

హిమాని హత్య కేసు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News