బార్డర్ దాటుతూ.. ఇజ్రాయెల్ కాల్పుల్లో కేరళ వాసి మృతి!

జోర్డాన్ నుంచి అక్రమంగా ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించే ప్రయత్నంలో ఉన్న భారతీయుడిపై ఇజ్రాయెల్ భద్రతా దళాలు కాల్పులు జరిపారు.;

Update: 2025-03-03 09:42 GMT

జోర్డాన్ నుంచి అక్రమంగా ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించే ప్రయత్నంలో ఉన్న భారతీయుడిపై ఇజ్రాయెల్ భద్రతా దళాలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కేరళలోని తిరువనంతపురం జిల్లాకు చెందిన 47 ఏళ్ల థామస్ గాబ్రియేల్ ప్రాణాలు కోల్పోయారు. గాబ్రియేల్, కేరళలో రిక్షా డ్రైవర్‌గా పని చేస్తూ టూరిస్ట్ వీసాపై జోర్డాన్ వెళ్లారు. అయితే, అక్కడి నుంచి ఇజ్రాయెల్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించగా, భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు.

భారత రాయబార కార్యాలయం గాబ్రియేల్ కుటుంబానికి ఈ-మెయిల్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో టూరిస్ట్ వీసాపై జోర్డాన్ వెళ్లిన గాబ్రియేల్, అక్కడి నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్లాలని యత్నించారని, అయితే ఈ విషయం తమకు తెలియదని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

ఫిబ్రవరి 10న భద్రతా దళాలు గాబ్రియేల్‌ను ఆపేందుకు ప్రయత్నించగా, ఆయన సహకరించలేదని, అందుకే కాల్పులు జరపాల్సి వచ్చిందని ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు. తలలో బుల్లెట్ తగిలి అక్కడికక్కడే మరణించారని, అనంతరం ఆయన మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. అయితే, ఏ ఆస్పత్రిలో ఉంచారనే విషయం తెలియజేయలేదని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.

గాబ్రియేల్ చివరిసారిగా ఫిబ్రవరి 9న కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారని, అప్పటి నుంచి ఎలాంటి సంబంధం లేకుండా పోయిందని ఆయన బంధువులు తెలిపారు. "అతను సురక్షితంగా ఉన్నాడని అనుకున్నాం. కానీ, అకస్మాత్తుగా కాల్ చేసి కట్ చేశాడు. ఆ తర్వాత నుంచి ఎలాంటి సమాచారమూ లేదు," అని వారి కుటుంబ సభ్యుడు తెలిపారు.

జోర్డాన్‌లోని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్ ద్వారా, "దురదృష్టవశాత్తు ఒక భారతీయుడు ఈ ఘటనలో మృతిచెందాడు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు జోర్డాన్ అధికారులతో కలిసి పని చేస్తున్నాం" అని పేర్కొంది.

Tags:    

Similar News