గోరంట్ల చంద్రబాబు వ్యతిరేకా... సంచలన వ్యాఖ్యలు చేసిన పెద్దాయన !

తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులలో ఆయన ఒకరు. ఆయన అన్న గారికి పరమ భక్తుడు. ఎన్టీఆర్ చైతన్యరధం వెంట నడచిన లక్షలాది మందిలో ఆయన కూడా ఉన్నారు.;

Update: 2025-03-03 01:30 GMT

తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులలో ఆయన ఒకరు. ఆయన అన్న గారికి పరమ భక్తుడు. ఎన్టీఆర్ చైతన్యరధం వెంట నడచిన లక్షలాది మందిలో ఆయన కూడా ఉన్నారు. ఆయన చురుకుదనం చూసి అన్న గారు ఆ రోజులలో టికెట్ ఇచ్చారు. అలా గోరంట్ల బుచ్చయ్యచౌదరి తొలిసారి అసెంబ్లీలోకి 1983లో అడుగుపెట్టారు.

ఆ తరువాత ఆయన అనేక ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు. ఇప్పటిదాకా ఏడు దఫాలు ఎమ్మెల్యే అయిన గోరంట్లకు మంత్రి పదవి మాత్రం ఎపుడూ దూరమే అయింది. ఆయనకు 1994లో ఎన్టీఆర్ మూడోసారి గెలిచినపుడు మంత్రి పదవి లభించింది. అయితే కేవలం ఎనిమిది నెలల కాలంలోనే ఆ పదవి పోయింది. అప్పటి నుంచి ఆయన మళ్ళీ మంత్రి కాలేదు. టీడీపీలో చంద్రబాబు నాయకత్వంలో ఆయన ఎన్నో సార్లు గెలిచినా కూడా మంత్రి కాలేకపోయారు.

దీని మీద తాజాగా మీడియాతో మాట్లాడుతూ గోరంట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అన్న గారికి వీర విధేయుడిని ఆయన మరణించేంతవరకు ఆయనతోనే ఉన్నాను అని చెప్పారు. ఆ తరువాత చంద్రబాబు పిలుపు మేరకు టీడీపీలో క్రియాశీలం అయ్యానని చెప్పారు.

తాను ఎన్టీఅర్ కి విధేయుడిని బాబుకు వ్యతిరేకిని అన్న దాని వల్లనే మంత్రి పదవి దక్కలేదన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. చంద్రబాబు కూడా తనకు అనేకసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు.

అయితే మంత్రి పదవి విషయంలో అనేక సామాజిక సమీకరణలు పనిచేస్తాయని ఆయన చెప్పారు. 2024 ఎన్నికల్లో గెలిచిన తరువాత మంత్రి పదవి ఇస్తారేమో అని ఆశించాను అని అన్నారు. అయితే తనకు దక్కలేదు. దాంతో తాను ఏమీ అసంతృప్తి చెందలెదని గోరంట్ల స్పష్టం చేశారు. తన పని తాను చేసుకుని పోవడమే తెలుసు అని అన్నారు.

తాను 1982 నుంచి టీడీపీలో ఉన్న నేతను అని చెప్పారు. టీడీపీలో తాను అందరి కంటే సీనియర్ ని అని గోరంట్ల అన్నారు. రాజకీయాల్లో బాబు సీనియర్ కావచ్చు కానీ పార్టీలో మాత్రం తానే సీనియర్ అని ఆయన గట్టిగా చెప్పారు.

ఇదిలా ఉంటే ఎనిమిది పదులకు చేరువలో ఉన్న ఈ పెద్దాయన 2024 అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన తొలి సభలో ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించారు. ఆయన తన రాజకీయ జీవితంలో మొత్తం 11 సార్లు పోటీ చేస్తే ఏడు సార్లు గెలిచారు. తెలుగుదేశం మూల స్థంభాలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న గోరంట్లకు మంత్రి పదవి వస్తే చూడాలని చాలా మంది కోరిక. ఏమో ఈ టెర్మ్ లో అది జరుగుతుందేమో చూడాలని ఆయన అభిమానులు అనుచరులు అయితే ఆశ పడుతున్నారు. ఇక గోరంట్ల తన మనోభావాలను అన్నీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించగా అవి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News