నువ్వు వస్తానంటే.. మేమొద్దంటామా? జీవీ రెడ్డి పై ఇంట్రస్టింగ్ అప్డేట్
టీడీపీలో దుమారం రేపిన జీవీ రెడ్డి ఎపిసోడ్ కీలక మలుపు తిరిగిందని అంటున్నారు. ఆయనకు పార్టీ అధిష్టానానికి మధ్య సయోధ్య కుదిరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
టీడీపీ అధిష్టానం.. ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ జీవీ రెడ్డి మధ్య ప్రేమ సందేశాలు మొదలయ్యాయి. ఫైబర్ నెట్లో తన నిర్ణయాల అమలు అయ్యేలా పార్టీ నుంచి మద్దతు లభించడం లేదన్న ఆవేదనతో కొద్దిరోజుల క్రితం చైర్మన్ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి జీవీ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉంటూ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినేలా మీడియాకు ఎక్కడంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహించారు. పార్టీ పట్ల అంకితభావం ఉన్నా, కొన్ని విషయాల్లో ఆవేశం పనికి రాదంటూ క్లాస్ పీకారు. దీనికి నొచ్చుకున్న జీవీ రెడ్డి రాజీనామా చేశారు. ఈ విషయం పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. దీంతో ఆయన పట్ల అధిష్టానం వైఖరిలో మార్పు వచ్చిందని అంటున్నారు. అదే సమయంలో జీవీ రెడ్డి కూడా తన తప్పు తెలుసుకుని సీఎం చంద్రబాబు మనసు దొచుకునేలా ట్వీట్లు చేస్తూ మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. రెండు వైపులా పట్టు వీడటం, ఓ మెట్టు దిగడంతో జీవీ రెడ్డి మళ్లీ వెనక్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.
టీడీపీలో దుమారం రేపిన జీవీ రెడ్డి ఎపిసోడ్ కీలక మలుపు తిరిగిందని అంటున్నారు. ఆయనకు పార్టీ అధిష్టానానికి మధ్య సయోధ్య కుదిరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదో అవేశంలో తీసుకున్న నిర్ణయాన్ని జీవీ రెడ్డి ఉపసంహరించుకునేలా అడుగులు పడుతున్నాయంటున్నారు. అందుకే జీవీ రెడ్డిపై పార్టీలో ఎవరూ ఎలాంటి కామెంట్లు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి జీవీ రెడ్డి పార్టీ నుంచి నిష్క్రమించినా, ఆయనపై పార్టీ కార్యకర్తల్లో విపరీతమైన సానుభూతి వ్యక్తమవుతోంది. పార్టీ కోసం ఫైట్ చేసిన ఆయనను అధికారంలో ఉండగా వదులుకోవడం ఆత్మహత్య సద్రుశ్యమే అవుతుందని పార్టీలో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో రాజీనామా ఉపసంహరించి, పార్టీలో తిరిగి యాక్టివ్ గా పనిచేయాలని భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇస్తామని పార్టీ నుంచి జీవీ రెడ్డికి ప్రతిపాదనలు వెళ్లినట్లు చెబుతున్నారు.
అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ సైతం జీవీ రెడ్డి పట్ల సదాభిప్రాయంతోనే ఉన్నారని అంటున్నారు. అయితే ఆయన ఆవేశంగా తీసుకున్న నిర్ణయమని వెనకేసుకు వస్తే పార్టీలో మిగతావారు ఆ తరహా బ్లాక్ మెయిల్ చేయొచ్చనే అంచనాతోనే జీవీ రెడ్డి రాజీనామాను తక్షణం ఆమోదించినా, పార్టీకి ఆయన సేవలు అవసరమనే సమాచారాన్ని వెంటనే తెలియజేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు జీవీ రెడ్డి కూడా తన వైపు జరిగిన పొరపాటును సమీక్షించుకుని పార్టీపై అలక వీడుతున్నట్లు చెబుతున్నారు. దీంతో ఏ క్షణమైనా జీవీ రెడ్డి తన రాజీనామాను ఉపసంహరించుకుని పార్టీలో తిరిగి క్రియాశీలమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తన అనుభవం, వయసు తక్కువైనా పార్టీ తగిన గుర్తింపు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్న జీవీ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు సీఎం అవ్వాలని అభిలషిస్తూ శనివారం ట్వీట్ చేయడం ఇందులో భాగమే అంటున్నారు.