మోడీ మంచోడు.. కిషన్ రెడ్డి ముంచేటోడు.. సీఎం రేవంత్ ఫైర్
ఓపెన్ గా మాట్లాడేయటం.. ఎవరినైనా టార్గెట్ చేస్తే.. వారిని అట్టే వదిలి పెట్టకుండా మాటలతో కుళ్ల పొడిచే ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ ను చెప్పాలి.;
ఓపెన్ గా మాట్లాడేయటం.. ఎవరినైనా టార్గెట్ చేస్తే.. వారిని అట్టే వదిలి పెట్టకుండా మాటలతో కుళ్ల పొడిచే ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ ను చెప్పాలి. గడిచిన కొద్దిరోజులుగా ఆయన తన టార్గెట్ గా కిషన్ రెడ్డిని ఎంచుకున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు.. ప్రాజెక్టులు.. అనుమతులు రాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు చేయటం తెలిసిందే. తాజాగా ఈ ఘాటు మరింత పెరిగింది. కిషన్ రెడ్డికి కుళ్లు అని మండిపడ్డ ఆయన.. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంచోడని.. రాష్ట్రానికి ఏదో చేయాలని ఆయనకు ఉన్నా.. కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నట్లుగా పేర్కొంటూ నిప్పులు చెరిగారు.
రాష్ట్రానికి మంచి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ చూస్తున్నారు. కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు. మేం కేంద్ర మంత్రుల వద్దకు.. ప్రధానమంత్రి వద్దకు పలుమార్లు వెళ్లి ఏదైనా సాధిస్తే.. కిషన్ రెడ్డి తానే తెచ్చానంటూ తన ఖాతాలో వేసుకుంటున్నారు. వస్తే తన ఖాతాలోకి.. రాకపోతే రేవంత్ రెడ్డి ఏమీ చేయటం లేదని ఆరోపించటం ఆయనకు అలవాటైంది. నేను కష్టపడి మామునూరు ఎయిర్ పోర్టుకు అనుమతులు తెస్తే.. తానే తెచ్చానని కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. అలా అయితే మూసీ ప్రక్షాళనకు.. మెట్రో విస్తరణకు.. ఆర్ఆర్ఆర్ ఉత్తర.. దక్షిణ భాగాల పనులకు.. పాలమూరు - రంగారెడ్డికి నీటి కేటాయింపులు.. కాళేశ్వరానికి కేటాయింపులు.. సమక్క-సారక్క.. సీతారామ సాగర్ కు నిధులు రాకుండా అడ్డుపడుతున్నది ఆయనేనని భావించాల్సి ఉంటుంది’ అంటూ గుక్క తిప్పుకోకుండా కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ మండిపడ్డారు.
ఇంతకూ కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ మీద అంత కోపం ఎందుకు? రాష్ట్రానికి నిధులు.. అనుమతులు రాకుండా ఎందుకు అడ్డుపడుతున్నట్లు? లాంటి ప్రశ్నలకు తాజాగా సీఎం రేవంత్ సమాధానం ఇచ్చేశారు. ‘‘నేను.. కిషన్ రెడ్డి ఇద్దరం ఒక సందర్భంలో కలిసి పని చేశాం. ఆయన కంటే చిన్నవాడిని. జూనియర్ ను అయిన తాను ఎదగడం ఓర్వలేక ఆసూయతో రగిలిపోతున్నారు’’ అంటూ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు.
హైదరాబాద్ అభివృద్ధిపై రివ్యూ కోసం కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ రాకుండా రెండుసార్లు కిషన్‌రెడ్డి అడ్డుపడ్డారని, ఆయన వస్తే సమీక్షకు రాలేదంటూ తీవ్ర ఆరోపణ చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డిని ఉద్దేశించి మరో మాట చెప్పారు. వచ్చే పార్లమెంట్ సమావేశాలకు ముందు కిషన్ రెడ్డి సమీక్ష పెడితే తెలంగాణ ఎంపీలంతా వచ్చి ప్రతిపాదనలు ఇస్తారని.. వాటి ప్రకారం నిధుల మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ వచ్చి మేడ్చల్ వరకు మెట్రో విస్తరించాలని కోరినట్లు చెప్పారు. కిషన్ రెడ్డి.. బండి సంజయ్ ఇద్దరు కేంద్రం నుంచి రాష్ట్రానికి చిల్లిగవ్వ కూడా తేలేదన్నారు.