కేసులన్నీ బయటకు.. పోసాని కోసం రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల పీటీ వారెంట్లు!
నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ వ్యాప్తంగా నమోదైన కేసులన్నీ బయటకు వస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో పోసానిపై దాదాపు 17 కేసులు నమోదైనట్టు సమాచారం.;
నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ వ్యాప్తంగా నమోదైన కేసులన్నీ బయటకు వస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో పోసానిపై దాదాపు 17 కేసులు నమోదైనట్టు సమాచారం. వీటన్నింట్లోనూ పోసానిని విచారించేందుకు ఆయా జిల్లాల పోలీసులు రెడీ అవుతున్నారు.
పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో సంబంధం ఉన్న 17 పోలీసు స్టేషన్ల అధికారులు పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మూడు జిల్లాలకు చెందిన పోలీసులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు అందజేశారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట, అల్లూరి జిల్లా, అనంతపురం గ్రామీణ పోలీసులు రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లు సమర్పించారు. ‘మేం కోర్టు అనుమతి తీసుకున్నాం, ముందుగా మాకే పోసానిని అప్పగించాలి’ అని నరసరావుపేట పోలీసులు స్పష్టం చేశారు. పోసానిని తరలించేందుకు అవసరమైన వాహనాలను కూడా సిద్ధం చేశారు.
ఒకేసారి మూడు పీటీ వారెంట్లు రావడంతో పోసానిని ముందుగా ఎవరికీ అప్పగించాలనే విషయంపై జైలు అధికారులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. సంబంధిత నిబంధనలను పరిశీలించిన అనంతరం, ఉన్నతాధికారుల ఆదేశాలతో పోసానిని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు.
నరసరావుపేట పోలీసులు పోసానిని అక్కడికి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. క్రైమ్ నెంబర్ 142/2024 కింద, నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 153, 504, 67 కింద ఆయనపై కేసు నమోదైంది. ఆయనను తరలించే ముందు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం ఆరోగ్యం సరిగాలేకపోవడం వల్ల పోసాని జైలు అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై రాజంపేట ప్రభుత్వ వైద్యులు జైలు లోపలికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన పోసాని ప్రస్తుతం రాజంపేట సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.