తగ్గిన జెలెన్ స్కీ.. మరీ ట్రంప్ తగ్గుతాడా?

ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ తన దేశ భద్రత, అభివృద్ధి కోసమైతే అమెరికాతో బలమైన సంబంధాలను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.;

Update: 2025-03-03 05:44 GMT

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తగ్గాడు. అమెరికాతో వైరం కంటే స్నేహమే బెటర్ అని భావిస్తున్నాడు. అందుకే ట్రంప్ మరోసారి పిలిస్తే వెళ్లి ఈసారి ఒప్పందాలు చేసుకుంటామంటూ హింట్ ఇచ్చాడు. జెలెన్ స్కీ మళ్లీ స్నేహ హస్తం అందించాడు. కానీ మన ట్రంప్ దాన్ని స్వీకరిస్తాడా? అన్నదే పెద్ద డౌట్. వైట్ హౌస్ లోనే తనతో గొడవపెట్టుకున్న జెలెన్ స్కీని ట్రంప్ పిలుస్తాడా? మాట్లాడుతాడా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా జెలెన్ స్కీ పరిస్థితి తయారైందని కామెంట్స్ వినిపడుతున్నాయి..

ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ తన దేశ భద్రత, అభివృద్ధి కోసమైతే అమెరికాతో బలమైన సంబంధాలను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉద్రిక్తతలు నెలకొన్నా, భవిష్యత్తులో తాము సంధికి సిద్ధమని హింట్ ఇచ్చారు.ట్రంప్ తన విధానాల్లో మార్పులు తీసుకువస్తే, తాను చర్చలకు సిద్ధమేనని జెలెన్‌స్కీ తెలిపారు. అమెరికా మద్దతు ఉక్రెయిన్‌కు చాలా కీలకమని, అందుకే తాము స్నేహపూర్వక వైఖరిని అవలంబిస్తామన్నారు.

- అమెరికా-ఉక్రెయిన్ మధ్య భవిష్యత్ వ్యూహాలు

ఉక్రెయిన్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రష్యా దాడులు కొనసాగుతుండగా, అమెరికా మద్దతు తగ్గిపోతుందనే భయాలు కూడా పెరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో, జెలెన్‌స్కీ తన వ్యూహాలను మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ నేతృత్వంలో అమెరికా కొత్త విధానాన్ని అనుసరించినా, ఉక్రెయిన్‌కు మేలు జరిగేలా సంధి మార్గాలను అన్వేషిస్తామని జెలెన్‌స్కీ తెలిపారు. అమెరికా మద్దతు లేకుండా ఉక్రెయిన్ బలపడటం కష్టం కాబట్టి, భవిష్యత్తులో మెరుగైన సంబంధాలను కొనసాగించేందుకు తాము ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు.

- గతం మర్చిపోవాలన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు

జెలెన్‌స్కీ ఇటీవల వైట్ హౌస్‌లో ట్రంప్‌తో అభిప్రాయ భేదాలు పెరిగి ఒప్పందాలు చేసుకోకుండానే బయటకొచ్చాడు. వాగ్వాదం పెట్టుకున్నారు. దీంతో రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఉక్రెయిన్‌కు అవసరమైన మద్దతును పొందేందుకు అమెరికాతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడమే ఉత్తమ మార్గమని ఆయన భావిస్తున్నారు. అయితే, ట్రంప్ తన గత వైఖరిని మార్చుకుంటారా? ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తారా? అన్నది కీలక ప్రశ్నగా మారింది.

ఉక్రెయిన్-అమెరికా సంబంధాలు కొత్త మలుపు తిరిగే దశలో ఉన్నాయి. జెలెన్‌స్కీ, ట్రంప్ భవిష్యత్తులో కలిసి పని చేయగలరా? ఉక్రెయిన్ భద్రతకు అమెరికా మద్దతుగా నిలుస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. కానీ ఒక విషయం స్పష్టంగా ఉంది. ఉక్రెయిన్‌కు అమెరికా సహాయం కీలకం, అందుకే జెలెన్‌స్కీ ఇప్పుడు కాస్త తగ్గి అమెరికాకు మరోసారి ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

Tags:    

Similar News