యూఎస్ లో వీకెండ్ వస్తే గన్ సౌండ్ వినబడాల్సిందే... ఇవిగో లెక్కలు!

అగ్రరాజ్యం అమెరికాలో గన్‌ కల్చర్

Update: 2023-07-24 09:55 GMT

అమెరికాలో నిత్యం ఎక్కడో ఒక చోట కాల్పుల ఘటనలు చేసుకుంటున్న వార్తలు దర్శనమిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అయితే అమెరికాలో రోజు రోజుకీ పెరిగిపోతున్న గన్ కల్చర్, దానివల్ల జరుగుతున్న ప్రమాదాలు, సంభవిస్తోన్న మరణాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో భారతీయ సమాజం మరింత ఆందోళనను వ్యక్తం చేస్తోంది.

తాజాగా కాలిఫోర్నియాలోని గిల్‌ రాయ్‌ లో జాక్సన్ అనే 17 భారతీయ యువకుడు కాల్పుల ఘటనలో మృతి చెందాడు. ఈ సందర్భంగా జరిగిన దర్యాప్తులో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిగిన వెంటనే ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించినప్పటికీ దురదృష్టవసాత్తు ప్రాణాలు దక్కలేదు.

ఇది తాజా సంఘటన.. ఒక ఉదాహరణ మాత్రమే! ఇలాంటి దారుణ ఘటనలు అమెరికాలో నిత్యకృత్యంగా మారిపోయాయి!

అవును అగ్రరాజ్యం అమెరికాలో గన్‌ కల్చర్ నానాటికి పేట్రేగుతోంది. అమెరికాలోని తూర్పు రాష్ట్రమైన వర్జీనియాలోని ప్రాథమిక పాఠశాల తరగతి గదిలో ఆరేళ్ల బాలుడు కాల్పులు జరపడంతో ఉపాధ్యాయురాలు తీవ్రంగా గాయపడ్డారన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి మొదటివారంలో జరిగిన ఈ సంఘటనతో.. అగ్రరాజ్యంలో ఈ ఏడాది పబ్లిక్ లో తుపాకీ చప్పుడు మొదలైందని తెలుస్తుంది.

గన్‌ వయొలెన్స్‌ ఆర్కైవ్‌ (జివిఎ) అనే స్వచ్ఛంద సంస్థ తాజాగా విడుదల చేసిన లెక్కలు అమెరికా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇదే సమయంలో నిత్యం మీడియాలో కనిపిస్తోన్న ఈ వార్తలు... అమెరికాకు తమ పిల్లలని పంపాలనుకునే ఇతర దేశాల తల్లితండ్రులను భయాందోళనలకు గురిచేయడంతోపాటు పునరాలోచనలో పాడేస్తున్నాయని అంటున్నారు.

ఇక అమెరికాలో వీకెండ్ వచ్చిందంటే చాలు రాత్రిసమయాల్లో బయటకు వెళ్లే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నారని తెలుస్తుంది. ఒకవేళ బయటకు వెళ్లినా... వీలైనంత తొందరగా తిరిగి ఇంటికి చేరడంతో పాటు.. వీలైనంత సేఫ్ ప్లేస్ లను ఎంచుకునే ఏర్పాట్లలో ఉంటున్నారని తెలుస్తుంది. తాజాగా జరిగిన ఎన్నో సంఘటనలు, రోజు రొజుకీ పెరిగిపోతోన్న మరెన్నో దారుణాల్లు వారిలో ఈ జాగ్రత్తలు తీసుకొచ్చాయని తెలుస్తుంది.

ఇదే క్రమంలో తాజాగా గడిచిన ఈ వీకెండ్ లో యూఎస్ లో తొమ్మిది చోట్ల సామూహిక కాల్పులు జరిగాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ తొమ్మిది సామూహిక కాల్పుల వల్ల సుమారు 4గురు మరణించగా.. 35మంది గాయాలపాలయ్యారు. దీంతో నివేధికల ప్రకారం ఈ ఏడాది మొదటి నుంచి నిన్నటివరకూ యూఎస్ వ్యాప్తంగా సుమారు 404 సామూహిక కాల్పుల ఘటనలు జరిగాయి.

ఇలా గడిచిన ఈ ఆరేడు మాసాల కాలంలోనే ఈ 404 కాల్పుల జరిగాయన్నమాట. ఈ ఘటనల్లో సుమారు 453మంది మరణించారు. ప్రతిరోజూ సుమారు 7,500 విశ్వసనీయ వర్గాల నుంచి సేకరించిన, ధృవీకరించిన డేటా ప్రకారం జిన్ హువా వార్తా సంస్థ ఈ విషయాలను నివేధించింది.

ఇదే సమయంలో ఈ సామూహిక కాల్పుల ఘటనల్లో మరణించినవారిలో 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు 161 మంది ఉన్నారని నివేధిక చెబుతోంది. ఇదే క్రమంలో ఈ ఏడాది జరిగిన ఈ సామూహిక కాల్పుల్లో సుమారు 400 మంది పిల్లలు గాయపడ్డారు. గతేడాదితో పోలిస్తే ఈ లెక్కలు 9శాతం పెరిగాయి.

అవును... 2022 జనవరి 1 నుంచి జూలై 23 - 2022 వరకూ 365 సామూహిక కాల్పులు జరగగా... ఆ ఏడాది మొత్తం 647 సమూహిక కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక అంతక ముందు ఏడాది 2021 లో సుమారు 690 కాల్పుల ఘటనలు చోటూ చేసుకున్నాయి.

అంటే గత మూడు సంవత్సరాలుగా ప్రతీ ఏటా 600పైగానే ఈ సామూహిక కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న మాట. ఆందోళన కలిగించేలా ఉన్న ఈ ఘణాంకాలు... అమెరికాలో రోజు రోజుకీ పెరుగుతున్న గన్ కల్చర్ కు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

మరోపక్క ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట చేసుకుంటున్న ఈ కాల్పుల వార్తలు ప్రజలను తీవ్ర భావోద్వేగాలకు గురి చేయటంతోపాటు ఈ మారణకాండకు తెరదించటం ఎలా అన్న అంశంపై చర్చను తెరపైకి తెస్తున్నాయి. ఈ సమయంలో కొన్ని రకాల మారణాయుధాలను నిషేధిస్తూ.. ఆయుధ నియంత్రణకు కఠిన చట్టాలు తీసుకురావాలని కొందరు సూచిస్తున్నారు.

అయితే ఈ కట్టడిలో ఇప్పటి వరకూ సాధించిన పురోగతి మాత్రం శూన్యమేనన్న అంశాన్ని ఈ కాల్పుల ఘటనల రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. ఎప్పుడైనా తీవ్ర స్థాయిలో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నపుడు మాత్రం... జనం అంతా రోడ్లపైకి రావడం, వెంటనే ఆయుధాలను కట్టడి చేయాలంటూ ఆందోళనలు చేయడం చేస్తున్నారని.. కొద్ది రోజుల తరువాత అవి కనుమరుగైపోతాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News