సర్వేలతో ఎంఎల్ఏలు బిజీయా ?

ఐప్యాక్ బృందాలతో సర్వేలు

Update: 2023-07-19 05:28 GMT

షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ ప్రభుత్వంలో కానీ ఇటు ఎంఎల్ఏల్లో కానీ సర్వేల బిజీ పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికల్లో ఎవరికి టికెట్లు ఇవ్వాలి ? ఎవరికి కోతపెట్టాలనే విషయంలో జగన్మోహన్ రెడ్డి చాలా బిజీగా ఉంటున్నారు. ఐప్యాక్ బృందాలతో సర్వేలు చేయించుకుంటున్నారు. అలాగే ఇంటెలిజెన్స్ వర్గాలు, పార్టీనేతలతో కూడా సర్వేలు చేయించుకుంటు ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్నారు. దీన్నే ఎంఎల్ఏలతో సమీక్షా సమావేశాలు పెట్టుకున్నపుడు విశ్లేషిస్తున్నారు.

ఈ విషయాలను పక్కనపెట్టేస్తే చాలామంది ఎంఎల్ఏలు తాము సొంతంగా నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకుంటున్నారు. వివిధ సర్వే సంస్ధలతో ఒప్పందాలు చేయించుకుని రెగ్యులర్ గా సర్వేలు చేయించుకుంటున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లో మొదలుపెట్టి మండల హెడ్ క్వార్టర్స్, నియోజకవర్గ కేంద్రంలో కూడా సర్వేలు చేయించుకుంటున్నారట. ఈ సర్వే రిపోర్టుల ఆధారంగా తమకు ఎక్కడ మైనసులున్నాయి, ఎక్కడ ప్లాస్సులన్నాయన్న విషయాలను ఎంఎల్ఏలు విశ్లేషించుకుంటున్నారు.

తమ పనితీరు, పరిస్ధితిని వివరించిన వివరాలతో తాము సొంతంగా చేయించుకుంటున్న సర్వేల వివరాలను పోల్చి చూసుకుంటున్నారు. అయితే ఇక్కడో సమస్యుంది. అదేమిటంటే ఎంఎల్ఏలు సొంతంగా చేయించుకుంటున్న సర్వేల్లో రిజల్టు ఎక్కవభాగం బాగా పాజిటివ్ గా వస్తాయి.

ఎందుకంటే ఉన్నదన్నట్లుగా సర్వే రిపోర్టులిస్తే సదరు ఎంఎల్ఏ తమకు డబ్బులు చెల్లించరనే ఆలోచనతోనే సర్వే సంస్ధలు కూడా రిపోర్టును జాగ్రత్తగా రెడీచేస్తాయి. అందుకనే కొన్నిసార్లు జగన్ చెబుతున్న వివరాలతో ఎంఎల్ఏలు సొంతంగా చేయించుకుంటున్న సర్వే రిపోర్టులు సరిపోవటంలేదట.

జగన్ చేయించుకుంటున్న సర్వేల్లో ఎంఎల్ఏల పరిస్ధితిపై ఉన్నదున్నట్లుగా రిపోర్టు వచ్చే అవకాశముంది. ఎందుకంటే ఐప్యాక్ అయినా ఇంటెలిజెన్స్ అయినా లేదా పార్టీ వర్గాల ద్వారా చేయించుకునే సర్వేలను జగన్ ఒకదానితో మరొకటి కంపేర్ చేసుకుంటున్నారు. ఈ కంపేరిజన్లో ఎక్కడైనా తేడా వచ్చిందని తెలియగానే వెంటనే వాళ్ళని పిలిచి వివరణ అడుగుతున్నారు.

అందుకనే ఇచ్చే సర్వేల్లో ఎక్కువ భాగం గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగానే ఉంటున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. దీని ఆధారంగానే సమీక్షల్లో ఎంఎల్ఏల లోటుపాట్లను స్పష్టంగా చెప్పగలుగుతున్నారు. ఏదేమైనా జగన్ రిపోర్టులు ఎలాగున్నా ఎంఎల్ఏలు మాత్రం తమ సొంత సర్వేలు చేయించుకుంటున్నది వాస్తవం.

Tags:    

Similar News