బాబుకు బీజేపీ తలుపులు శాశ్వతంగా క్లోజ్

బీజేపీ చంద్రబాబు పొత్తుల వ్యవహారానికి ఇపుడు ఒక ముగింపు

Update: 2023-07-19 10:33 GMT

బీజేపీ చంద్రబాబు పొత్తుల వ్యవహారానికి ఇపుడు ఒక ముగింపు కనిపిస్తోంది. ఇంతకాలం ఊహాగానాలకు మాత్రమే పరిమితం అయిన బాబు బీజేపీ పొత్తు ఉండదన్న దానికి లేటెస్ట్ గా బలం ఇచ్చే విధంగా అనేక కీలకమైన పరిణామాలు జరిగాయి. బీజేపీ ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీయే భేటీకి చంద్రబాబుకు ఆహ్వానం లభించలేదు.

చిన్నా చితకా పార్టీలు అసలు ఒక్క ఎంపీ కూడా లేని పార్టీలు చట్ట సభలలలో టెక్నికల్ గా ప్రాతినిధ్యం లేని పార్టీలను పిలిచి పెద్ద పీట వేసిన బీజేపీ రాజకీయంగా అత్యంత సీనియర్ నేత, ఈ రోజుకీ ఉభయ సభలలో నలుగురు ఎంపీలు కలిగిన చంద్రబాబుని మాత్రం కావాలని విస్మరించింది.

చిత్రమేంటి అంటే ఎన్డీయేను ఏర్పాటు చేసినపుడు చంద్రబాబు నాడు కీలకంగా ఉన్నారు. ఆయన వాజ్ పేయ్ అద్వానీలతో పాటుగా అతి ముఖ్య పాత్ర పోషించారు. ఎన్డీయే కన్వీనర్ గా చురుకైన పాత్రను బాబు నిర్వర్తించారు. నాటి ఎన్డీయే కూటమి ప్రధాని అయిన వాజ్ పేయ్ చంద్రబాబుకు ఎంతో గౌరవం ఇస్తూ ఉండేవారు.

అలా జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పిన చంద్రబాబు ఇపుడు మోడీ అమిత్ షాలకు చేదు అయిపోయారు అంటే అది బాబు చేసుకున్న స్వయంకృతాపరాధం అని అంటున్నారు. బాబు అవకాశ రాజకీయాల మూలంగానే ఈ రోజు జాతీయ స్థాయిలో ఆయన ఏ కూటమితోనూ భుజం కలిపి ముందుకు నడవలేని పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు.

ఒక వైపు రెండు రోజుల పాటు బెంగళూరులో విపక్ష కూటమి మీటింగ్ చాలా ఇంటరెస్టింగ్ గా జరిగింది. ఈ భేటీకి మొత్తం ఇరవై ఆరు పార్టీలు హాజరయ్యాయి. అలాంటి భేటీకి కూడా బాబుని పిలవలేదు. ఒకనాడు యునైటెడ్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసి దానికి కూడా బాబు కన్వీనర్ గా ఉన్నారు. కూటములను జాతీయ స్థాయిలో కట్టడంలో బాబుకు ఉన్న విశేష అనుభవాన్ని ఎవరూ కాదనలేరు.

అంతే కాదు 2018 నుంచి కాంగ్రెస్ తో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు బాబు రాహుల్ తో కలసి జాయింట్ ప్రెస్ మీట్లను ఏర్పాటు చేశారు. తెలంగాణాలో కాంగ్రెస్ తో కలసి పొత్తులు పెట్టుకుని పోటీ చేశారు. ఇటువంటి నేపధ్యం ఉన్న చంద్రబాబు 2019 ఎన్నికల తరువాత మరోసారి మోడీ ప్రధాని కావడంతో విపక్ష కూటమి వైపు చూడడం మానుకున్నారు.

గడచిన నాలుగేళ్లుగా ఆయన బీజేపీ వైపే ఉండాలని భావిస్తూ అనుకూల ధోరణిని ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబును నమ్మదగ్గ నేస్తంగా విపక్ష కూటమి భావించడంలేదని అందుకే ఆయన్ని గత రెండు మీటింగులకు పిలవలేదని అంటున్నారు.

సరే బీజేపీ పొత్తు కోసం చూస్తున్న బాబుకు ఆ పార్టీ అయినా పిలిచి పెద్ద పీట వేసిందా అంటే అదీ లేదు. ఎన్డీయే ఏర్పాటుని తలచుకున్న మోడీ వాజ్ పేయి అద్వానీల సేవలను కూటమి వెనక వారు చేసిన కృషిని తలచుకున్నారు కానీ వ్యవస్థాపక సభ్యుడు అయిన చంద్రబాబుని మాత్రం కనీసంగా ప్రస్తావించలేదు అంటే బీజేపీ బాబు పట్ల ఏ విధంగా వ్యవహరిస్తోందో అన్నది అర్ధం అవుతోంది.

ఒకనాడు మోడీ అమిత్ షాలను ఘాటుగా విమర్శించి ఎన్డీయే నుంచి బయటకు వెళ్ళిన బాబు అలా ఊరుకుంటే బాగుండేది, కానీ ఆయన కాంగ్రెస్ కూటమితో చేతులు కలపడం మోడీని ఓడిస్తామని దేశమంతా తిరిగి ప్రచారం చేయడం వంటివి గుర్తున్నాయి కాబట్టే బీజేపీ ఆయన్ని దూరం పెట్టింది అని అంటున్నారు. అంతే కాదు రాహుల్ తో కలసి మీటింగ్స్ నిర్వహించిన బాబు ఏకంగా తెలంగాణాలో పొత్తు కూడా పెట్టుకున్నారు.

మరోసారి బాబు ఇలాంటి అవకాశ వాద రాజకీయాలకు పాల్పడరు అన్న నమ్మకం లేనందువల్లనే బీజేపీ ఆయనను దూరం పెట్టిందని శాశ్వతంగా ఎన్డీయే తలుపులు మూసేసింది అని అంటున్నారు. ఇక మీదట బీజేపీతో టీడీపీకి పొత్తులు అయితే కుదరకపోవచ్చు అని అంటున్నారు. ఒక విధంగా ఇది టీడీపీకి బాబుకు ఆశాభంగం అయిన పరిణామంగానే చూడాల్సి ఉంటుంది. అని అంటున్నారు. దీని మీద బాబు ఏమి చేస్తారు అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News