'కుప్పం కోట' కూలకుండా చంద్రబాబు ద్విసూత్ర ప్రణాళిక!

వైసీపీ అధినేత జగన్‌ కుప్పంపైనే గురిపెట్టడం

Update: 2023-07-22 10:39 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం మాత్రమే ఉంది. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పెద్ద లక్ష్యాన్నే నిర్దేశించుకున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ విజయ ఢంకా మోగించాలని వైఎస్‌ జగన్‌ కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా అక్కడ బీసీ అభ్యర్థి భరత్‌ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. చిత్తూరు వైసీపీ అధ్యక్షుడిగా కూడా ఆయననే నియమించారు.

మరోవైపు రాయలసీమ రాజకీయాల్లో పెద్దాయనగా పేరున్న సీనియర్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరచూ కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తూ ఇప్పటి నుంచి వైసీపీ విజయానికి బాటలు వేస్తున్నారు. టీడీపీ నేతలను వైసీపీలోకి ఆహ్వానించడం, వారికి కండువాలు కప్పడం చేస్తున్నారు.

1989, 94, 99, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా కుప్పం నుంచి ఏడుసార్లు చంద్రబాబు విజయం సాధించారు. అయితే మొదటిసారిగా 2019లో చంద్రబాబు మెజారిటీ బాగా తగ్గింది.

వైసీపీ అధినేత జగన్‌ కుప్పంపైనే గురిపెట్టడంతో చంద్రబాబు కూడా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కుప్పం టీడీపీ నుంచి వైసీపీలోకి పెద్ద ఎత్తున కార్యకర్తలు వెళ్లారు. అలాగే కీలక నేతలపైనా వైసీపీ వల వేస్తోంది. అనేక తాయిలాలు ఆశ చూపి వైసీపీలోకి చేర్చుకుంటోంది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు కుప్పం కోట చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కుప్పం నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా రెండు పార్టీ కమిటీల్ని నియమించారు. ఇందులో ఒకటి టీడీపీ పార్టీ విస్తరణ విభాగం. మరొకటి కార్యకర్తల సంక్షేమ విభాగం.

ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న బీఆర్‌ సురేష్‌ బాబును కుప్పంలో టీడీపీ విస్తరణ విభాగం కన్వీనర్‌ గా నియమించారు. అలాగే డీఎస్‌ త్రిలోక్‌ ను కుప్పం నియోజకవర్గం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం కన్వీనర్‌ గా చంద్రబాబు నియమించారు. అలాగే కుప్పం మండలానికి చెందిన పార్టీ నేత మణిని రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చారు. మరోవైపు రామకుప్పం మండలానికి చెందిన డాక్టర్‌ గిరిబాబు నాయక్‌ కు ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవిని కట్టబెట్టారు.

టీడీపీ విస్తరణ విభాగం ద్వారా కుప్పంలో టీడీపీలోకి పెద్ద ఎత్తున ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలను ఆకర్షించడానికి కార్యక్రమాలు చేపట్టనున్నారు. అలాగే కార్యక్తల సంక్షేమ విభాగం ద్వారా కుప్పం నియోజకవర్గంలో ఏ ఒక్క టీడీపీ కార్యకర్తలు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోనున్నారు. వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టనున్నారు. ఇలా కుప్పం చేయి జారకుండా చంద్రబాబు గట్టి చర్యలే చేపట్టారు.

గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు, అది కూడా నామినేషన్‌ కు చివరి రోజు లేదంటే దాని ముందు రోజు మాత్రమే చంద్రబాబు నామినేషన్‌ వేయడానికి వెళ్లేవారు. అయితే ఈసారి గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉండటంతో ముందు నుంచే జాగ్రత్త చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News