ఈ ఐడియా బాగుంది..ఫాలో అవుదాం: నందిగామ వైసీపీ టాక్..!
అయితే.. అక్కడ గడియారాల విషయం నందిగామ వరకు పాకింది. దీంతో ఇక్కడి వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు కూడా.. ఈ విషయం పై ఆరా తీస్తున్నారట.
ఎన్నికల సీజన్ వచ్చేసింది. మరికొన్ని నెల్లలోనే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని.. ప్రస్తుత ప్రభుత్వాన్ని ఉంచాలో తుంచాలో నిర్ణయించనున్నారు. ఏపీ కంటే ముందుగా తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎన్నికల వేడి మరింత పెరిగింది. దీంతో నేతలు.. ఇప్పటి నుంచే ప్రజలను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఎన్నికల సమయంలో పంచే తాయిలాలను ముందుగానే పంచేస్తున్నారు.
ఎన్నికల సమయంలో అయితే.. కోడ్ వంటివి అడ్డు రావడం.. అధికారులు దాడులు చేయడం వంటివి ఉంటాయి. దీంతో నాయకుల ఎత్తు పారవు. సో. ముందుగానే అయితే.. ఎవరూ ఏమీ అడ్డు పెట్టరు. దీంతో కొందరు నాయకులు.. తమ మెదళ్లకు పదును పెట్టి.. నిత్యం ప్రజలకు కనిపించేలా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో అందరికీ కలిసివస్తున్న విషయం గోడ గడియారాలు.
ఒకప్పుడు ఇంటికి అందం తెచ్చే గోడగడియారాలకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. అయితే స్మార్ట్ వాచీలు, ఫోన్లు వచ్చాక.. సర్వం అందులోనే కనిపిస్తున్నాయి. దీంతో గోడగడియారాలకు ప్రాధాన్యం తగ్గింది. అయినా.. కూడా ఇప్పుడు ఎన్నికల సీజన్ కావడంతో ప్రతి ఇంటికీ గోడగడియారాలు పంచేస్తున్నారు. ముఖ్యంగా ఏపీని ఆనుకుని ఉన్న సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి గోడగడియారాలను ప్రతి ఇంటికీ పంపిణీ చేశారు.
ఈ గోడ గడియారాలను ఏవో ఉత్తవే కొని ఆయన పంపించడం లేదు. ఆ గడియారంలో మధ్యలో తన ఫొటో పెద్దదిగా వేసుకున్నారు. నాలుగు వైపుల నాలుగు ప్రాజెక్టుల ఫొటోలను కూడా ముద్రించి.. గడియారాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈ గడియారాన్ని చూడగానే ఆయన గుర్తుకు వచ్చేలా ఆకర్షణీయగా తీర్చిదిద్దారు. అయితే.. అక్కడ గడియారాల విషయం నందిగామ వరకు పాకింది. దీంతో ఇక్కడి వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు కూడా.. ఈ విషయం పై ఆరా తీస్తున్నారట.
జగదీశ్వర్‌రెడ్డి పంచిన గడియారం ఒక్కొక్కటీ 200 రూపాయలు పడిందని సమాచారం. ఇదే రేటుతో తన ఫొటోలు, నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని పేర్కొంటూ.. సేమ్ టు సేమ్ అలానే గడియారాలు తయారు చేయించే పనిలో ఉన్నారట..వైసీపీ ఎమ్మెల్యే. ఎన్నికల కోడ్‌కు ముందుగానే వీటిని ఇంటింటికీ పంపించే ప్రణాళికేదో ఆయన రెడీ చేసుకుంటున్నారని పార్టీలో నాయకులు చర్చించుకుంటున్నారు.