ఆనం ప్రస్తావన లేకుండానే.. సభ ముగించిన సీఎం!
ఆనంను దరిదాపుల్లోకి కూడా రాకుండా.. పోలీసులు నోటీసులు ఇవ్వడం మరింత కలకలం రేగుతోంది.
తాజాగా ఏపీ సీఎం జగన్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నేతన్నలకు సంబంధించిన పథకానికి బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ గత ప్రభుత్వ మేనిఫెస్టో పై నిప్పులు చెరిగారు. అప్పటి టీడీపీ మేనిఫెస్టోను(పుస్తకం) చూపిస్తూ.. దీనిని దాచేశారని.. కనిపించకుండా చేసిన ప్రభుత్వమని నిప్పులు చెరిగారు.
ఇక, నేతన్నలకు రుణ మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తర్వాత.. వారిని వదిలేశార ని విమర్శించారు. అదే సమయంలో వలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ చేసిన విమర్శలను కూడా ఈ సందర్భంగా జగన్ తిప్పికొట్టారు.
అయితే.. సభ జరిగిన నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గెలుపు గుర్రం ఎక్కారు.
అయితే.. ఆయన జగన్ కేబినెట్‌లో మంత్రి పదవిని ఆశించారనే చర్చ సాగింది. ఇది దక్కలేదు. మరోవైపు ఆయనను పార్టీ కూడా విస్మరించిందనే టాక్ నడిచింది. ఈ క్రమంలోనే కొన్నాళ్ల కిందట ఆనంపై వైసీపీ వేటు వేసింది. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గీత దాటి.. టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారని పేర్కొంటూ.. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయినప్పటికీ.. ఆయన వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నా రు.
అయితే.. తాజాగా జరిగిన జగన్ సమావేశంలో ఎన్నో విషయాలు చర్చించినా.. ఎన్నో విషయాలపై విమర్శలు గుప్పించినా.. ఆనం వ్యవహారాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. కనీసం ఆనంకు ప్రొటోకాల్ ప్రకారం అయినా.. ఒక ఎమ్మెల్యేగా గుర్తించి.. సభకు పిలవాల్సి ఉందని అధికార వర్గాలు భావించాయి.
కానీ, ప్రొటోకాల్ కూడా పాటించలేదు. ఆనంను దరిదాపుల్లోకి కూడా రాకుండా.. పోలీసులు నోటీసులు ఇవ్వడం మరింత కలకలం రేగుతోంది. ఈ పరిణామాలతో విసుగు చెందిన ఆనం.. ఆత్మకూరులోని సొంతింటికి వెళ్లిపోయారని ఆయన అనుచరులు చెబుతున్నారు.