వైసీపీని వీడిన పెద్ద గొంతుక...ఆ జిల్లాలో దెబ్బే ?
వైసీపీకి ఓటమి తరువాత వరస దెబ్బలు పడుతున్నాయి. ఆ పార్టీకి ఎంతో విధేయతగా ఉన్న సీనియర్లు ఒక్కొక్కరూ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.
వైసీపీకి ఓటమి తరువాత వరస దెబ్బలు పడుతున్నాయి. ఆ పార్టీకి ఎంతో విధేయతగా ఉన్న సీనియర్లు ఒక్కొక్కరూ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. మాజీ మంత్రులు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీని వీడిపోవడం అంతా చూసారు. ఇక వైసీపీ పుట్టుక నుంచి ఉన్న వారు సైతం ఆ పార్టీకి తలాఖ్ అనేస్తున్న నేపథ్యం ఉంది.
దీనికి అంతటికి కారణం పార్టీలో ఉన్న స్తబ్దత అని అంటున్నారు. ఓటమి పాలు అయి ఏడు నెలలు పై దాటినా వైసీపీలో సరైన యాక్షన్ ప్లాన్ లేదని అంటున్నారు. అంతే కాదు పార్టీ ఫలితాల తరువాత చిత్తశుద్ధితో సమీక్ష చేయడం లేదని అంటున్న వారు ఉన్నారు.
మొత్తానికి కీలక జిల్లాల నుంచి నేతలు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. ఇక వైసీపీకి టీవీ డిబేట్లలో పెద్ద గొంతుకగా ఉన్న సీనియర్ నాయకుడు కె రవిచంద్రారెడ్డి వైసీపీని వీడడం విస్మయపరచే వ్యవహారంగా చూస్తున్నారు. ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నేత. ఆయన జగన్ మీద ఈగ వాలనీయకుండా టీవీ డిబేట్లలో వాదనలు చేసేవారు. రాజకీయ ప్రత్యర్ధులను తన మాటల దాడితో చెక్ పెట్టేలా చేసేవారు
ఆయన శనివారం పార్టీకి రాజీనామా చేశారు. అంతే కాదు పార్టీ తనకు అప్పగించిన అధికార ప్రతినిధి పదవిని సైతం ఆయన వదులుకున్నారు. కె రవిచంద్రారెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారు. ఆయన గతంలో కాంగ్రెస్ లో కీలకంగా పనిచేసేవారు ఆ తరువాత వైసీపీలోకి వచ్చారు. ఆయన పార్టీలోకి వచ్చాక వైసీపీ టీవీ డిబేట్లలో తన వాదనలను మరింత గట్టిగా వినిపిస్తూ వచ్చింది.
అలా పార్టీ కోసం ఆయన తన వంతుగా చేయాల్సింది అంతా చేసారు. ఇక వైసీపీ అధికారంలో ఉన్నపుడు ఆయనకు ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చి నామినేటెడ్ పోస్టులో ఆయనను ఉంచింది. ఆయన పార్టీకి వీర విధేయుడుగానే ఉంటూ వచ్చారు.
ఇలా సడెన్ గా పార్టీకి ఆయన రాజీనామా చేయడం మాత్రం చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో అనేక మంది కీలక నాయకులు పార్టీని వీడారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మొదలైన తిరుగుబాటు ఈ రోజు నెల్లూరు జిల్లాలో వైసీపీని బలహీనంగా మారుస్తోంది అని అంటున్నారు.
నేతలు ఎందుకు ఇలా పార్టీని వీడిపోతున్నారు అంటే భవిష్యత్తు పట్ల బెంగ ఉందని అంటున్నారు. అంతే కాదు పార్టీలో అయోమయమైన వాతావరణం కనిపిస్తోంది అని అంటున్నారు. మరి వైసీపీకి మరింతమంది రాజీనామా చేసే దారిలో ఉన్నారని వినిపిస్తోంది. చూడాలి మరి వైసీపీ అధినాయకత్వం వీటిని తట్టుకుని ఏ మేరకు పార్టీకి రిపేర్లు చేసుకుంటుందో. మళ్లీ పూర్వ వైభవానికి ఏ విధంగా కృషి చేస్తుందో.