ఆగ్రహించిన వేమిరెడ్డి....నెల్లూరు టీడీపీలో ఏం జరుగుతోంది...?

నెల్లూరు జిల్లా టీడీపీ ఆ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి పారేసింది.

Update: 2024-11-03 18:01 GMT

నెల్లూరు జిల్లా టీడీపీ ఆ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి పారేసింది. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఊపు కూడా దానికి కారణం అంటారు. ఆయన నెల్లూరు ఎంపీగా గెలిచి హవా చూపించారు. ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి కోవూరు నుంచి ఎమ్మెల్యే అయ్యారు.

ఇదిలా ఉంటే ఆదివారం నెల్లూరు జెడ్పీ ఆఫీసులో జరిగిన ఒక అధికారిక సమావేశంలో తనను అవమానించారు అని పేర్కొంటూ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సమావేశం నుంచి వాకౌట్ చేసిన సన్నివేశం ఇపుడు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది.

నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డీఆర్సీ సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి సహా అంతా హాజరయ్యారు. అలాగే నెల్లూరు జిల్లా ఇంఛార్జి మంత్రి ఫరూఖ్ కూడా అటెండ్ అయ్యారు.

ఈ సమావేశానికి జిల్లాకు చెందిన పది మంది ఎమ్మెల్యేలు జిల్లాకు చెందిన అధికారులు అంతా హాజరయ్యారు. ఇక వేదిక మీద మంత్రులను పిలిచిన ఆర్డీవో వేమిరెడ్డి పేరు పిలవకపోవడంతో ఆయన తీవ్ర అవమానానికి గురి అయ్యారు. వేదిక నుంచి దిగి ఆయన కారెక్కి వెళ్ళిపోయారు. దీనిని గమనించిన మంత్రులు నారాయణ ఆనం రామనారాయణరెడ్డి ఆయనను బతిమాలారు. కానీ వేమిరెడ్డి అయితే వినలేదు.

అయితే ఈ సంఘటన మాత్రం నెల్లూరు జిల్లా టీడీపీ వర్గాలలో కలకలం రేపుతోంది. బిగ్ షాట్ గా ఉన్న వేమిరెడ్డి ఎందుకు అలిగారు అన్నదే చర్చకు వస్తోంది. సాధారణంగా ఆయన అలిగే రకం కాదని అంటారు. కానీ ఆయనకు కోపం రావడం వెనక అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడమే కారణమా లేక ఇంకా ఏమైనా జిల్లా రాజకీయాలలలో కారణాలు ఉన్నాయా అన్న చర్చ వస్తోంది.

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నారాయణదే ఆధిపత్యంగా ఉంటోంది అనంది తెలిసిందే. ఆనం మరో మంత్రిగా ఉన్నా ఆయన కంటే కూడా నారాయణే మొత్తం వ్యవహారాలను చూస్తారు అని అంటారు. ఇక వేమిరెడ్డి అయితే జిల్లాలో లోక్ సభ సభ్యుడిగా ఉన్నారు. సీనియర్ నేతగా ఉన్నారు.

అంగబలం అర్ధబలంలో ఆయన ధీటైన నేతగా ఉంటారు. అటువంటి వేమిరెడ్డి రాజకీయంగా తన హవా చాటాలని అనుకుంటున్నారా అన్నది చర్చకు వస్తోంది. టీడీపీలో అయితే ఆయన సతీమణి ప్రశాంతికి టీటీడీ బోర్డులో మెంబర్షిప్ ఇచ్చారు. వేమిరెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని అనుకున్నారు కానీ ఆయనే వద్దు అన్నట్లుగా అప్పట్లో వార్తలు అయితే వచ్చారు. ఏది ఏమైనా వేమిరెడ్డి అలక మాత్రం టీ కప్పులో తుఫానుగా ఉంటుందా లేక నెల్లూరు టీడీపీలో అలజడిగా మారుతుందా అంటే కొంతకాలం వేచి చూడాల్సిందే మరి అని అంటున్నారు.

Tags:    

Similar News