ట్రంప్ కు ఫస్ట్ స్ట్రోక్... ‘జన్మతః పౌరసత్వం తొలగింపు’పై సవాల్ స్టార్ట్!

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్... సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ని జారీ చేస్తున్నారు.

Update: 2025-01-21 09:01 GMT

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్... సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ని జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా... వలస వచ్చిన వారికి అమెరికాలో పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు అక్కడి పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని తాజాగా రద్దు చేశారు! దీంతో... ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దావా వేసింది ఏ.సీ.ఎల్.యూ!

అవును... బర్త్ రైట్ సిటిజన్ షిప్ ని రద్దు చేస్తూ అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈ ఆర్డర్ పై అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ఏ.సీ.ఎల్.యూ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... ఈ ఆర్డర్ ను సవాల్ చేస్తూ దావా వేసింది.

ఈ సందర్భంగా స్పందించిన ఏ.సీ.ఎల్.యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంథోనీ డి. రోమెరో... అమెరికాలో జన్మించిన పిల్లలకు పౌరసత్వాన్ని నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధం మాత్రమే కాదు.. ఇది అమెరికన్ విలువలను నిర్లక్ష్యం చేయడం, నిర్ధాక్షిణ్యంగా తిరస్కరించడం కూడా అవుతుందని తెలిపారు. ఈ హక్కు అమెరికాలో ఓ భాగమని అన్నారు.

అమెరికాను బలమైన, చైతన్యవంతమైన దేశంగా మార్చడంలో జన్మతః పౌరసత్వం హక్కు ఓ భాగమని.. దీనిని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఈ సమయంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ తో పాటు ఇతర న్యాయవాదులు, పలు గ్రూపులూ ఈ ఆర్డర్ ని సవాల్ చేస్తూ దావా వేశాయి.

ఈ సందర్భంగా స్పందించిన వారు.. నేడు అమెరికాలో జన్మించిన పిల్లలు వైద్యులుగా, న్యాయవాదులుగా, వ్యవస్థాపకులుగా, వ్యాపారవేత్తలుగా, ఉపాధ్యాయులుగా, ఇంజినీర్లుగా కావాలని కలలు కంటున్నారని.. అయితే, అది వారి తల్లితండ్రుల హోదా ఆధారంగా నిర్ణయించబడకూడదని.. ఆ ఆధారంగా వారి పౌరసత్వం తీసివేయబడకూడదని అన్నారు.

మరోపక్క ఈ వ్యవహారంపై స్పందంచిన వైట్ హౌస్ అధికారి ఒకరు.. ఈ నిర్ణయం జాతీయ భద్రతకు సంబంధించిందని.. ప్రజా భద్రతకు సంబంధించిందని అన్నారు. ఇదే సమయంలో ప్రత్యేక ఆందోళన కలిగిన దేశాల నుంచి వలసదారులకు ప్రవేశాన్ని నిలిపివేయడానికి ట్రంప్ త్వరలో ఆదేశాలు జారీ చేస్తారని తెలిపారు.

కాగా... వలస వచ్చిన వారికి అమెరికాలో పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు అక్కడి పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని ట్రంప్ తాజాగా రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన ట్రంప్.. అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే బర్త్ రైట్ సిటిజన్ షిప్ ను తమ పెడరల్ ప్రభుత్వం గుర్తించదని అన్నారు.

Tags:    

Similar News