రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనపై హైకమాండ్ ఆరా!?

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడం పట్ల కాంగ్రెస్ అగ్రనాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Update: 2025-01-21 08:14 GMT

దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడం ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్లారు. అయితే.. ఈ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జ్యూరిచ్ విమానాశ్రయంలో కలుసుకున్నారు. అనుకోకుండా కలిశారా..? అనుకునే కలిసారా..? అన్నది తెలియదుగానీ ఈ ఇద్దరు నేతలు విమానాశ్రయంలో జరిపిన చర్చలు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వీరి కలయికకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సర్క్యులేట్ అయ్యాయి. అయితే.. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడం పట్ల కాంగ్రెస్ అగ్రనాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి బలమైన కారణమే ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. అటువైపు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్డీఏ కూటమిలో కీలక నేత. ఒక రకంగా చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారాన్ని చేపట్టడంలో కీలకంగా వ్యవహరించిన నేత. మరో కోణంలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారాన్ని దూరం చేసిన నాయకుల్లో ముఖ్యుడు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆగ్రహానికి కారణం అవుతున్నట్టు చెబుతున్నారు. దేశంలో ఎన్డీఏ పక్షాలు, ప్రభుత్వాలపై ఒకపక్క కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని సాగిస్తుంటే.. మరో వైపు రేవంత్ రెడ్డి ఎన్డీఏ భాగస్వామి పార్టీల్లో కీలకంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతతో చర్చలు జరపడాన్ని తీవ్రంగా పరిగణించినట్టు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడును తన గురువుగా గతంలో అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ విషయాలను కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

జ్యూరిచ్ విమానాశ్రయంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య జరిగిన సమావేశానికి సంబంధించిన వివరాలు గురించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆరా తీసినట్లు తెలిసింది. ఈ సమావేశంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతోపాటు మరికొందరు ఉన్నారు. ఇది సాధారణ సమావేశమే అయి ఉంటే రెండు రాష్ట్రాల్లో సాగుతున్న పాలన, అభివృద్ధికి సంబంధించిన అంశాలు, దావోస్‌లో పెట్టుబడులకు సంబంధించిన చర్చలు జరగాలి. కానీ ఇరువురి మధ్య రాజకీయపరమైన అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం దృష్టికి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ఈ భేటీని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సీరియస్ కావడానికి కారణమైంది. అసలే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. దీంతో ఈ భేటీపై పలువురు సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం కావాలని కలలు కొంటున్న నేతలు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. వీరంతా తాజాగా నెలకొన్న పరిణామాలపై రకరకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. కొందరు సీనియర్ నేతలు ఒక అడుగు ముందుకు వేసి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సన్నిహిత సంబంధాలను కొనసాగించడం ద్వారా మరోవైపు బిజెపితో రేవంత్ రెడ్డి సత్సంబంధాలను కొనసాగిస్తున్నారన్న విషయాన్ని కూడా కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ జరిగిన చర్చలకు సంబంధించిన సారాంశాన్ని తెప్పించుకునే ప్రయత్నం పార్టీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం పీఠంపై కూర్చోవాలని చాలా మంది నేతలు పట్టుబట్టారు. దీంతో పార్టీ నాయకత్వం కూడా వెంటనే రేవంత్ రెడ్డిని సీఎంగా ఎంపిక చేసేందుకు ఆలోచన చేసింది. పార్టీ సీనియర్ నేతలను సంతృప్తి పరిచి.. కేడర్‌కు బ్యాడ్ మెసేజ్ వెళ్లకుండా ఉండాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డిని సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఈ పరిణామం ఎంతోమంది సీనియర్ నేతలను తీవ్ర అసహనానికి, అసంతృప్తికి గురి చేసింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం రేవంత్ రెడ్డికి అండగా ఉండటంతో ఎవరూ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా సీనియర్ నేతల్లో ఉన్న అసంతృప్తిని గుర్తించి వారిని కలుపుకుంటూ ముందుకు వెళుతూ వస్తున్నారు.

సీనియర్లకు తగిన గౌరవాన్ని కల్పిస్తూ తన సీటుకు ఎసరు రాకుండా చేసుకుంటున్నారు. అయితే, అధిష్టానం ఆదేశాలతో సైలెంట్ గా ఉన్న సీనియర్ నేతలు మాత్రం తమకు ఎక్కడ అవకాశం దొరుకుతుందా..? అని సీఎం పీఠంపై కర్చీఫ్ వేసుకుని ఆశగా ఎదురుచూస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు రూపంలో రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులు చేసే అవకాశం దక్కడంతో పలువురు సీనియర్ నేతలు ఫిర్యాదుల పరంపరం కొనసాగిస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి రాజకీయమే తెలుగుదేశం పార్టీ నుంచి ప్రారంభమైందని, చంద్రబాబు నాయుడుకు ఇప్పటికీ కావాల్సిన వ్యక్తిగా పేర్కొంటూ పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో సీఎం చంద్రబాబునాయుడు తన గురువు అని చెప్పుకున్న విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఈ కోణంలోనే ఈ భేటీకి సంబంధించి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డిని పిలిచి దీనిపై వివరణ కోరేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిద్ధమవుతోంది. అయితే.. ఇప్పటికిప్పుడు వివరణ కోరడం ద్వారా ఇబ్బందులు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఎందుకంటే కొద్దిరోజుల్లోనే ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి. రేవంత్ రెడ్డిని కూడా ఈ ఎన్నికలకు స్టార్ క్యాంపైనర్‌గా నియమించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని పిలిచి వివరణ కోరితే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కొద్దిరోజులపాటు మానం దాల్చే అవకాశం ఉంది. ఢిల్లీ ఎన్నికల తర్వాత ఈ వ్యవహారంపై పెద్ద చర్చే జరుగుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి. మరి ఈ విపత్కర పరిస్థితిని రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News