రాజధానిపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు... గతం తవ్వుతున్న నెటిజన్లు!

తాజాగా బీజేపీని కూడా ఫాం లోకి తెచ్చే పనిలో ఉన్నారంట పురందేశ్వరి. ఈ నేపథ్యంలో అమరావతి పై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-07-26 06:08 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ విషయంలో అధికార వైసీపీ, టీడీపీ, జనసేనలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా... తాజాగా బీజేపీని కూడా ఫాం లోకి తెచ్చే పనిలో ఉన్నారంట పురందేశ్వరి. ఈ నేపథ్యంలో అమరావతి పై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టిన పురందేశ్వరి... పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ తీసుకురావడానికి, పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతూ, అందరి సూచనల మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది.

ఈ సమయంలో అమరావతి రాజధానిపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి సంచలన ప్రకటన చేశారు. ఏపీ రాజధానిగా అమరావతికే కేంద్రం సంపూర్ణంగా కట్టుబడి ఉందని అన్నారు. ఇక, అమరావతిలోని ఆర్ 5 జోన్‌ లో ఇళ్ల నిర్మాణం అంశం కోర్టులో ఉందని చెప్పారు.

ఇదే సమయంలో పేదలకు ఇళ్లు వద్దని ఎక్కడా చెప్పలేదని చెప్పారు పురందేశ్వరి. గుంటూరులో బిజెపి కోస్తాంధ్ర జోనల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందని.. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేదని చెప్పడం గమనార్హం!

అయితే గుంటూరు లో జరిగిన మీటింగ్ లో అమరావతే రాజధాని అని చెప్పిన పురందేశ్వరి... విశాఖ ఉక్కు, విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదా, విభజన హామీలపై కూడా స్పందించి తమ అభిప్రాయాన్ని చెప్పి ఉంటే బాగుండేదని ఆ పార్టీ కార్యకర్తలు అభిప్రాయడుతున్నారని తెలుస్తుంది. దీంతో విశాఖలో బీజేపీ నేతల సమావేశం జరిగితే... అక్కడ స్పందించే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.

దీంతో.. ఏపీ రాజధాని విషయంలో బీజేపీ నేతలు ఇచ్చిన స్టేట్ మెంట్స్ పై గతాన్ని తవ్వుతున్నారు నెటిజన్లు. కాగా... ఏపీ రాజధాని ఎక్కడ ఉండాలనేది ఆయా రాష్ట్రాల పరిధిలోని అంశమని ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో ఏపీ రాజధాని తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండబోదని.. అభివృధ్ధి అనేది ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదని.. అభివృధ్ధి వికేంద్రీకరణ చేయటం మంచిదేనని.. బీజేపీ నాయకుడు కె.మురళీధరరావు స్పష్టం చేశారు.

అదేవిధంగా... ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు కూడా గతంలో స్పష్టం చేశారు. ఇది పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా అధికారికంగా చెప్పే మాట అని పేర్కొన్నారు.

Tags:    

Similar News