వ్యాపారం చేయనన్న ప్రభుత్వం వ్యాపారానికి దిగితే.. ?
ఇప్పుడు అదే మోడీ.. బియ్యం బిజినెస్ ప్రారంభించారు. మరి ఇది వ్యాపారం కాదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
కేంద్ర ప్రభుత్వం తాజాగా బియ్యం వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ‘భారత్ రైస్’ పేరుతో మార్కెట్‌లోకి బియ్యాన్ని విక్రయించేందుకు నడుం బిగించింది. గత ఏడాది కాలంలో బియ్యం ధరలు 15 శాతం పెరిగిన నేపథ్యంలో కిలో రూ.29 కే బియ్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని కేంద్రం ఈ సందర్భంగా చెబుతోంది. అయితే.. వాస్తవానికి ప్రధాని మోడీ.. గతంలో పలికిన చిలకపలుకులు గుర్తు చేసుకుంటే.. ఔరా.. అని అనిపించకపోదు.
అది.. 2019, నవంబర్‌లో శీతాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. దేశంలోని పలు పరిశ్రమ లను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. దీనిపై ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలో మోడీ ఒక రోజు రాత్రి.. 7 గంటల కు పార్లమెంటులో సుదీర్ఘ ప్రసంగం చేశారు. దాదాపు 1.50 నిమిషాల పాటు ఆయన ఏకబిగిన ప్రసంగించారు. దీనిలో సారాంశం ఏంటంటే.. ''ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు. ప్రజల సంక్షేమం కోసం ప్రజలతో ఏర్పడిన ప్రభుత్వం లాభాపేక్ష లేకుండా ఉండాలి'' అని!!
అందుకే.. తాము వ్యాపారాల నుంచి తప్పుకొంటూ.. సంస్థలను(ప్రభుత్వ రంగ) ప్రైవేటుకు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. కట్ చేస్తే. ఇప్పుడు అదే మోడీ.. బియ్యం బిజినెస్ ప్రారంభించారు. మరి ఇది వ్యాపారం కాదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ''ధరలు పెరుగుతున్నాయి కాబట్టి.. బియ్యం తక్కువ ధరలకు అందించాలి కాబట్టి..'' అంటూ దీర్గాలు తీస్తున్నారు. కానీ, నిత్యం బంగారం ధరలు పెరుగుతున్నాయి. సిమెంటు ధరలు పెరుగుతున్నాయి. మరి వాటిని కూడా వ్యాపారంలోకి తీసుకువస్తారా? అనేది ప్రశ్న.
ఏం చేయాలి?
అసలు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏం చేయాలి? బియ్యం ధరలకు రెక్కలు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు పెరిగిన ధరలు.. కేంద్రం రూ.29కే కిలో ఇస్తే.. తగ్గుతాయా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వమే కిలో రూ.29కి అమ్మితే..(అది ఏ బ్రాండో తెలియదు. నాణ్యత ఎలా ఉందో తెలియదు) బహిరంగ మార్కెట్ పరిస్థితి ఏంటి? అడ్డు అదుపు లేకుండా.. ప్రజలను దోచుకోరా? కట్టి చేయాల్సింది మార్కెట్‌ను కానీ.. ఇలా వ్యాపారానికి దిగిపోయి. ఎన్నికలకు ముందు ఇలా చేయడం ఓటు బ్యాంకు పాలిటిక్స్ తప్ప మరేమీ కాదని అంటున్నారు పరిశీలకులు.