సంచలనం : స్పైస్ జెట్ లో అంత భారీగా వాటా కొననున్న జంట!
ఇంతకీ ఈ జంట ఎవరు? అన్న విషయంలోకి వెళితే.. యూనివర్సల్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడే హరిహర మహాపాత్ర. ఈ కంపెనీని 2011లో ఏర్పాటు చేశారు.
ఆసక్తికర పరిణామం ఒకటి స్టాక్ మార్కెట్ లో చోటు చేసుకుంది. పెద్దగా అంచనాలు లేని స్పైస్ జెట్ విమానయాన సంస్థ షేరు గడిచిన కొద్ది రోజులుగా జోరు పెరగటం.. ఈ సంస్థకు సంబంధించి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. తాజాగా మరో కొత్త విషయం తెర మీదకు వచ్చింది. ముంబయికి చెందిన ఒక జంట స్పైస్ జెట్ లో రూ.1100 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న విషయం వెల్లడైంది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త హరిహర మహాపాత్ర.. ఆయన సతీమణి ప్రీతి కలిసి స్పైస్ జెట్ లో భారీగా పెట్టుబడులు పెట్టటం ద్వారా ఆ సంస్థకు చెందిన 19 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇందులో భాగంగా 13 కోట్ల కన్వర్టబుల్ వారెంట్లు.. 32.08 కోట్ల తాజా ఈక్విటీ షేర్ ఒక్కొక్కటి రూ.50 చొప్పున జారీ చేయటం ద్వారా రూ.2254 కోట్ల నిధుల సమీకరణకు డిసెంబరు 19న స్పైస్ జెట్ వాటాదార్ల అనుమతి కోరింది. వాటాదారుల సమ్మతి కోసం సమర్పించిన పత్రాల్ని చూసినప్పుడు.. ప్రిఫరెన్షియల్ పద్దతిలో మహాపాత్ర జంటతో పాటు మరికొందరికి ఈక్విటీ షేర్లు జారీ చేయాలని భావిస్తున్నారు. మంబయి జంట పెట్టే పెట్టుబడిలో రూ.వెయ్యి కోట్లను 20 కోట్ల షేర్ల ను ప్రీతికి బదలాయిస్తారు. మరో రూ.వంద కోట్లకు సమానమైన షేర్లను ఆమె భర్త హరిహర మహాపాత్రకు జారీ చేస్తారు.
ఇంతకీ ఈ జంట ఎవరు? అన్న విషయంలోకి వెళితే.. యూనివర్సల్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడే హరిహర మహాపాత్ర. ఈ కంపెనీని 2011లో ఏర్పాటు చేశారు. తాజా పెట్టుబడుల వ్యవహారం అనంతరం స్పైస్ జెట్ ప్రమోటర్ గా వ్యవహరిస్తున్న అజయ్ సింగ్ వాటా 56.49 శాతం నుంచి 38.5 శాతానికి తగ్గనుంది. రూ.1100 కోట్లు పెట్టనున్న ముంబయి జంటకు స్పైస్ జెట్ లో 19 శాతం వాటా లభించనుంది. అయితే.. దీనికి సంబంధించిన ప్రాసెస్ పూర్తి కాలేదు. మరోవైపు.. గోఫస్ట్ ఎయిర్ లైన్స్ ను కొనుగోలు చేసే దిశగా స్పైస్ జెట్ అడుగులు వేస్తున్న వేళలో.. తాజా పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం.