చేతులు కలిపిన దిగ్గజాలు.. అంబానీ - అదానీ సంస్థల మధ్య సంచలన డీల్
గౌతమ్ అదానీకి చెందిన ఒక విద్యుత్ ప్రాజెక్టులో ముకేశ్ అంబానీ సారథ్యంలో ఉన్న రిలయన్స్ సంస్థ 26 శాతం వాటాను కొనుగోలు చేయటం ఆసక్తికరంగా మారింది.
గుజరాత్ కు చెందిన ఈ రెండు దిగ్గజ కంపెనీల మధ్య కనిపించని పోటీ ఉంటుందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అందుకు భిన్నంగా తాజాగా ఈ రెండు వ్యాపార దిగ్గజాలు చేతులు కలిపాయి. దేశీయ కార్పొరేట్ రంగంలో సంచలనంగా మారిన ఈ డీల్ రానున్న రోజుల్లో మరిన్ని పరిణామాలకు తెర తీస్తుందన్న వాదన వినిపిస్తోంది. గౌతమ్ అదానీకి చెందిన ఒక విద్యుత్ ప్రాజెక్టులో ముకేశ్ అంబానీ సారథ్యంలో ఉన్న రిలయన్స్ సంస్థ 26 శాతం వాటాను కొనుగోలు చేయటం ఆసక్తికరంగా మారింది.
తొలిసారి ఈ ఇద్దరు చేతులు కలిపి చేసుకున్న ఒప్పందం కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మధ్యప్రదేశ్ లోని ప్లాంట్ కు చెందిన 500 మెగావాట్ల యూనిట్ లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను రిలయన్స్ తన సొంత అవసరాలకు వినియోగించకునేలా కూడా ఈ రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. అదానీకి చెందిన పవర్ ప్రాజెక్టులో రిలయన్స్ 26 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం అదానీ పవర్ పూర్తి అనుబంధ సంస్థ అయిన మహన్ ఎనర్జెన్ లిమిటెడ్ లో 5 కోట్ల ఈక్విటీ షేర్లను రిలయన్స్ సొంతం చేసుకుంది.
ఆసక్తికర అంశం ఏమంటే రూ.10 ముఖ విలువకే 5 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. 500 మెగావాట్ల విద్యుత్ ను రిలయన్స్ అవసరాలకు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. సొంత వినియోగ పాలసీలో భాగంగా రిలయన్స్ తో 20 ఏళ్ల దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని చేసుకున్నట్లుగా అదానీ పవర్ వెల్లడించింది. 2800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ సామర్థ్యంతో ఏర్పాటు అవుతున్న ఎంఈఎల్ ప్లాంట్ లో 600 మెగావాట్ల యూనిట్ ను సొంత అవసరాల పద్దతిలో వినియోగించనున్నారు.
అంబానీ- అదానీల మధ్య వ్యాపార పోటీ ఉందన్న మాట వినిపించినా.. దానికి సంబంధించి ఇప్పటివరకు ఎక్కడా ఎలాంటి ఆధారం లభించింది లేదు. అదే సమయంలో ఈ రెండు దిగ్గజ కంపెనీలు వ్యాపార పరంగా పోటీ పడింది లేదు. వీరిద్దరు ఒక్క స్వచ్ఛ ఇంధన వ్యాపారంలో మినహాయించి ఎక్కడా ఒకేలాంటి వ్యాపారాలు చేసింది లేదు. చమురు - గ్యాస్ నుంచి టెలికాం దాకా అంబానీకి వ్యాపారాలు ఉంటే.. బొగ్గు తవ్వకం నుంచి ఎయిర్ పోర్టుల వరకు అదానీ విస్తరించారు. ఒక సందర్భంలో మాత్రం వీరిద్దరి మధ్య ప్రత్యక్ష వ్యాపార పోరు సాగనుందా? అన్న చర్చ 5జీ స్పెక్ట్రమ్ కొనుగోలు వేళలో చోటు చేసుకున్నా.. ఆ వాదనకు చాలా త్వరగా ఫుల్ స్టాప్ పడింది.
దీనికి కారణం.. అదానీ గ్రూప్ దరఖాస్తు చేసుకున్న 5జీ స్ట్రెక్టమ్ పబ్లిక్ నెట్ వర్కు కోసం కాదని తేలిపోయింది. ఇదిలా ఉంటే.. రెండేళ్ల క్రితం (2022) అంబానీతో సంబంధం ఉన్న ఎన్ డీజీలో తనకున్న వాటాల్ని అదానీకి అమ్మేయటం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. ఈ నెల మొదట్లో ముకేశ్ అంబానీ చిన్న కొడుకు పెళ్లికి అదానీ హాజరయ్యారు. అంతలోనే ఈ ఆసక్తికర డీల్ తెర మీదకు వచ్చింది.