భారీ క్రాష్: 18 నెలల్లో అతి పెద్ద పతనం!

గడిచిన 18 నెలల్లో అతి పెద్ద పతనంగా పేర్కొంటున్న వేళ.. ప్రపంచ మార్కెట్లలోని ప్రతికూలతలు భారత స్టాక్ మార్కెట్ మీద ప్రభావాన్ని చూపాయి.

Update: 2024-01-18 07:30 GMT

మార్కెట్లు అన్న తర్వాత అప్ అండ్ డౌన్ లు కామన్. అనిశ్చితికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే స్టాక్ మార్కెట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త ఏడాదిలో అప్ తప్పించి.. పెద్ద డౌన్ అన్నది లేని వేళ... జీవితకాల గరిష్ఠాలతో దూసుకెళుతున్న స్టాక్ మార్కెట్ జోరుకు బ్రేకులు పడ్డాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బుధవారం భారీ నష్టాల్లో ట్రేడింగ్ ముగిసింది. గడిచిన 18 నెలల్లో అతి పెద్ద పతనంగా పేర్కొంటున్న వేళ.. ప్రపంచ మార్కెట్లలోని ప్రతికూలతలు భారత స్టాక్ మార్కెట్ మీద ప్రభావాన్ని చూపాయి.

ఒక్కరోజు వ్యవధిలో క్రాష్ అయిన మార్కెట్ల పుణ్యమా అని.. బీఎస్ఈలో రూ.4.69 లక్షల కోట్ల మదుపరుల సొమ్ము ఆవిరి అయ్యాయి. బ్యాంకింగ్.. మెటల్.. ఆయిల్ రంగ షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. సెన్సెక్స్ 1130 పాయింట్ల పతనం.. నిఫ్టీ 385 పాయింట్ల నష్టంతో మొదలు కాగా.. ఒక దశలో సెన్సెక్స్ 1699 పాయింట్లు క్షీణించాయి. ఆ తర్వాత కాస్తంత సర్దుబాటుతో సెన్సెక్స్ 1628పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 460 పాయింట్లు పతనమయ్యాయి.

ఇంత భారీ పతనం 2022 జూన్ 13 తర్వాత ఇదే కావటం గమనార్హం. ఈ భారీ పతనంలో ఒక్క షేరు కీలక పాత్ర పోషించింది. హెవీ వెయిటేజీ షేరుగా చెప్పే హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ షేరు ఏకంగా 8.46 శాతం నష్టపోయింది. దీంతో.. ఈ బ్యాంక్ షేరు మార్కెట్ విలువ ఒక్కరోజులోనే రూ.1.07 లక్షల కోట్లు ఆవిరి కావటం గమనార్హం. దీంతో.. బ్యాంకు మార్కెట్ విలువ రూ.11.66 లక్షల కోట్లకు దిగి వచ్చింది. అధిక వెయిటేజీ ఉన్న హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు షేరు నష్టం మార్కెట్ పతకాన్ని మరింత ప్రభావితం చేసింది. నిఫ్టీ కోల్పోయిన మొత్తం 460పాయిట్లలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు వాటానే దగ్గర దగ్గర 235 పాయింట్లు ఉంది.

ఎందుకిలా హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ షేరు ఇంతటి ఒత్తిడికి గురైందన్న విషయంలోకి వెళితే.. ఈ బ్యాంకు డిసెంబరు క్వార్టర్ ఫలితాలు నిరాశపరిచాయి. రుణ వ్రద్ధి.. లిక్విడిటీ కవరేజ్ రేషియోలపై ఆందోళన వ్యక్తమైంది. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలుగా పేరున్న సీఎల్ఎస్ఏ.. మోర్గాన్ స్టాన్లీలు ఈ షేరు రేటింగ్ తగ్గించాయి. దీంతో.. ఈ షేరు మీద ప్రభావం పడింది. ఆ మాటకు వస్తే.. బ్యాంకింగ్ షేర్లు అన్ని ప్రభావితమయ్యాయి. అయితే.. హెచ్ డీఎఫ్ సీ స్థాయిలో మాత్రం కాదు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. ఆసియా, యూరోప్ మార్కెట్లు 2 శాతం క్షీణిస్తే.. అమెరికా ఒక శాతానికి పైగా నష్టంతో ట్రేడ్ అయ్యింది. ఈ ప్రభావం దలాల్ స్ట్రీట్ మీద పడింది.

మార్కెట్ క్రాష్ కారణాల్ని చూస్తే..

- చైనా ఆర్థిక వ్రద్ధి రేటు 2023లో 5.2శాతం అంచనాల్ని అందుకోలేకపోవటం

- డాలర్ ఇండెక్స్ నెల గరిష్ఠానికి చేరుకోవటం

- యూఎస్ ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లపై ప్రభావం చూపే అమెరికా డిసెంబరు ద్రవ్యోల్బణ డేటా

- అమెరికాలో పదేళ్ల కాలపరిమితి కలిగిన బాండ్లపై రాబడులు ఒక్కసారిగా పెరగటం

- క్రూడాయిల్ తో పాటు ఇతర కమోడీటీల ధరల పెంపునకు కారణమయ్యే డాలర్ ఇండెక్స్ సైతం నెల రోజుల గరిష్ఠానికి చేరటం

Tags:    

Similar News