మార్కెట్లకు యుద్ధభయం.. మొదటి రోజు రూ.5లక్షల కోట్లు ఆవిరి!
ఇజ్రాయల్.. ఇరాన్ మధ్య చోటు చేసుకున్న తాజా పరిణామాలతో పాటు.. యుద్ధ భయాలు మార్కెట్ సెంటిమెంట్ ను తీవ్రంగా దెబ్బ తీశాయి.
అక్కడెక్కడో ఏదో జరుగుతుంది. వేలాది కిలోమీటర్ల అవల ఉన్నా.. జరిగిన దానితో మనకెలాంటి సంబంధం లేకుండా.. అందరూ ఎఫెక్టు అయ్యే పరిస్థితి ప్రపంచీకరణ పుణ్యమా అని చోటు చేసుకుంది. సదూరాన ఉన్న రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం.. మన స్టాక్ మార్కెట్ ను షేక్ చేసింది. పశ్చిమాసియాలో తాజాగా నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో.. మార్కెట్లకు ఓపెనింగ్ రోజు అయిన సోమారం ఒక శాతానికి పైగా నష్టపోయింది. దీంతో మదుపరుల సొమ్ము దాదాపు రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
ఇజ్రాయల్.. ఇరాన్ మధ్య చోటు చేసుకున్న తాజా పరిణామాలతో పాటు.. యుద్ధ భయాలు మార్కెట్ సెంటిమెంట్ ను తీవ్రంగా దెబ్బ తీశాయి. దీనికి తోడు ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల అనిశ్చితి.. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు.. మార్చిలో టోకు ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠానికి చేరుకోవటం లాంటి అంశాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. సోమవారం ట్రేడింగ్ ఆరంభం నుంచి ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించలేదు. దీంతో సూచీలు రోజంతా నష్టాల్లోనూ కదలాడాయి.
ట్రేడింగ్ చివరకు సెన్సెక్స్ 845 పాయింట్లు పతనమై.. రెండు వారాల కనిష్ఠం దిగువున 73,400 వద్ద నిలవగా.. నిఫ్టీ 247 పాయింట్లు క్షీణించి 22,272 వద్ద స్థిరపడింది. ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు తప్పించి.. మిగిలిన అన్నీ రంగాల షేర్లు నేల చూపులు చూశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,288 కోట్ల షేర్లను అమ్మేయగా.. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.4763 కోట్ల షేర్లను కొనుగోలు చేయటం గమనార్హం. ఒక్క చైనా తప్పించి ఆసియాలోని మిగిలిన అన్నీదేశాల సూచీలు దాదాపు ఒక శాతానికి పైగా నష్టపోగా.. యూరప్ మార్కెట్లు మాత్రం కాస్తంత కోలుకున్నాయి.
సోమవారం ట్రేడింగ్ లో లాభపడ్డ ఆయిల్ షేర్లు మాత్రమే కాదు. మరికొన్ని షేర్లు ప్రత్యేక పరిస్థితుల్లో లాభపడినట్లుగా చెబుతున్నారు. ఐటీ దిగ్గజం టీసీఎస్ షేరు ఒకటిన్నర శాతం నష్టపోయింది. క్యూ4 ఫలితాలు మెప్పించటంతో ట్రేడింగ్ ప్రారంభంలో 1.50 శాతం పెరిగింది. అయితే.. మార్కెట్ నష్టాల ట్రెండ్ కారణంగా పెరిగిన శాతం మేర నష్టపోయింది. సెన్సెక్స్ లోని 30 షేర్లలో మారుతీ సుజుకీ ఒక శాతం.. నెస్లే 0.62 శాతం.. సన్ ఫార్మా 0.10 శాతం లాభపడ్డాయి. ఇక.. ఆస్టర్ డీఎం హెల్త్ కేర్ షేరు 7 శాతం లాభపడింది. దీనికి కారణం ప్రతి ఈక్విటీ షేరుకు రూ.118 ప్రత్యేక డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు ఓకే చెప్పటంతో ఈ షేరు భారీగా లాభపడింది. ట్రేడింగ్ లో 14 శాతం ఎగసి రూ.558 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేయటం గమనార్హం.