బ్లడ్ బాత్: యుద్ధ భయాలతో మార్కెట్లు భారీ పతనం.. తీవ్రత ఎంతంటే?
అంచనాలకు తగ్గట్లే ఈ రోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో మొదలయ్యాయి.
అంచనాలకు తగ్గట్లే ఈ రోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో మొదలయ్యాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్నపరిణామాల నేపథ్యంలో ఈ సోమవారం మార్కెట్లు భారీగా నష్టపోతాయన్న అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే.. ట్రేడింగ్ ఆరంభం నుంచి నష్టాల బాట పట్టింది. సెన్సెక్స్.. నిఫ్టీ సూచీలు భారీగా నష్టపోయాయి. ఉదయం 12 గంటల సమయానికి సెన్సెక్స్ 2400 పాయింట్లకు పైనే, నిఫ్టీ సూచీ 700 పాయింట్లకు పైనే కుంగాయి. దీంతో.. మదుపరుల విలువైన సొమ్ము గాల్లో కలిసిపోయింది. తాజాగా కుంగిన సూచీల కారణంగా మార్కెట్ విలువ రూ.14 లక్షల కోట్ల మేర ఆవిరి అయ్యింది.
అమెరికాలో మాంద్య భయాలు.. ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలతో పాటు.. మూడో ప్రపంచ యుద్ధ భయాలు మార్కెట్లు కుంగేలా చేశాయి. స్టాక్ మార్కెట్ లో వినిపించే బ్లడ్ బాత్ కు నిదర్శనంగా ఈ రోజు నిలిచినట్లుగా మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ - ఇజ్రాయెల్ మద్య యుద్ధం నెలకొన్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు ప్రతికూల సెంటిమెంట్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ ప్రభావం మన స్టాక్ మార్కెట్ మీదా పడింది.
దీనికి తోడు అగ్రరాజ్యం అమెరికాలో మాంద్యం భయాలు పెరిగాయి. దీని కారణంగా అమెరికన్ మార్కెట్ లోనూ పతనం ఉంది. దీని ప్రభావం ప్రపంచ మార్కెట్ మీదా కనిపిస్తోంది. మరోవైపు వారెన్ బఫెట్ కు చెందిన బెర్క్ షైర్ హాత్వే కంపెనీ ఆపిల్ లో తనకున్న వాటాలో 50 శాతాన్ని అమ్మేసింది. ఇది మార్కెట్ సెంటిమెంట్ ను ప్రభావితం చేసింది. ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా ఆసియా మార్కెట్ లో క్షీణత కనిపిస్తోంది. జపాన్ కు చెందిన నిక్కీ 4.63 శాతం.. హాంకాంగ్ స్టాక్ మార్కెట్ 0.58శాతం.. చైనా మార్కెట్ కూడా తిరోగమనంలో ఉంది.
సెన్సెక్స్ 30 సూచీలో సన్ ఫార్మా.. హెచ్ యూఎల్ షేర్లు మాత్రమే లాభాల్లోఉండగా.. టాటా మోటార్స్.. మారుతీ.. టైటన్.. టాటా స్టీల్.. ఎస్ బీఐ.. జేఎస్ డబ్ల్యూ స్టీల్. .అదానీ పోర్ట్స్.. ఎల్ అండ్ టీ.. ఎం అండ్ ఎం.. రిలయన్స్.. బజాజ్ ఫైనాన్స్.. టెక్ మహీంద్రా.. భారతీ ఎయిర్ టెల్.. బజాజ్ ఫిన్ సర్వ్.. యాక్సిస్ బ్యాంక్.. టీసీఎస్.. ఇన్ఫోసిస్.. ట్రెంట్ తదితర షేర్లు భారీగా నష్టపోయాయి. అగ్రశ్రేణి షేర్లు తక్కువలోతక్కువ 5 శాతం వరకు నష్టపోతున్న పరిస్థితి.