ఆ హీరోలకు అందని ద్రాక్షలా మారిన 1000 కోట్ల క్లబ్!
అయితే తెలుగు, హిందీ, కన్నడ సినిమాలకు సాధ్యమైన రికార్డ్స్.. తమిళ చిత్రాలకు ఇందుకు సాధ్యం కావడం లేదని విశ్లేషిస్తే.. కంటెంట్ ఒక్కటే ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఇండియన్ సినిమాలో ₹1000 కోట్ల కలెక్షన్స్ అనేది బెంచ్ మార్క్ గా మారిపోయింది. ప్రతీ స్టార్ హీరో కూడా ఇప్పుడు వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇప్పటి వరకూ 7 భారతీయ చిత్రాలు మాత్రమే ఈ మైల్ స్టోన్ క్లబ్ లో చేరగలిగాయి. వాటిల్లో 3 తెలుగు చిత్రాలు ఉంటే, 3 హిందీ మూవీస్, ఒక కన్నడ సినిమా ఉంది. అయితే తమిళ, మలయాళ చిత్రాలు మాత్రం 1000 కోట్లకు ఆమడ దూరంలో ఆగిపోతున్నాయి.
మార్కెట్ పరంగా మాలీవుడ్ చాలా చిన్నది. అందులోనూ మలయాళంలో ఎక్కువగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు రూపొందుతుంటాయి కాబట్టి, వెయ్యి కోట్ల వసూళ్లను అందుకోలేకపోతున్నాయని భావించవచ్చు. కానీ సినిమాల బడ్జెట్, హీరోల మార్కెట్ పరంగా బెటర్ పొజిషన్ లో ఉన్న కోలీవుడ్ చిత్ర పరిశ్రమ కూడా రూ. 1000 కోట్ల మైలురాయి మార్క్ ను అధిగమించకోవడం గమనార్హం.
ఎస్.ఎస్. రాజమౌళి, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన 'బాహుబలి 2' సినిమా మొదటిసారిగా 1000 కోట్ల కలెక్షన్స్ ను ఓపెన్ చేసింది. ఆ తర్వాత 'దంగల్' మూవీ ఈ క్లబ్ లో చేరింది. ఇదే క్రమంలో 'KGF 2', RRR, 'పఠాన్', 'జవాన్' చిత్రాలు వెయ్యి కోట్ల మార్క్ ను క్రాస్ చేశాయి. ఇప్పుడు లేటెస్టుగా 'కల్కి 2898 AD' సినిమాతో టాలీవుడ్ మూడోసారి 1000 కోట్ల వసూళ్లను సాధించింది. కానీ తమిళ సినిమాలు మాత్రం వాటి దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయాయి.
నిజానికి భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక సినిమాలు రూపొందించే ఇండస్ట్రీలలో కోలీవుడ్ ఒకటి. దక్షిణాదిలో మిగతా భాషల కంటే ముందుగా 100 కోట్లు, 200 కోట్ల మార్క్ అందుకుంది తమిళ చిత్రాలే. కానీ ఎంతమంది స్టార్లు ఉన్నా, అగ్ర దర్శకులున్నా 1000 కోట్ల వసూళ్లు మాత్రం ఆందుకోలేకపోతున్నారు. రజనీకాంత్ నటించిన 2.0, 'జైలర్' చిత్రాలు.. విజయ్ నటించిన 'లియో' సినిమా రూ. 600 కోట్ల వరకూ వచ్చి ఆగిపోయాయి.
అయితే తెలుగు, హిందీ, కన్నడ సినిమాలకు సాధ్యమైన రికార్డ్స్.. తమిళ చిత్రాలకు ఇందుకు సాధ్యం కావడం లేదని విశ్లేషిస్తే.. కంటెంట్ ఒక్కటే ప్రధాన కారణమని తెలుస్తోంది. కోలీవుడ్ ఫిలిం మేకర్స్ ఎక్కువ శాతం అక్కడి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇవన్నీ మల్టీ లాంగ్వేజెస్ లోకి డబ్ అయినప్పటికీ, నేటివిటీ కారణంగా ఇతర భాషల జనాలకు కనెక్ట్ అవ్వడం లేదు. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ కు తమిళ సినిమాలు ఎక్కడం లేదు. అందుకే తమిళంలో వందల కోట్లు వసూలు చేస్తున్న చిత్రాలు.. హిందీ సర్క్యూట్స్ లో ఫెయిల్ అవుతున్నాయి.
పాన్ ఇండియా సినిమాలకు హిందీ మార్కెట్ చాలా కీలకమనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ దాన్ని దృష్టిలో పెట్టుకునే యూనివర్సల్ కాన్సెప్ట్ తో సినిమాలు రూపొందిస్తున్నారు. ఇవి అక్కడి జనాలకు నచ్చడంతో బ్లాక్ బస్టర్ హిట్లుగా మారుతున్నాయి. కంటెంట్ నచ్చితే ఉత్తరాది ప్రేక్షకులు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి పెడతారనే సంగతి అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఇక మిగతా భాషల్లోనూ టాక్ బాగుంటే ఈజీగా 1000 కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉంటుంది. ఈ లెక్కలన్నీ వేసుకుని సినిమాలు చేస్తే, కోలీవుడ్ నుంచి కూడా వెయ్యి కోట్ల చిత్రాలు వస్తాయి. త్వరలో రాబోతున్న కంగువ, ది గోట్, తంగాలన్, వెట్టాయన్, థగ్ లైఫ్, కూలీ లాంటి చిత్రాలైనా మైలురాయి మార్క్ ను అందుకుంటాయేమో చూడాలి.