25 ల‌క్ష‌ల స్కామ్.. ల‌బోదిబోమ‌న్న దిశా ప‌టానీ తండ్రి!

పిటిఐ కథనం ప్రకారం.. రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ జగదీష్ సింగ్ పటానీ రూ. 25 లక్షలకు మోస‌పోయార‌ని తెలుస్తోంది.

Update: 2024-11-16 16:49 GMT

రోజురోజుకి చీట‌ర్లు గ్యాంబ్ల‌ర్లు పెరుగుతున్నారు. కేవ‌లం అమాయ‌క ప్ర‌జ‌లు మాత్ర‌మే కాదు.. మేధావులు సైతం ఈ చీట‌ర్ల‌కు చిక్కుతున్నారు. అలాంటి ఉచ్చులో ఇటీవల బాధితుల్లో ఒకరు దిశా పటానీ తండ్రి జగదీష్ సింగ్ పటానీ. పిటిఐ కథనం ప్రకారం.. రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ జగదీష్ సింగ్ పటానీ రూ. 25 లక్షలకు మోస‌పోయార‌ని తెలుస్తోంది.


మీడియా క‌థ‌నాల‌ ప్రకారం బరేలీ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఆయ‌న‌ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించారు. ప్రభుత్వ కమిషన్‌లో ఉన్నత స్థాయి పదవిని ఇస్తానని హామీ ఇచ్చిన ఐదుగురు వ్యక్తుల బృందం ఈ మోసానికి కార‌ణ‌మ‌ని శుక్రవారం పోలీసులను తెలిపారు. శివేంద్ర ప్రతాప్ సింగ్, దివాకర్ గార్గ్, జునా అఖారాకు చెందిన ఆచార్య జయప్రకాష్, ప్రీతి గార్గ్ స‌హా ఒక గుర్తు తెలియని వ్యక్తిపై మోసం, నేరపూరిత బెదిరింపు , దోపిడీకి సంబంధించి కేసు నమోదు అయింది. నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ డికె శర్మ పిటిఐకి వివ‌రాలు అందించారు.

దివాకర్ గార్గ్, ఆచార్య జయప్రకాష్‌లకు శివేంద్ర ప్రతాప్ సింగ్ అనే తెలిసిన వ్య‌క్తి జ‌గ‌దీష్ ప‌టానీని ప‌రిచయం చేసారు. స్కామర్లు తనకు చైర్మన్, వైస్ చైర్మన్ పదవి లేదా ప్రభుత్వ కమిషన్‌లో ప్రతిష్టాత్మకమైన పదవిని ఇప్పించ‌గ‌ల‌మ‌ని వాగ్దానం చేశారని జ‌గ‌దీష్ ప‌టానీ ఆరోపించారు. రాజకీయ సంబంధాల గురించి తప్పుడు స‌మాచారం ఇచ్చారు. అంతేగాక తాము చెప్పేది నిజ‌మేన‌ని న‌మ్మ‌బ‌లికేందుకు హిమాన్షు అనే `ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ`గా ఒక సహచరుడిని పరిచయం చేయడం ద్వారా మోస‌గాళ్లు తనను తప్పుదోవ పట్టించారని పటానీ ఆరోపించాడు.

నిందితులు జగదీష్ సింగ్ పటానీ త‌మ‌ను న‌మ్మాడ‌ని నిర్ధారించుకున్న త‌ర్వాత‌ వారు అతని నుండి రూ. 25 లక్షలు తీసుకున్నారు. అందులో రూ. 5 లక్షల నగదు, రూ. 20 లక్షలు మూడు వేర్వేరు బ్యాంకు ఖాతాలకు ఆన్ లైన్ ద్వారా బదిలీ చేసారు. జగదీష్ ఫిర్యాదు ప్రకారం.. ప‌ద‌విని వాగ్ధానం చేసినా కానీ, మూడు నెలలుగా ఈ విషయంలో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో అతడు ఆందోళనకు దిగాడు. అతడు త‌న‌కు వడ్డీ సహా డబ్బు వాపసు ఇస్తామ‌ని వారు వాగ్దానం చేసారు. కానీ వారు మాట త‌ప్పారు. డ‌బ్బు వెన‌క్కి ఇవ్వ‌లేదు. ఆ తర్వాత నిందితుల నుంచి దూకుడు ప్రవర్తన, బెదిరింపులు మొదలయ్యాయని అత‌డు తెలిపాడు. పోలీసులు కేసు న‌మోదు చేసి విచారిస్తున్నారు.

Tags:    

Similar News