నేను స‌రిగా న‌టించ‌కే ఫ్లాప‌య్యాయి: అమీర్ ఖాన్

నా తదుపరి చిత్రం `సితారే జమీన్ పర్‌` విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండేందుకు, లాల్ సింగ్ చడ్డా నాకు బాగా సహాయపడింది.

Update: 2024-08-27 05:52 GMT

నేను బాగా న‌టించ‌లేదు.. అందుకేమ సినిమా ఫ్లాపైంది అని ఎవ‌రైనా న‌టుడు అన‌డం విన్నారా? చాలా అరుదుగా కొంద‌రు స్థిత‌ప్ర‌జ్ఞ‌త క‌లిగిన స్టార్లు మాత్ర‌మే నిజాల్ని అంగీక‌రించేందుకు సిద్ధంగా ఉంటారు. అలాంటి వారిలో ది గ్రేట్ స్టార్, మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ష‌నిస్ట్ అమీర్ ఖాన్ ఒక‌రు. దేశంలోని గొప్ప నటులలో ఒకరైన అమీర్ ఖాన్ చేసిన తాజా ప్రకటన నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఇటీవల న‌టి రియా చక్రవర్తి నిర్వహించిన పోడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో అతడు `లాల్ సింగ్ చద్దా`, `థగ్స్ ఆఫ్ హిందుస్థాన్` వైఫల్యాల గురించి మాట్లాడాడు.

లాల్ సింగ్ చద్దా గురించి ప్రస్తావిస్తూ ``ఆ సినిమా వైఫల్యం ఒక ఎమోష‌న‌ల్ పంచ్. ముజే బోహోత్ బడా ఢక్కా మిలా (వైఫల్యం నన్ను తీవ్రంగా దెబ్బతీసింది). ఈ సినిమా కోసం మా టీమ్ అపారమైన అంకితభావంతో అభిరుచితో ప‌ని చేయ‌డం వ‌ల్ల‌ నిరాశ మరింతగా పెరిగింది`` అని అన్నారు. ఒరిజిన‌ల్ చిత్రం `ఫారెస్ట్ గంప్`కి రచన స‌హా ద‌ర్శ‌క‌త్వ నిర్మాణ శాఖ‌లో అమీర్ చాలా శ్ర‌మించాన‌ని తెలిపారు. కానీ ఒరిజిన‌ల్ లో టామ్ హ్యాంక్స్ అద్భుతంగా న‌టించాడు. నా నటన లాల్ సింగ్ చద్దాను నిరాశపరిచింది. ఇది నా పరిశీలన... దాని నుండి నేను చాలా నేర్చుకున్నాను... అని అన్నారు.

నా తదుపరి చిత్రం `సితారే జమీన్ పర్‌` విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండేందుకు, లాల్ సింగ్ చడ్డా నాకు బాగా సహాయపడింది. థగ్స్ ఆఫ్ హిందూస్థాన్‌ను రూపొందించినప్పుడు `ముజే భీ తీక్ నహీ లగీ థీ` నాకు కూడా పెద్ద‌గా బాగోలేద‌నిపించింది. నేను నా టీమ్‌తో ఇదే విషయాన్ని చర్చించాను. కానీ వారు అవుట్‌పుట్‌తో సంతృప్తి చెందారు. దాని విష‌యంలో మేం తప్పు చేసాము. మా మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ చివరికి సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. సితారే జమీన్ పర్‌కి పని చేయడాన్ని నేను బాగా ఆస్వాధించాను. ఇది అద్భుతమైన చిత్రం`` అని అన్నారు.

ఈ చ‌ర్చ‌ల్లో భాగంగానే `లాల్ సింగ్ చడ్డా` గురించిన మ‌రొక‌ ఆసక్తికరమైన విషయం కూడా వెల్లడైంది. మొదట రియా చక్రవర్తి ఇందులో క‌థానాయిక‌ పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చింది. ఆడిషన్‌లో బాగానే మెప్పించినా కానీ, ర‌కర‌కాల కార‌ణాల‌తో కరీనా కపూర్ ని చిత్ర‌ బృందం ఎంపిక చేసుకుని ముందుకు సాగింది. తర్వాత అమీర్ ఖాన్ రియాకు హృదయపూర్వకంగా ఒక నోట్ ని పంపారు. ఆడిషన్‌లో రియా ఆకట్టుకుంద‌ని అమీర్ ఖాన్ ప్ర‌శంసించారు.

Tags:    

Similar News