రెండే గుడ్లు వేసిందని ప్లేట్ విసిరేసిన నటుడు!
సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత 'ప్రసాద్ బాబు షూటింగ్ కి వచ్చి వెళ్లిపోయాడు' అని చెప్పారు. ఎందుకని అడిగితే... ఆరోజు వాళ్లింట్లో గొడవ జరిగిందిట. ఆ గొడవ కారణం కోడిగుడ్లు అని చెప్పారు.
ఇండస్ట్రీలో మంచి భోజన ప్రియులంటే? పాత తరంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు చెబుతారంతా. ఆయన మెనూ ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని..ఉయదం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకూ నాన్ వెజ్ తప్పనసరిగా ఉంటుంది. ముక్క లేనిదే ముద్ద దిగని నటుడిగా ఆయనకు మంచి పేరుంది. ఆ తర్వాత అంతగా ఫేమస్ అయింది మాత్రం డార్లింగ్ ప్రభాస్ అనే చెప్పాలి. ప్రభాస్ కూడా మంచి నాన్ వెజ్ ప్రియుడు. అందులో రకరకాల ఐటమ్ లు ట్రై చేయడం ఆయన ప్రత్యేకత. తనతో పాటు చుట్టూ ఉన్న వారికి ఇష్టమైన నాన్ వెజ్ వంటకాలు అన్నింటిని వడ్డిస్తుంటాడు.
సహ నటుల్ని తినమని ఎంతగా ఇబ్బంది పెడతాడో? ఆ అనుభవం చూసిన వాళ్లు చెబుతుంటారు. మరి భార్య రెండే గుడ్లు వండిందని అలిగి అన్నం తినడం మానేసిన నటుడు కూడా ఉన్నారా? అంటే మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ఉన్నారనే అంటున్నారు. ఆనాటి పాత జ్ఞాపకాల్లో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. ఇందులోనే కంచం విసిరేసిన ఆ నటుడి గురించి తొలిసారి బయటకు వచ్చింది. ఆ సంగతులు సురేఖ మాటల్లోనే.. 'చిరంజీవి గారు పచ్చడితోనైనా అన్నం తినేస్తారు. రకరకాల వంటలు తినాలని ఉండదు. కానీ ఉప్పు తక్కువైతే మాత్రం చెబుతారు.
ఈ సందర్భంలో నాకు ఒక సంఘటన గుర్తుకొస్తోంది. మేము మద్రాసులో కాపురం ఉండే సమయంలో ఆయన షూటింగ్స్‌లో బాగా బిజీగా ఉండేవారు. అప్పుడే ప్రసాద్ బాబు చిరంజీవి గారు కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఒక రోజు ఇంట్లో కూరలు లేకపోతే పప్పు చారు చేసి వడియాలు వేయించాను. ఈయన అవి తినేసి షూటింగ్ కి వెళ్లిపోయారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత 'ప్రసాద్ బాబు షూటింగ్ కి వచ్చి వెళ్లిపోయాడు' అని చెప్పారు. ఎందుకని అడిగితే... ఆరోజు వాళ్లింట్లో గొడవ జరిగిందిట. ఆ గొడవ కారణం కోడిగుడ్లు అని చెప్పారు.
ప్రసాద్ బాబు వాళ్లవిడ కోడిగుడ్ల పులుసు పెట్టి అందులో రెండు గుడ్లు వేసిందని గొడవ చేసి ప్లేట్ విసిరేసి షూటింగ్ కి వచ్చారుట. వచ్చి చిరంజీవిని ఏం తిన్నావని అడితే పప్పు చారు...వడియాలు అన్నారుట. ఆయన అలా చెప్పడం చూసి గిల్టీగా అనిపించి భార్యకు సారీ చెప్పటానికి షూటింగ్ వదిలి వెళ్లిపోయారట. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయని' అన్నారు.