చెడు సావాసంతో హీరోయిన్‌కి 5 ఏళ్ల జైలు

కెరీర్ ఆరంభంలోనే స‌ల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో స‌ర‌స‌న న‌టించింది. షారూఖ్‌, సైఫ్ ఖాన్ లాంటి అగ్ర హీరోల సినిమాల్లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి.

Update: 2023-09-24 04:18 GMT

కెరీర్ ఆరంభంలోనే స‌ల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో స‌ర‌స‌న న‌టించింది. షారూఖ్‌, సైఫ్ ఖాన్ లాంటి అగ్ర హీరోల సినిమాల్లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత తెలుగు న‌టుడు, శ‌తాధిక చిత్రాల హీరో శ్రీ‌కాంత్ స‌ర‌స‌న తాజ్ మ‌హ‌ల్ (1995) అనే బ్లాక్ బ‌స్ట‌ర్ తో టాలీవుడ్ లో ప్ర‌వేశించింది. ఇక్క‌డ‌ వ‌రుస‌గా ఆఫ‌ర్లు వ‌రించాయి. ఎంద‌రో పాపుల‌ర్ స్టార్ల‌తో కలిసి పనిచేసే అవ‌కాశం ద‌క్కింది. అంతేకాదు.. ఈ భామ ఉన్న‌త విద్యావంతురాలు కూడా. ఆక్స్‌ఫర్డ్ యూనివ‌ర్శిటీలో గ్రాడ్యుయేష‌న్ చేసింది. అయితే ఒకే ఒక్క‌ తప్పు త‌న‌ను ఐదేళ్లపాటు జైలులో మ‌గ్గేలా చేసింది. ఇది న‌టిగా త‌న కెరీర్ ముగింపున‌కు దారి తీసింది. ఇంత‌కీ ఎవ‌రీ భామ‌? అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి. ఈ భామ ఎవ‌రు అంటే? పాపుల‌ర్ హీరోయిన్ మోనికా భేడి.

నిజానికి మోనిక తన బాల్యంలో కుటుంబం సహా 1979లో నార్వేకు వెళ్లింది. అక్కడ పాఠశాల విద్యను అభ్యసించింది. ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రురాలైంది. ఆ త‌ర్వాత మోడ‌లింగ్ లో ప్ర‌వేశించి, న‌ట‌నారంగంలోను రాణించింది. బాలీవుడ్ టు టాలీవుడ్ త‌న‌కంటూ ఒక రేంజు ఉంద‌ని నిరూపించింది. ముఖ్యంగా త‌న‌దైన అందం, న‌ట‌ప్ర‌తిభ‌తో మోనిక‌ యువ‌త‌రం గుండెల్లో గుబులు రేపింది. అయితే జైలు జీవితం అనే చీక‌టి రోజులు త‌న కెరీర్ ని స‌ర్వ‌నాశ‌నం చేసాయి. జైలు నుంచి వ‌చ్చాక ఇక ఎప్ప‌టికీ సినీరంగంలో అవ‌కాశాలు అందుకోలేదు. ఇక్క‌డ న‌టించేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌లేదు.

అందాల క‌థానాయిక మోనికా భేడిని తెలుగు యూత్ అంత తేలిగ్గా మ‌ర్చిపోదు. మెరిసేదంతా బంగారం కాదు! అన‌డానికి ఆమె క‌థ ఒక పెద్ద ఎగ్జాంపుల్. రంగుల ప్ర‌పంచంలో ఆక‌ర్ష‌ణ‌ల మ‌ధ్య ఎదిగినా కానీ, త‌ప్పు దారి త‌న కెరీర్ కి తీవ్ర‌మైన హాని చేసింది. తప్పుడు వ్యక్తుల సహవాసంలో తన‌ స్టార్‌డమ్‌ను పెంచుకోవాల‌నే ఆత్రంలో ఉన్న ఆమె త‌న‌ని వ‌రించిన అవ‌కాశాన్ని కాల‌ద‌న్నుకుంది. క‌థానాయిక గా మోనిక భేడి త‌న హోదాను కోల్పోయింది. జోడీ నెం.1, ఏక్ ఫూల్ తీన్ కాంటే, ఖిలోనా, తాజ్ మ‌హ‌ల్ ( వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన మోనికా బేడీ కెరీర్ అనూహ్యంగా మ‌స‌క‌బారింది.

1975 జనవరి 18న పంజాబ్‌లోని హోసియార్‌పూర్‌లో జన్మించిన మోనికా తండ్రి డాక్టర్ ప్రేమ్ కుమార్ బేడీ ఒక ప్ర‌ముఖ‌ డాక్టర్ .. ఆమె తల్లి శంకుంతల గృహిణి. త‌న‌కు ఒక తమ్ముడు బాబీ బేడీ ఉన్నాడు. మోనికా తన కుటుంబంతో కలిసి 1979లో నార్వేకు వెళ్లింది. అక్కడ పాఠశాల విద్యను అభ్యసించింది. ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రురాలైంది.

మోనికా ట్యాలెంటెడ్ డ్యాన్సర్ అయినప్పటికీ మొదట్లో నటనపై ఆసక్తి లేదు. గురు గోపి దగ్గర క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడానికి మోనిక‌ ముంబైకి వెళ్లింది. ఒక రోజు నటుడు కం నిర్మాత మనోజ్ కుమార్ గోపి గురు స్టూడియోలో మోనికా డ్యాన్స్ చేయడం చూశాడు. వెంట‌నే త‌న‌ కుమారుడు కునాల్ గోస్వామి సరసన కిరీట్‌మాన్ లో క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశం ఇచ్చారు.

మనోజ్ మోనికాతో 3 సంవత్సరాల ఒప్పందంపై సంతకం చేసాడు. కానీ కీర్తిమాన్ ఎప్పుడూ సెట్స్ పైకి వెళ్ల‌లేదు. త‌న‌ను కాంట్రాక్ట్ నుండి విడుదల చేయమని మనోజ్ కుమార్‌ను అభ్యర్థించింది. అతడు చ‌లించి త‌న‌కు ఆ అవ‌కాశం క‌ల్పించాడు. మోనికా తన మొదటి సినిమా ఆఫ‌ర్‌ను టాలీవుడ్ లోనే అందుకుంది. మూవీ మొఘ‌ల్ డా.డి రామా నాయుడు నిర్మించిన‌ తెలుగు చిత్రం తాజ్ మహల్ (1995)లో క‌థానాయిక‌గా అవ‌కాశం అందుకుంది. ఈ చిత్రం సూపర్‌హిట్ అయ్యింది. ఆ తర్వాత సురక్ష (1995)లో సైఫ్ అలీ ఖాన్ స‌ర‌స‌న‌ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె ఆషిక్ మస్తానే, ఖిలోనా, ఏక్ ఫూల్ తీన్ కాంటే, తిర్చి టోపీవాలే వంటి చిత్రాలలో న‌టించింది. ఇవ‌న్నీ ఘోరంగా పరాజయం పాలయ్యాయి. కెరీర్ ని అప‌జ‌యాలు ప్రతికూలంగా ప్రభావితం చేశాయి.

మోనికా భారతదేశం స‌హా విదేశాలలో స్టేజ్ షోలు చేయడం ప్రారంభించింది. దుబాయ్‌లో తన స్టేజ్ షోలో ఆమె గ్యాంగ్‌స్టర్ అబూ సలేమ్‌ను కలుసుకుంది. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. వీరి మధ్య ఉన్న స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారి ఇద్దరూ డేటింగ్ ప్రారంభించారు. అబు మోనికాను చాలా పెద్ద బ్యానర్‌లతో మాట్లాడి ద‌ర్శ‌క‌నిర్మాతలకు సిఫార్సు చేయడం ప్రారంభించాడు. ఆమెకు ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్, తడా, జోడి నంబర్ 1 వంటి సినిమాల్లో అవ‌కాశాలు వచ్చాయి.

మోనికా అబుతో స్థిరపడేందుకు చిత్ర పరిశ్రమను విడిచిపెట్టింది. అయితే 2002లో మోనికా -అబు పోర్చుగల్‌కు వెళుతూ క‌స్ట‌మ్స్ కి ప‌ట్టుబ‌డ్డారు. నకిలీ పత్రాలతో ప్రయాణించినందుకు ఈ జంటను పోలీసులు అరెస్టు చేశారు. పోర్చుగల్ జైలులో 2.5 సంవత్సరాల తర్వాత మోనికా- అబు జంట‌ను భారతదేశానికి వెళ్లిపోవాల‌ని వ‌దిలేశారు. ఇక్క‌డ‌ సీబీఐ కోర్టు మోనికాకు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది, అయితే తర్వాత ఆమె శిక్షను 3 సంవత్సరాలకు తగ్గించింది. 2002 నుంచి 2007 మధ్య మోనిక‌ ఐదేళ్లపాటు జైలులో గడిపారు. ఆ త‌ర్వాత మోనికా బిగ్ బాస్ 2, ఝలక్ దిఖ్లా జా వంటి రియాలిటీ షోలతో తన కెరీర్‌ను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నించింది. సరస్వతీచంద్ర, బంధన్ వంటి షోలు కూడా చేసింది. ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్ ఉంది. త‌న‌ కార్యకలాపాల గురించి ఫ్యాన్స్ కి నిరంత‌రం తెలియజేస్తుంది.

Tags:    

Similar News