ఫోటోషూట్లు సరే.. తిరిగి ఇండస్ట్రీకి వచ్చేదెపుడు రాశీ?
ఇటీవలి కాలంలో రాశీ ఖన్నా టాలీవుడ్ లో ఉనికిని కోల్పోయిందా? అంటే అవుననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి
ఇటీవలి కాలంలో రాశీ ఖన్నా టాలీవుడ్ లో ఉనికిని కోల్పోయిందా? అంటే అవుననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బ్యూటీ గత కొంతకాలంగా పూర్తిగా హిందీ చిత్రాల వైపే మొగ్గు చూపుతోంది. ఇంతకుముందు తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డీకే రూపొందించిన వెబ్ సిరీస్ ఫర్జీలో నటించింది. ఈ సిరీస్ లో తన నటనకు మంచి పేరొచ్చింది. కానీ ఆ తర్వాత కూడా రాశీకి తిరిగి తెలుగు పరిశ్రమలో అవకాశాల్లేవ్.
తెలుగులో రాశీ నటించిన చిట్టచివరి సినిమా 'ప్రతి రోజు పండగే'. సాయిధరమ్ ఈ చిత్రంలో కథానాయకుడు. ఈ సినిమా పెద్ద విజయం దక్కించుకున్నా కానీ ఎందుకనో రాశీకి ఆశించినంతగా ఇక్కడ అవకాశాలు రాలేదు. దీంతో ఈ బ్యూటీ పూర్తిగా హిందీ భాషనే నమ్ముకుని అక్కడ పని చేసేందుకు మాత్రమే ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ లో పెద్ద ఆఫర్ల కోసం గాలం వేస్తోంది. కానీ అక్కడ కూడా ఆశించినంతగా పెద్ద అవకాశాలేవీ రాలేదు. అటు తమిళ నిర్మాతలతో టచ్ లో ఉన్నా అవేవీ ఫలించడం లేదు. ప్రస్తుతం రాశీ సోషల్ మీడియాల్లో ఫోటోషూట్లతో అభిమానులకు టచ్ లో ఉంటోంది.
తాజాగా రాశీ షేర్ చేసిన డిజైనర్ ఫోటోషూట్ యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. నిజంగా ఈ కొత్త లుక్ మైండ్ బ్లోయింగ్ అంటూ రాశీని ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. అందాల రాశీ డిజైనర్ శారీలో ఎంతో దివ్యమైన రూపంతో ఆకర్షిస్తోంది. ఫెదర్ లైన్ షోల్డర్స్ తో రూపొందించిన ఈ ప్రత్యేకమైన క్రిస్టలైన్ డిజైనర్ శారీలో దేవతాసుందరినే తలపిస్తోందంటూ కితాబిచ్చేస్తున్నారు. గ్రీక్ గాడ్ లు మనసుపడిన అందగత్తెలా రాకుమారిలా రాశీ కనిపిస్తోందని కొందరు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ రేర్ క్లిక్ అందరిలో వైరల్ గా మారిపోతోంది. రాశీ ప్రయత్నాలు ఇకనైనా ఫలించి తిరిగి తెలుగు పరిశ్రమలో బిజీ అవుతుందేమో చూడాలి.