మణిరత్నం PS అర్థంకాక గందరగోళంలో ఉన్నాను
ఇటీవల జరిగిన రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్ లో 'సలార్' ఫేం, లేడీ రెబల్ స్టార్ శ్రీయా రెడ్డి ఒక షాకింగ్ కామెంట్ చేసారు
ఇటీవల తెలుగు మీడియాలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇంతకుముందు ఫిలింక్రిటిక్స్ ని వేదికపైకి ఎక్కించి నిర్మాతలే ప్రశ్నించే కార్యక్రమం పెద్ద సక్సెసైంది. ఎవరెవరికి ఎలాంటి సందేహాలున్నా ఇలాంటి వేదికల వల్ల అవన్నీ తీరిపోతాయని భరోసా కలిగింది.
ఇటీవల జరిగిన రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్ లో 'సలార్' ఫేం, లేడీ రెబల్ స్టార్ శ్రీయా రెడ్డి ఒక షాకింగ్ కామెంట్ చేసారు. తాను మణిరత్నం తెరకెక్కించిన 'పొన్నియన్ సెల్వన్'ని అర్థం చేసుకోలేకపోయానని అన్నారు. సినిమా గందరగోళంగా ఉందని శ్రీయ రెడ్డి పేర్కొన్నారు.
ఇదే వేదికపై ఉన్న బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ చెప్పిన కొన్ని మాటలు ఆసక్తిని కలిగించాయి. తాను సలార్ నిర్మాతనైతే సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసి ప్రేక్షకులను ముందుగానే సిద్ధం చేసి ఉండేవాడిని అని అన్నారు. ప్రేక్షకులు సినిమా నుండి ఏమి ఆశించాలో అర్థమయ్యేలా చేయడం, తద్వారా వారు తర్వాత కథనాన్ని ఆస్వాధించగలిగేలా చేయడం దర్శకనిర్మాతలకు చాలా అవసరమని శోబు యార్లగడ్డ అభిప్రాయపడ్డారు. ముందు ప్రపంచాన్ని ప్రెజెంట్ చేసి ఇవే క్యారెక్టర్లు.. ఇదీ సినిమాలో చూస్తాం అని చెబితే ప్రేక్షకులు ఆ పాత్రలకు బాగా కనెక్ట్ అవుతారు. అందులో తప్పు లేదని శోభు అన్నారు. కథ మొత్తం చెప్పేయాల్సిన అవసరం లేదని, పాత్రలను పరిచయం చేస్తే సరిపోతుందని శోభు వ్యాఖ్యానించారు.
ఈ రౌండ్‌టేబుల్ చర్చకు హాజరైన సాయి ధరమ్ తేజ్ తన విరూపాక్ష బృందం విడుదలకు చాలా ముందు పాత్రల పరిచయ కార్యక్రమం చేసి, సినిమాలో పాత్రల పేర్లు .. వారు ధరించే దుస్తులు వగైరా అంశాలను రివీల్ చేసామని ఇది సినిమా విజయానికి సహకరించిందని కూడా తెలిపారు. అయితే సమావేశంలో శ్రీయా రెడ్డి చేసిన కామెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. పొన్నియన్ సెల్వన్ తమిళులకు గొప్ప సినిమా కావచ్చేమో కానీ, దాని కథనంలో ఉన్న గందరగోళం కొందరిని ఇప్పటికీ కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటుంది. దిశా గమనం లేని కథనంపై కొంత ఇర్రిటేట్ అయినవారు లేకపోలేదు.