వేధింపులను ఎలా ఎదురుకోవాలో.. ఐశ్వర్యారాయ్ సలహా..
వీధిలో వెళుతుంటే మహిళలపై కామెంట్లు చేసేవాళ్లుంటారు. వెకిలి వేషాలు.. కొంటె చూపుల గురించి చెప్పాల్సిన పనిలేదు.
వీధిలో వెళుతుంటే మహిళలపై కామెంట్లు చేసేవాళ్లుంటారు. వెకిలి వేషాలు.. కొంటె చూపుల గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ తరహా వేధింపులను ఎలా ఎదుర్కోవాలో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ కొన్ని టిప్స్ చెప్పారు. తాజా వీడియోలో ఐష్ మాట్లాడుతూ మహిళలు స్వీయ విలువల విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేనే లేదని అన్నారు.
``వీధిలో వేధింపులు ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోండి.. సమస్యను వదిలేసి దూరంగా వెళ్లకండి..! కంటి చూపును ఎటో తిప్పేయొద్దు. నేరుగా సమస్య కళ్లలోకి చూడండి.. తలెత్తుకుని తిరగండి. స్త్రీ .. స్త్రీవాదం అవసరం. నా శరీరం.. నా విలువ.. అనేవి తెలుసుకుని ఎప్పుడూ ఎక్కడా రాజీపడకండి. మీ విలువ విషయంలో మిమ్మల్ని మీరు అనుమానించకండి`` అని సూచించారు ఐష్. మహిళలపై హింస నిర్మూలన కోసం ఈ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా స్ట్రీట్ లో వేధింపులను ఎలా ఎదుర్కోవాలో ఐశ్వర్యారాయ్ తనదైన శైలిలో సలహాలు సూచనలు ఇచ్చారు. మనమంతా మన విలువను గుర్తెరిగి ప్రవర్తించాలని కూడా మహిళలకు సూచించారు.
ఐశ్వర్య రాయ్ బచ్చన్ 1994లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుపొందారు. దేవదాస్, హమ్ దిల్ దే చుకే సనమ్, ఇరువర్, గురు, గుజారిష్, జోధా అక్బర్, తాల్, రెయిన్‌కోట్, జీన్స్, బ్రైడ్ అండ్ ప్రిజుడీస్ , మొహబ్బతీన్ సహా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. పారిస్ ఫ్యాషన్ వీక్, కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వంటి అనేక అంతర్జాతీయ వేదికలపై ఐష్ మెరుపులు మెరిపించారు. ఇప్పటికీ ఈ వేడుకలకు రెగ్యులర్ హాజరవుతోంది. ఐశ్వర్యరాయ్ బచ్చన్ చివరిగా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్: 2 లో నటించారు. దీనికి సైమా లో ఉత్తమ నటి అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.