సినీ ఇండస్ట్రీని ఏలడానికి దూసుకొస్తున్న నాయకుడి కొడుకు
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి అతడు సినీనేపథ్యంలోకి మారాలనుకుంటున్నాడు.
పిల్లలు రెగ్యులర్ గా వారి తల్లిదండ్రులు లేదా కుటుంబంలోని సీనియర్ల మార్గాన్ని అనుసరించే భారతదేశంలో అతడు అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నాడు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి అతడు సినీనేపథ్యంలోకి మారాలనుకుంటున్నాడు. రంగుల ప్రపంచంలో సినీహీరోగా ఏలాలని కలలు కంటున్నాడు. అయితే అతడి కలలు నెరవేరుతాయా లేదా? అన్నది అటుంచితే అతడి ప్రయత్నానికి అన్ని వైపుల నుంచి అండదండలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా కాబోయే హీరో?
ముంబైలో ఎవరి పేరు చెబితే గడగడలాడతారో అలాంటి ఒక నాయకుడి కొడుకు ఇప్పుడు సినీరంగంలోకి రాబోతున్నాడు. రాజకీయాల్లో దశాబ్ధాల చరిత్ర ఉన్న థాక్రే కుటుంబం నుంచి అతడు రొటీన్ కి భిన్నంగా బాలీవుడ్ లో కెరీర్ ని ఎంచుకున్నాడు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే మరో మనవడు ఐశ్వరీ ఠాక్రే కెరీర్ ఎంపిక గురించి ఇప్పుడు సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.
రొటీన్‌కి భిన్నంగా ఆలోచిస్తూ.. ఐశ్వరీ థాక్రే ఆ కుటుంబంలోనే ప్రత్యేకంగా నిలిచాడు. తన బంధువు ఆదిత్య థాకరే వలె కాకుండా ఒక యువ నాయకుడిగా మారి వారి కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళే మరో నాయకుడు కావాలని అనుకోవడం లేదు. ఐశ్వరీ థాక్రే షోబిజ్‌లో కొనసాగాలని భావిస్తున్నాడు. ఐశ్వరి వినోద రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఐదేళ్లకు పైగా కష్టపడ్డాడు.అతడు 2015లో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ 'బాజీరావ్ మస్తానీ`కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అప్పటి నుండి అతడు తన నటనా నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. పరిశ్రమలోని వ్యక్తులు అతని ప్రతిభను ప్రశంసించారు. అతడు శాశ్వత ప్రభావాన్ని చూపగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడని భావిస్తున్నారు. అతడి కుటుంబ నేపథ్యం విభిన్నంగా ఉన్నా కానీ.. ఐశ్వరీ తన ఇంటిపేరుతో వచ్చే స్పాట్లైట్ నుండి దూరంగా మసులుతున్నాడు. తన పనితనం స్వయంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. తండ్రి తాత పేర్లను అతడు ఉపయోగించుకోదలుచుకోలేదు.
ఐశ్వరీ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. అతడు స్మితా ఠాక్రే - దివంగత జైదేవ్ ఠాక్రేల కుమారుడు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే మనవడు. ఆన్ లొకేషన్ అతడిని దగ్గరగా చూసిన వారు పరిశ్రమలో శాశ్వత ప్రభావాన్ని చూపే ప్రతిభావంతుడు అంటూ అంగీకరించారు. అందుకే ఇప్పుడు ఐశ్వరీ థాక్రేపై అందరి దృష్టి ఉంది. ఐశ్వరీ ఫిల్మ్ మేకింగ్‌లోని ప్రతి విభాగంలోనూ చాలా విషయాలను నేర్చుకున్నాడు. సినిమాలపై విపరీతమైన మక్కువను కలిగి ఉన్నాడు.
థాక్రేకి సన్నిహితంగా ఉన్న ఒక సోర్స్ ప్రకారం..ఐశ్వరి సినిమాల్లో స్థిరపడేందుకు 5 సంవత్సరాలు పాటు సెట్స్ లోనే ఉన్నాడు. సినిమాల గురించి సవివరమైన పనిని నేర్చుకుంటూ అసిస్టెంట్‌గా కొనసాగాడు. అతడికి కళ - సంగీతంపై అపారమైన ఆసక్తి ఉంది. సినిమాలు, సంగీతం, కళలు అతడి సొంతమవుతాయని ఆశిస్తున్నాడు. సాధ్యమైనంత తొందర్లోనే ఐశ్వరీ గురించిన కొన్ని పెద్ద ప్రకటనలను చూడబోతున్నామనేది తాజా గుసగుస.
బాల్ థాక్రేపై ఆర్జీవీ సినిమా:
2005లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ మూవీ `సర్కార్` బాల్ థాక్రే జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఉత్తర భారత రాజకీయాల నుండి ప్రేరణ పొంది రామూ కథను రాసుకున్నాడు. ఇందులో అమితాబ్ బచ్చన్ పాత్ర థాకరే నుండి ప్రేరణ పొందింది. అలాగే `బాల్కడు` అనే 2015 మరాఠీ చిత్రం బాల్ థాకరే సిద్ధాంతాలపై ఆధారపడి తెరకెక్కింది. ఈ చిత్రం కోసం థాక్రే రాజకీయ జీవితానికి సంబంధించిన వాయిస్ క్లిప్పింగ్‌లను ఉపయోగించారు.
నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన బాలీవుడ్ బయోపిక్- థాక్రే. శివసేన రాజకీయ నాయకుడు సంజయ్ రౌత్ రచించారు. ఇది 25 జనవరి 2019న విడుదలైంది. శివసేన రాజకీయ నాయకుడు ఆనంద్ దిఘే జీవితం ఆధారంగా 2022లో వచ్చిన మరాఠీ చిత్రం `ధర్మవీర్`లో బాలాసాహెబ్ థాక్రే పాత్రను మకరంద్ పాధ్యే పోషించాడు.