అంత పెద్ద స్టార్ తప్పు ఒప్పుకున్నాడు
తాజా ఇంటర్వ్యూలో అజయ్ దేవగన్‌ను ఇదే విషయమై యాంకర్ ప్రశ్నించారు. సింగం ఎగైన్ చిత్రంలో ఎందుకు బలహీనంగా కనిపించారని హోస్ట్ అడిగారు.
తప్పును తప్పు అని ఒప్పుకోవడం సూపర్‌స్టార్ గొప్పతనం. తప్పు చేసాను! అని అంగీకరించడానికి నిజానికి గట్స్ ఉండాలి.. లేదా పెద్ద మనసు ఉండాలి. అలాంటి గట్స్ తనకు ఉన్నాయని నిరూపించాడు అజయ్ దేవగన్. తాను నటించిన 'సింగం ఎగైన్' బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగులు సాధించినా కానీ, ఆ తర్వాత థియేటర్లలో నిలబడలేదు. దేవగన్ కెరీర్ లో పేలవమైన నటప్రదర్శన కారణంగా విమర్శల్ని ఎదుర్కొన్నాడు. సింగం అంటే ఎనర్జీ. దూకుడు. దుడుకు స్వభావం. కానీ ఇవేవీ దేవగన్ పాత్రలో కనిపించలేదని విమర్శలొచ్చాయి. అతడి వయసు పెరిగి వృద్ధుడిగా మారినట్టే, మూడో సింగానికి వయసుడిగిపోయిందని కూడా కామెంట్లు చేసారు ప్రేక్షకులు.
అయితే ఈ పాత్రను ఇంత చెత్తగా తీర్చిదిద్దిన రోహిత్ శెట్టి సైతం సింగం పాత్ర వయసు క్రమక్రమంగా పెరుగుతుంది కదా.. అందువల్లనే తెరపై ఆ పాత్రను అలా చూపించానని అంగీకరించాడు. అయితే అతడి నిజాయితీని అటుంచితే సింగం అనగానే ఏదో ఊహించుకుని థియేటర్ కి వచ్చిన వారికి ఆశించిన ఎనర్జీని ఆ పాత్ర ఇవ్వలేకపోయింది. పైగా దేవగన్ తన నీరసమైన ప్రదర్శనతో మరింత నీరసానికి కారకుడయ్యాడని విమర్శలొచ్చాయి. అందులో ఖిలాడీ అక్షయ్ కుమార్ అతిథి పాత్రతో మైమరిపించినా కానీ, ఇతర పాత్రల్లో సత్తువ లేదని తేలిపోయింది. కారణం ఏదైనా కానీ అది బాక్సాఫీస్ వద్ద ఫుల్ రన్ లో ఆశించిన మార్క్ ను చేరలేకపోయింది. చివరికి యావరేజ్ మూవీగానే మిగిలింది.
తాజా ఇంటర్వ్యూలో అజయ్ దేవగన్‌ను ఇదే విషయమై యాంకర్ ప్రశ్నించారు. సింగం ఎగైన్ చిత్రంలో ఎందుకు బలహీనంగా కనిపించారని హోస్ట్ అడిగారు. అజయ్ దేవగన్ జవాబిస్తూ.. ఈ వ్యాఖ్యలను తాను కూడా విన్నానని, తదుపరి చిత్రంలో ఆ లోపాన్ని సరిదిద్దుకుంటానని జవాబిచ్చారు. దేవగన్ చాలా నిజాయితీగా తప్పును అంగీకరించారు. కానీ జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది. అజయ్ దేవగన్ 'దృశ్యం' లాంటి థ్రిల్లర్‌లో ఎంతో అద్భుతంగా కుదిరాడు. ఒకవేళ పెరిగిన వయసు రీత్యా కుదరదు అనుకుంటే తన వయసుకు తగ్గ పాత్రలు మాత్రమే చేయాలి. భారీ స్టంట్స్ తో రౌద్రం పండించే యాక్షన్ సినిమాలు ఆ వయసుకు సూటవ్వవు అనుకుంటే, వాటిని వదిలేయాలి. ఇకపై ఆ తప్పును రిపీట్ చేయనని దేవగన్ మాటిచ్చారు గనుక అది హర్షించదగినది.